ఐపీఎల్ ఎలిమినేటర్ రౌండ్లో నేడు ' రాయల్' ఫైట్!

ఐపీఎల్ ఎలిమినేటర్ ఫైట్ కు మాజీ చాంపియన్ రాజస్థాన్ రాయల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు సై అంటే సై అంటున్నాయి. అహ్మదాబాద్ వేదికగా రాత్రి 7-30కి ఈ నాకౌట్ సమరానికి తెరలేవనుంది.

Advertisement
Update: 2024-05-22 08:56 GMT

ఐపీఎల్ ఎలిమినేటర్ ఫైట్ కు మాజీ చాంపియన్ రాజస్థాన్ రాయల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు సై అంటే సై అంటున్నాయి. అహ్మదాబాద్ వేదికగా రాత్రి 7-30కి ఈ నాకౌట్ సమరానికి తెరలేవనుంది.

దేశవిదేశాలలోని కోట్లాదిమంది అభిమానులను గత ఐదువారాలుగా ఓలలాడిస్తూ వచ్చిన ఐపీఎల్ -17వ సీజన్ సమరం దాదాపుగా ముగింపు దశకు చేరింది.

70 మ్యాచ్ ల తొలిఅంచె డబుల్ రౌండ్ రాబిన్ లీగ్, మూడు మ్యాచ్ ల ప్లే-ఆఫ్ దశలోని తొలి క్వాలిఫైయర్స్ పోరు ముగియటంతో..విజేతను నిర్ణయించడానికి మరో రెండుమ్యాచ్ లు మాత్రమే మిగిలి ఉన్నాయి.

అహ్మదాబాద్ వేదికగా జరిగిన తొలి క్వాలిఫైయర్ పోరు ఏకపక్షంగా ముగియడంతో...ఇప్పుడు అందరి దృష్టీ...మరి కొద్దిగంటల్లో ప్రారంభమయ్యే ఎలిమినేటర్ రౌండ్ మీదకు మళ్లింది.

రాజస్థాన్ ఇలా...బెంగళూరు అలా....

లీగ్ టేబుల్ మూడు, నాలుగు స్థానాలలో నిలవడం ద్వారా ఎలిమినేటర్ ఫైట్ కు అర్హత సాధించిన మాజీ చాంపియన్ రాజస్థాన్ రాయల్స్, రన్నరప్ బెంగళూరు రాయల్ చాలెంజర్స్ జట్ల పోరు ఆసక్తికరంగా సాగనుంది.

రౌండ్ రాబిన్ లీగ్ మొదటి 9 రౌండ్లలో 8 విజయాలు సాధించిన రాజస్థాన్ రాయల్స్ చివరి ఆరురౌండ్లలో వరుసగా నాలుగు పరాజయాలతో తేలిపోయింది. అదే బెంగళూరు జట్టు..చివరి 6 రౌండ్లలో ఆరు విజయాలు సాధించడం ద్వారా అందరి అంచనాలు తలకిందులు చేసి మరీ ప్లే-ఆఫ్ రౌండ్ కు అర్హత సంపాదించగలిగింది.

డూప్లెసీ నాయకత్వంలోని బెంగళూరు జట్టుకు ఓపెనర్ , ఆరెంజ్ క్యాప్ హోల్డర్ విరాట్ కొహ్లీ కొండంత అండగా ఉన్నాడు. 14 రౌండ్ల మ్యాచ్ ల్లో 700కు పైగా పరుగులు సాధించిన విరాట్...ఎలిమినేటర్ రౌండ్లోనూ కీలకంకానున్నాడు.

మిడిలార్డర్లో రజత్ పాటిదార్, గ్లెన్ మాక్స్ వెల్, దినేశ్ కార్తీక్ ల పైనే బెంగళూరు బ్యాటింగ్ ప్రధానంగా ఆధారపడి ఉంది.

గందరగోళంలో సంజు సేన....

గత ఆరు రౌండ్ల పోరులో నాలుగు పరాజయాలతో డీలా పడిపోయిన రాజస్థాన్ రాయల్స్ సర్వశక్తులూ కూడ దీసుకొని ఆడగలిగితేనే బెంగళూరుకు గట్టి పోటీ ఇవ్వగలుగుతుంది.

యువఓపెనర్ యశస్వి జైశ్వాల్- స్టాప్ గ్యాప్ ఓపెనర్ టామ్ కోలెర్ , కెప్టెన్ సంజు శాంసన్, స్టార్ బ్యాటర్ రియాన్ పరాగ్ స్థాయికి తగ్గట్టుగా బ్యాటింగ్ చేయగలిగితేనే..రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించగలుగుతుంది.

ఇంపాక్ట్ ప్లేయర్ ధృవ్ జురెల్, వీరబాదుడు రోవ్ మన్ పావెల్ సైతం ప్రధానపాత్ర పోషించనున్నారు.

బౌలింగ్ లో రాజస్థాన్ దే పైచేయి...

బౌలింగ్ విభాగంలో బెంగళూరు కంటే రాజస్థాన్ జట్టే పటిష్టంగా కనిపిస్తోంది. పవర్ ప్లే ఓవర్లలో వికెట్లు తీయటంలో మొనగాడుగా పేరుపొంది్న ట్రెంట్ బౌల్ట్, సఫారీ పేసర్ నాంద్రే బర్గర్, మీడియం పేసర్ సందీప్ శర్మతో పాటు స్పిన్ జోడీ రవిచంద్రన్ అశ్విన్, యజువేంద్ర చహాల్ ల నుంచి బెంగళూరు బ్యాటర్లకు అసలు సిసలు పరీక్ష ఎదురుకానుంది. బెంగళూరు ప్రత్యర్థిగా 26 వికెట్లు సాధించిన సందీప్ శర్మ ..రాజస్థాన్ రాయల్స్ కు తురుపుముక్క కానున్నాడు.

మరోవైపు..బెంగళూరు బౌలింగ్ ఎటాక్ లో మహ్మద్ సిరాజ్, యాశ్ దయాల్, కరణ్ శర్మ, లాకీ ఫెర్గూసన్, మాక్స్ వెల్, స్వప్నీల్ సింగ్ కీలకం కానున్నారు.

డాషింగ్ ఓపెనర్ జోస్ బట్లర్ అందుబాటులో లేని లోటును ప్రధానంగా ఓపెనర్ యశస్వీ, కెప్టెన్ సంజు శాంసన్ , రియన్ పరాగ్ పూడ్చాల్సి ఉంది.

బెంగళూరు 15- జైపూర్ 13..

రెండుజట్ల ఫేస్ టు ఫేస్ రికార్డులు చూస్తే..రాజస్థాన్ రాయల్స్ ప్రత్యర్థిగా బెంగళూరుదే పైచేయిగా ఉంది. బెంగళూరుకు 15 విజయాలు, రాజస్థాన్ కు 13 విజయాల రికార్డు ఉంది.

2020 తరువాత నుంచి జైపూర్ పై 7-3 రికార్డుతో ఉన్న బెంగళూరు..ప్రస్తుత ఎలిమినేటర్ రౌండ్లో సైతం హాట్ ఫేవరెట్ గా ఉంది. నాకౌట్ రౌండ్లో ఈ రెండుజట్ల రికార్డు సైతం ఇంచుమించు ఒకేలా ఉంది.

బెంగళూరు జట్టు 6 విజయాలు, 9 పరాజయాల రికార్డుతో ఉంటే..జైపూర్ జట్ు 4 విజయాలు, 5 పరాజయాలతో ఉంది.

హైస్కోరింగ్ తో పోరు సాగేనా?

45 డిగ్రీలకు పైగా ఎండవేడిమితో ఉడికిపోతున్న అహ్మదాబాద్ స్టేడియం పిచ్ పొడిబారడంతో భారీస్కోర్లు ఖాయమని, పరుగులు వెల్లువెత్తనున్నాయని క్యూరేటర్ చెబుతున్నారు.

టాస్ నెగ్గిన జట్టు ముందుగా బ్యాటింగ్ కు దిగడం కంటే..బౌలింగ్ వైపే మొగ్గు చూపే అవకాశం ఉంది. ముందుగా బ్యాటింగ్ కు దిగిన సమయంలో ఎక్కువ పరాజయాలు పొందిన జైపూర్ జట్టుకు చేజింగ్ లోనే మెరుగైన రికార్డు ఉంది.

రాజస్థాన్ బౌలర్లకూ...బెంగళూరు బ్యాటర్లకూ నడుమ జరిగే ఈ పోరు హోరాహోరీగా సాగుతుందా?..లేక క్వాలిఫైయర్స్-1లానే ఏకపక్షంగా ముగిసిపోతుందా?..తెలుసుకోవాలంటే మరికొద్ది గంటలపాటు వేచిచూడక తప్పదు.

Tags:    
Advertisement

Similar News