బెంగళూరు బోల్తా..క్వాలిఫైయర్స్ -2 కు రాజస్థాన్ రాయల్స్!

ఐపీఎల్ -17వ సీజన్లో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ పోరు ముగిసింది. ఎలిమినేటర్ రౌండ్లో రాజస్థాన్ రాయల్స్ 4 వికెట్ల గెలుపుతో బెంగళూరుకు గుండెకోత మిగిల్చింది.

Advertisement
Update: 2024-05-23 04:45 GMT

ఐపీఎల్ -17వ సీజన్లో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ పోరు ముగిసింది. ఎలిమినేటర్ రౌండ్లో రాజస్థాన్ రాయల్స్ 4 వికెట్ల గెలుపుతో బెంగళూరుకు గుండెకోత మిగిల్చింది.

ఐపీఎల్- 2024 సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వరుస విజయాలకు తెరపడింది. అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరిగిన ఎలిమినేటర్ రౌండ్ పోరులో రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓటమితో టోర్నీ నుంచి నిష్క్ర్రమించింది.

బెంగళూరుకు బోల్ట్, అశ్విన్ పగ్గాలు...

రౌండ్ రాబిన్ లీగ్ ఆఖరి ఆరు రౌండ్ల మ్యాచ్ ల్లో డబుల్ హ్యాట్రిక్ విజయాలతో ప్లే-ఆఫ్ రౌండ్ కు దూసుకొచ్చిన బెంగళూరుకు నాకౌట్ ఎలిమినేటర్ రౌండ్లో చుక్కెదురయ్యింది.

ఈ కీలక పోరులో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన బెంగళూరుకు రాజస్థాన్ ఓపెనింగ్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ ..పవర్ ప్లే ఓవర్లలోనే పగ్గాలు వేశాడు.

కెప్టెన్ డూప్లెసీ 17, వన్ డౌన్ కామెరూన్ గ్రీన్ 27, మిడిలార్డర్ బ్యాటర్ రజత్ పాటిదార్ 34 పరుగులకు అవుట్ కాగా...స్టార్ బ్యాటర్ విరాట్ కొహ్లీని లెగ్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్ బోల్తా కొట్టించాడు.

విరాట్ 24 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్ తో 33 పరుగుల స్కోరుకు అవుటయ్యాడు. లోయర్ మిడిలార్డర్ బ్యాటర్ లోమర్ 32, దినేశ్ కార్తీక్ 11 పరుగులు సాధించడంతో బెంగళూరుజట్టు 20 ఓవర్లలో 8 వికెట్లకు 172 పరుగులు మాత్రమే చేయగలిగింది.

రాజస్థాన్ సీనియర్ బౌలర్లు బౌల్ట్ 4 ఓవర్లలో 16 పరుగులిచ్చి 1 వికెట్, అశ్విన్ 4 ఓవర్లలో 19 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టడం ద్వారా బెంగళూరును తక్కువ స్కోరుకే పరిమితం చేయగలిగారు.

అశ్విన్ తన ఐపీఎల్ కెరియర్ లో 211 మ్యాచ్ లు ఆడి 180 వికెట్లు పడగొట్టగలిగాడు.

విరాట్ 8 వేల పరుగుల రికార్డు..

33 పరుగుల స్కోరుకు విరాట్ అవుట్ కావడంతో..ప్రస్తుత సీజన్లో ఆడిన 15 మ్యాచ్ ల్లో 741 పరుగులతో ఆరెంజ్ క్యాప్ ను సాధించగలిగాడు. ఈ క్రమంలో విరాట్ 8వేల పరుగుల మైలురాయిని చేరిన తొలి బ్యాటర్ గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.

2008 నుంచి 2024 వరకూ జరిగిన 17 సీజన్ల ఐపీఎల్ లో 8వేల పరుగులు సాధించిన తొలి, ఏకైక బ్యాటర్ గా విరాట్ చరిత్ర సృష్టించాడు. ప్రస్తుత సీజన్లో విరాట్ 64 సగటుతో 155 స్ట్ర్రయిక్ రేటుతో పాటు ఓ సెంచరీ, 5 హాఫ్ సెంచరీలతో తన జోరును కొనసాగించాడు.

విరాట్ 2008 నుంచి ప్రస్తుత సీజన్ వరకూ 244 ఇన్నింగ్స్ లో 8004 పరుగులతో 38.66 సగటు నమోదు చేయగలిగాడు.

దినేశ్ కార్తీక్ అల్విదా...

బెంగళూరు జట్టులోని వెటరన్ వికెట్ కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తీక్ సైతం తన ఐపీఎల్ కెరియర్ కు స్వస్తి పలికాడు.2008 నుంచి 2024 వరకూ తన ఐపీఎల్ కెరియర్ లో ఆరు ఫ్రాంచైజీలకు ప్రాతినిథ్యం వహించిన దినేశ్ కార్తీక్ 247 మ్యాచ్ ల్లో 4వేల 606 పరుగులు సాధించాడు. 133 స్ట్ర్రయిక్ రేటుతో 26.02 సగటు నమోదు చేశాడు. 97 పరుగులన నాటౌట్ స్కోరుతో మొత్తం 20 హాఫ్ సెంచరీలు సాధించాడు.

యశస్వి, రియాన్ ల జోరుతో రాజస్థాన్ గెలుపు..

మ్యాచ్ నెగ్గాలంటే 20 ఓవర్లలో 173 పరుగులు చేయాల్సిన రాజస్థాన్ రాయల్స్ కు ఓపెనింగ్ జోడీ యశస్వీ- టామ్ కోలెర్ మొదటి వికెట్ కు 5.3 ఓవర్లలో 46 పరుగుల భాగస్వామ్యంతో చక్కటి ఆరంభాన్ని ఇచ్చారు.

యశస్వీ 45, టామ్ 20, కెప్టెన్ సంజు 17 పరుగులకు అవుట్ కాగా..మిడిలార్డర్ బ్యాటర్లు రియాన్ పరాగ్ 36, హెట్ మేయర్ 26, రోన్ మన్ పావెల్ 16 పరుగులు సాధించడంతో రాజస్థాన్ మరో 6 బంతులు మిగిలిఉండగానే 4 వికెట్ల విజయంతో విజేతగా నిలిచింది.

రాజస్థాన్ విజయంలో ప్రధానపాత్ర వహించిన ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ నెల 24న చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా జరిగే క్వాలిఫైయర్ -2 పోరులో హైదరాబాద్ సన్ రైజర్స్ తో రాజస్థాన్ రాయల్స్ అమీతుమీ తేల్చుకోనుంది.

హైదరాబాద్- రాజస్థాన్ జట్ల పోరులో నెగ్గినజట్టు ఈనెల 26న చెన్నై వేదికగానే జరిగే టైటిల్ పోరులో కోల్ కతా నైట్ రైడర్స్ తో పోటీపడాల్సి ఉంది.

Tags:    
Advertisement

Similar News