ఆరేళ్ల తర్వాత ఐపీఎల్ ఫైనల్లో హైదరాబాద్!

ఐపీఎల్ ఫైనల్స్ కు ఆరేళ్ల తరువాత హైదరాబాద్ జట్టు చేరుకొంది. రెండో క్వాలిఫైయర్స్ పోరులో రాజస్థాన్ రాయల్స్ ను 36 పరుగులతో చిత్తు చేసింది.

Advertisement
Update: 2024-05-25 11:05 GMT

ఐపీఎల్ ఫైనల్స్ కు ఆరేళ్ల తరువాత హైదరాబాద్ జట్టు చేరుకొంది. రెండో క్వాలిఫైయర్స్ పోరులో రాజస్థాన్ రాయల్స్ ను 36 పరుగులతో చిత్తు చేసింది.

ఐపీఎల్ -17వ సీజన్ ఫైనల్స్ కు మాజీ చాంపియన్ హైదరాబాద్ సన్ రైజర్స్ ఆరేళ్ల విరామం తరువాత చేరుకొంది. సెమీఫైనల్స్ లాంటి క్వాలిఫైయర్స్ -2 పోరులో స్థాయికి తగ్గట్టుగా ఆడి మాజీ చాంపియన్ రాజస్థాన్ రాయల్స్ ను అలవోకగా ఓడించింది. సూపర్ సండే టైటిల్ పోరులో రెండుసార్లు విజేత కోల్ కతా నైట్ రైడర్స్ తో అమీతుమీ తేల్చుకోనుంది.

చెపాక్ పిచ్ పైన రాజస్థాన్ కు షాక్...

తనకు అత్యంత అనుకూలమైన చెన్నై చెపాక్ స్టేడియం పిచ్ వేదికగా జరిగిన క్వాలిఫైయర్స్ -2 పోరులో హైదరాబాద్ సన్ రైజర్స్ కు రాజస్థాన్ రాయల్స్ సరిజోడీ కాలేకపోయింది.

కీలక టాస్ నెగ్గి ఫీల్డింగ్ ఎంచుకొన్నా పరిస్థితిని తనకు అనువుగా మలచుకోడంలో సంజు శాంసన్ నాయకత్వంలోని రాజస్థాన్ జట్టు విఫలమయ్యింది. ప్రధానంగా..తురుపుముక్క లాంటి స్పిన్ జోడీ రవిచంద్రన్ అశ్విన్, యజువేంద్ర చహాల్ లు కేవలం 80 ఓవర్లలోనే 80 పరుగులు సమర్పించుకొని..కనీసం ఒక వికెట్టూ పడగొట్టలేక తమ జట్టు ఓటమికి ప్రధాన కారకులుగా నిలిచారు.

హెడ్, రాహుల్, క్లాసెన్ ధూమ్ ధామ్ బ్యాటింగ్...

టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన హైదరాబాద్ సన్ రైజర్స్..బ్యాటింగ్ కు అంతగా అనువుకాని చెపాక్ పిచ్ పైన 20 ఓవర్లలో 175 పరుగుల మ్యాచ్ విన్నింగ్ స్కోరు సాధించగలిగింది.

ఓపెనర్ ట్రావిస్ హెడ్ 34, వన్ డౌన్ రాహుల్ త్రిపాఠీ 37, వికెట్ కీపర్ బ్యాటర్ క్లాసెన్ 50, ఆల్ రౌండర్ షాబాజ్ అహ్మద్ 18 బంతుల్లో 18 పరుగులు సాధించడంతో సన్ రైజర్స్ 175 పరుగుల స్కోరు సాధించగలిగింది.

రాజస్థాన్ బౌలర్లలో పేస్ జోడీ ట్రెంట్ బౌల్ట్, ఆవేశ్ ఖాన్ చెరో 3 వికెట్లు, సందీప్ శర్మ 2 వికెట్లు పడగొట్టారు. అశ్విన్ 4 ఓవర్లలో 43 పరుగులు, చహాల్ 4 ఓవర్లలో 34 పరుగులు ఇవ్వటంతో సన్ రైజర్స్ కు సంజు సేన పగ్గాలు వేయలేకపోయింది.

రైజర్స్ స్పిన్ లో జైపూర్ గల్లంతు...

మ్యాచ్ నెగ్గాలంటే 20 ఓవర్లలో 176 పరుగుల లక్ష్యంతో చేజింగ్ కు దిగిన రాజస్థాన్ మిడిల్ ఓవర్లలో రైజర్స్ స్పిన్ జోడీ షాబాజ్, అభిషేక్ శర్మల మ్యాజిక్ లో గల్లంతయ్యింది. వరుసగా 5 వికెట్లు కోల్పోడంతో మరి తేరుకోలేకపోయింది.

ఓపెనర్ యశస్వీ జైశ్వాల్ 42, మరో ఓపెనర్ టామ్ 10, కెప్టెన్ సంజు శాంసన్ 10, స్టార్ బ్యాటర్ రియాన్ పరాగ్ 6 పరుగుల స్కోర్లకే దొరికిపోయారు.

మిడిలార్డర్లో ధృవ్ జురెల్ ఒక్కడే పోరాడినా ప్రయోజనం లేకపోయింది. ధృవ్ 35 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 56 పరుగుల అజేయ స్కోరుతో నిలిచినా...రాజస్థాన్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 139 పరుగులు మాత్రమే చేయగలిగింది.

సన్ రైజర్స్ బౌలర్లలో లెఫ్టామ్ స్పిన్ జోడీ షాబాజ్, అభిశేక్ కలసి 5 వికెట్లు, కమిన్స్ , నటరాజన్ చెరో వికెట్ పడగొట్టారు. ఆఖరి 6 బంతుల్లో 42 పరుగులు చేయాల్సిన రాజస్థాన్ రాయల్స్ 36 పరుగుల ఓటమితో టోర్నీ నుంచి నిష్క్ర్రమించింది.

సన్ రైజర్స్ విజయంలో ప్రధానపాత్ర వహించిన షాబాజ్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

2016 తరువాత తొలి ఫైనల్స్...

ఐపీఎల్ చరిత్రలో రెండుసార్లు విజేతగా నిలిచిన హైదరాబాద్ ఫ్రాంచైజీ జట్టు 2016 టైటిల్ విజయం తరువాత ఐపీఎల్ ఫైనల్స్ చేరడం ఇదే మొదటిసారి. గతంలో డెక్కన్ చార్జర్స్ పేరుతో తొలి టైటిల్ నెగ్గిన హైదరాబాద్ 2016లో డేవిడ్ వార్నర్న నాయకత్వంలో హైదరాబాద్ సన్ రైజర్స్ గా రెండో టైటిల్ గెలుచుకొంది.

ప్రస్తుత 17వ సీజన్లో యాండీ కమిన్స్ కెప్టెన్సీలో లీగ్ దశ నుంచి క్వాలిఫైయర్స్ వరకూ పరుగుల హోరు, రికార్డుల జోరుతో మరోసారి ఫైనల్స్ చేరడం విశేషం. ఆదివారం జరిగే టైటిల్ పోరులో మాజీ చాంపియన్, లీగ్ టేబుల్ టాపర్ కోల్ కతా నైట్ రైడర్స్ తో సన్ రైజర్స్ ఢీ కోనుంది.

10 జట్ల లీగ్ టేబుల్ మొదటి రెండుస్థానాలలో నిలిచినజట్లే చివరకు టైటిల్ పోరులో నిలవడం మరో విశేషం.

Tags:    
Advertisement

Similar News