భారత గడ్డపై 4వేల పరుగుల విరాట్ కొహ్లీ!

ఆస్ట్ర్రేలియాతో ఆఖరి టెస్టులో భారత క్రికెట్ పరుగుల యంత్రం విరాట్ కొహ్లీ జంట రికార్డులు నెలకొల్పాడు.

Advertisement
Update: 2023-03-12 06:02 GMT

భారత గడ్డపై 4వేల పరుగుల విరాట్ కొహ్లీ!

ఆస్ట్ర్రేలియాతో ఆఖరి టెస్టులో భారత క్రికెట్ పరుగుల యంత్రం విరాట్ కొహ్లీ జంట రికార్డులు నెలకొల్పాడు. 15 ఇన్నింగ్స్ తర్వాత తన తొలిటెస్ట్ హాఫ్ సెంచరీ సాధించడంతో పాటు..స్వదేశీగడ్డపై 4వేల టెస్టు పరుగుల మైలురాయిని చేరుకోగలిగాడు...

సాంప్రదాయ టెస్టు క్రికెట్లో గత కొద్దిమాసాలుగా దారితప్పిన భారత దిగ్గజ బ్యాటర్ విరాట్ కొహ్లీ తిరిగి గాడిలో పడ్డాడు. బోర్డర్- గవాస్కర్ ట్రోఫీ సిరీస్ లో భాగంగా అహ్మదాబాద్ లో జరుగుతున్న ఆఖరి టెస్టులో తన 29వ అర్థశతకం పూర్తి చేయడం ద్వారా జంట రికార్డులు సొంతం చేసుకొన్నాడు.

టెస్ట్ మూడోరోజు ఆటలో కంగారూ బౌలర్లను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొంటూ 128 బంతుల్లో 59 పరుగుల నాటౌట్ స్కోరు సాధించడం ద్వారా భారతగడ్డపై 4వేల టెస్టు పరుగులు సాధించిన ఐదో బ్యాటర్ గా రికార్డుల్లో చేరాడు.

ఆ నలుగురి సరసన విరాట్...

భారతగడ్డపై 4వేల టెస్టు పరుగులు గతంలోనే సాధించిన ఆల్ టైమ్ గ్రేట్ బ్యాటర్లలో మాస్టర్ సచిన్ టెండుల్కర్, రాహుల్ ద్రావిడ్, సునీల్ గవాస్కర్, వీవీఎస్ లక్ష్మణ్ ల సరసన విరాట్ నిలిచాడు.

నాలుగువేల పరుగుల మైలురాయిని అత్యంత వేగంగా చేరిన మూడో బ్యాటర్ గా విరాట్ రికార్డుల్లో చోటు సంపాదించాడు. భారతగడ్డపై కేవలం 77 ఇన్నింగ్స్ లోనే విరాట్ 4వేల పరుగుల రికార్డు సాధించగలిగాడు.

రాహుల్ ద్రావిడ్ 88 ఇన్నింగ్స్ లోనూ, సునీల్ గవాస్కర్ 87 ఇన్నింగ్స్ లోనూ 4వేల పరుగులు సాధించగలిగారు. విరాట్ 58.82 సగటుతో 4వేల పరుగుల రికార్డు నెలకొల్పడం మరో విశేషం.

14మాసాల తర్వాత తొలి హాఫ్ సెంచరీ...

ప్రస్తుత అహ్మదాబాద్ టెస్టుకు ముందు వరకూ తన కెరియర్ లో ఇప్పటికే 107 మ్యాచ్ లు ఆడిన విరాట్ కు 27 సెంచరీలు, 28 హాఫ్ సెంచరీలు సాధించిన అరుదైన రికార్డు ఉంది. అయితే గత 14 మాసాల కాలంలో సెంచరీ సంగతి అటుంచి..హాఫ్ సెంచరీ సాధించడంలో విపలమైన విరాట్.. అహ్మదాబాద్ టెస్ట్ అర్థశతకంతో ఊపిరిపీల్చుకోగలిగాడు.

424 రోజుల సుదీర్ఘవిరామం తర్వాత కానీ విరాట్ టెస్టుల్లో తన 29వ అర్థశతకం నమోదు చేశాడు. జనవరి 22న దక్షిణాఫ్రికా పై చివరిసారిగా హాఫ్ సెంచరీ సాధించిన విరాట్ మరో అర్ధశతకం కోసం ఇంతగా ఎదురుచూడాల్సి వచ్చింది.

బ్రయన్ లారా ను మించిన విరాట్...

ఆస్ట్ర్రేలియా ప్రత్యర్థిగా అత్యధిక పరుగులు సాధించిన రెండో బ్యాటర్ ఘనతను విరాట్ కొహ్లీ సొంతం చేసుకొన్నాడు. వెస్టిండీస్ మాజీ కెప్టెన్, దిగ్గజ బ్యాటర్ బ్రయన్ లారాను విరాట్ అధిగమించాడు.

34 సంవత్సరాల విరాట్ 89 టెస్టులు, 104 ఇన్నింగ్స్ లో విరాట్ 50.84 సగటుటో 4వేల 729 పరుగులు సాధించాడు. ఇందులో 15 సెంచరీలు, 24 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 169 పరుగుల అత్యధిక వ్యక్తిగత స్కోరు సైతం నమోదు చేయగలిగాడు.

బ్రయన్ లారా 82 టెస్టులు, 108 ఇన్నింగ్స్ లో 12 సెంచరీలు, 26 హాఫ్ సెంచరీలతో 4వేల 714 పరుగులు సాధించాడు. అయితే 1993లో సిడ్నీ వేదికగా జరిగిన టెస్టులో లారా అత్యధికంగా 277 పరుగుల స్కోరు నమోదు చేశాడు.

అంతర్జాతీయ క్రికెట్ మూడు ఫార్మాట్లలో కలిపి 25వేల పరుగులు సాధించిన ఆరో బ్యాటర్ గా విరాట్ రికార్డుల్లో చోటు సంపాదించాడు.

Tags:    
Advertisement

Similar News