ప్రపంచకప్ లో నేడు బ్రాంజ్ మెడల్ ఫైట్...

ఫిఫా ప్రపంచకప్ ఫుట్ బాల్ టోర్నీలో బ్రాంజ్ మెడల్ కోసం ఈ రోజు జరిగే పోరులో గతేడాది రన్నరప్ క్రొయేషియాతో ఆఫ్రికా సంచలనం మొరాకో ఢీకోనుంది.

Advertisement
Update: 2022-12-17 08:02 GMT

FIFA World Cup 2022: ప్రపంచకప్ లో నేడు బ్రాంజ్ మెడల్ ఫైట్

ఫిఫా ప్రపంచకప్ ఫుట్ బాల్ టోర్నీలో బ్రాంజ్ మెడల్ కోసం ఈ రోజు జరిగే పోరులో గతేడాది రన్నరప్ క్రొయేషియాతో ఆఫ్రికా సంచలనం మొరాకో ఢీకోనుంది.

2022 ఫిఫా ప్రపంచకప్ ఫుట్ బాల్ లో 3వ స్థానం కోసం ఈరోజు దోహా వేదికగా జరిగే నాకౌట్ ఫైట్ లో లూసింగ్ సెమీఫైనలిస్ట్ జట్లు మొరాకో, క్రొయేషియా అమీతుమీ తేల్చుకోనున్నాయి.

ఏకపక్షంగా ముగిసిన సెమీఫైనల్స్ లో అర్జెంటీనా చేతిలో 3-0తో క్రొయేషియా, ఫ్రాన్స్ చేతిలో 2-0తో మొరాకో పరాజయాలు పొందటంతో కాంస్య పతకం పోటీలో మిగిలాయి.

బ్రాంజ్ మెడల్ వైపు మొరాకో చూపు...

గ్రూప్ లీగ్ నుంచి క్వార్టర్ ఫైనల్స్ నాకౌట్ రౌండ్ల వరకూ సంచలన విజయాలతో సెమీస్ చేరడం ద్వారా చరిత్ర సృష్టించిన మొరాకో...మూడోస్థానం కోసం జరిగే పోరులో క్రొయేషియాను ఓడించగలిగితే అది మరో అరుదైన రికార్డుగా మిగిలిపోతుంది.

ప్రపంచకప్ చరిత్రలో క్వార్టర్ ఫైనల్ రౌండ్ చేరిన ఆఫ్రికా ఖండ తొలిజట్టుగా ఇప్పటికే సరికొత్త చరిత్ర సృష్టించిన మొరాకో..మూడోస్థానం కోసం జరిగే పోరులో నెగ్గి కాంస్య పతకం సాధించగలిగితే..ఈ ఘనత సాధించిన తొలి ఆఫ్రికా దేశంగా రికార్డు నెలకొల్పగలుగుతుంది. యూరోప్, లాటిన్ అమెరికా యేతర తొలి దేశంగా మిగులుతుంది.

పలువురు కీలక ఆటగాళ్లు, ప్రధానంగా డిఫెండర్లు గాయాలపాలు కావడం మొరాకోను దెబ్బతీసింది. బ్రాంజ్ మెడల్ పోరులో క్రొయేషియాకు ఎంతవరకూ పోటీ ఇవ్వగలదన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. అలా అని మొరాకోను తక్కువగా అంచనా వేస్తే క్రొయేషియా కంగు తినక తప్పదు.

కంచు పతకానికి క్రొయేషియా గురి...

కేవలం 30 లక్షలు జనాభా మాత్రమే కలిగిన అతిచిన్న దేశం క్రొయేషియా వరుసగా రెండోసారి ప్రపంచకప్ సెమీఫైనల్స్ చేరడం ద్వారా తనకుతానే సాటిగా నిలిచింది. 2018 ప్రపంచకప్ టోర్నీలో రన్నరప్ గా నిలిచిన క్రొయేషియా ప్రస్తుత ప్రపంచకప్ టోర్నీలో కాంస్య పతకం దక్కించుకోవాలన్న పట్టుదలతో ఉంది. పైగా తమ కెప్టెన్ మెర్డిచ్ కు ఇదే ఆఖరి ప్రపంచకప్ కావడంతో బ్రాండ్ మెడల్ తో వీడ్కోలు పలకాలని ఆ జట్టులోని ఆటగాళ్లు భావిస్తున్నారు.

డిఫెన్స్ లో పటిష్టంగా ఉన్న మొరాకో, ఆల్ రౌండ్ గేమ్ తో నిలకడగా ఆడే క్రొయేషియాజట్ల పోరు ఆసక్తికరంగా సాగే అవకాశం ఉంది. రెండుజట్లూ మ్యాచ్ ను పెనాల్టీ షూటౌ ట్ వరకూ తీసుకెళ్ళాలన్న వ్యూహంతోనే బరిలోకి దిగనున్నాయి.

నాలుగేళ్ల క్రితం ముగిసిన ప్రపంచకప్ టోర్నీలో ఫ్రాన్స్, క్రొయేషియా, బెల్జియం మొదటి మూడుస్థానాలలో నిలిస్తే...ఈసారి ఫ్రాన్స్, అర్జెంటీనా, క్రొయేషియా, మొరాకో జట్లలో ..మొదటి మూడుస్థానాలలో నిలిచే జట్లు ఏవో మరికొద్ది గంటల్లో తేలిపోనుంది.

Tags:    
Advertisement

Similar News