ఆసియాక్రీడల పతక విజేతలపై నజరానాల వర్షం!

19వ ఆసియాక్రీడల్లో భారత్ కు పతకాలు తెచ్చిన అథ్లెట్లపై కానుకల వర్షం కురుస్తోంది. భారత సైనిక దళాలతో పాటు తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వాలు నగదు బహుమతులు అందచేశాయి.

Advertisement
Update: 2023-10-18 11:07 GMT

19వ ఆసియాక్రీడల్లో భారత్ కు పతకాలు తెచ్చిన అథ్లెట్లపై కానుకల వర్షం కురుస్తోంది. భారత సైనిక దళాలతో పాటు తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వాలు నగదు బహుమతులు అందచేశాయి.

చైనాలోని హాంగ్జు వేదికగా కొద్దిరోజుల క్రితం ముగిసిన 19వ ఆసియాక్రీడల్లో భారత్ రికార్డుస్థాయిలో 107 పతకాలతో పతకాలపట్టిక 4వ స్థానంలో నిలిచింది.

ఈ 107 పతకాలలో 28 బంగారు పతకాలు సైతం ఉన్నాయి.

655 మంది సభ్యుల భారత అథ్లెట్ల బృందంలో సైనిక దళాలకు చెందిన క్రీడాకారులతో పాటు..దేశంలోని వివిధ రాష్ట్ర్రాలకు చెందినవారు సైతం ఉన్నారు.

సైనికదళాల అథ్లెట్లకే 20 పతకాలు

భారత్ సాధించిన మొత్తం 107 పతకాలలో భారత సైనికదళాలకు చెందిన క్రీడాకారులు సాధించినవే 20 పతకాలు ఉన్నాయి. 3 బంగారు, 7 రజత, 10 కాంస్య పతకాలు సైనికదళాలకు చెందిన అథ్లెట్లే దేశానికి సాధించి పెట్టారు.

పురుషుల జావలిన్ త్రోలో బంగారు పతకం సాధించిన నీరజ్ చోప్రాతో సహా పతక విజేతలను భారత సైనికదళాల అధిపతి జనరల్ మనోజ్ పాండే సత్కరించారు. పతకాలు సాధించిన రక్షణ దళాల అథ్లెట్లకు నగదు బహుమతులను సైతం కేంద్ర రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రకటించారు.

స్వర్ణపతక విజేతలకు 25 లక్షల రూపాయలు, రజత పతకం నెగ్గినవారికి 15 లక్షలు, కాంస్యం సాధించిన అథ్లెట్లకు 10 లక్షల రూపాయల చొప్పున ఇస్తున్నట్లు తెలిపారు.

1986 ఆసియాక్రీడల్లో భారత్ సాధించిన ఐదు బంగారు పతకాలలో పరుగుల రాణి పీటీ ఉష సాధించినవే నాలుగు స్వర్ణాలని..ఆ స్థితి నుంచి ప్రస్తుత క్రీడల్లో 28 బంగారు పతకాలు సాధించే స్థాయికి భారత్ ఎదగటం గర్వకారణమని చెప్పారు.

స్వతంత్రభారత చరిత్రలో భారత సైనికదళాలకు చెందిన క్రీడాకారులు ఆసియాక్రీడల్లో 20 పతకాలు సాధించడం ఇదే మొదటిసారి. క్రీడారంగంలో భారత్ సాధిస్తున్న ప్రగతిలో సైనికదళాలు సైతం తమవంతు పాత్ర పోషిస్తున్నట్లు జనరల్ పాండే తెలిపారు.

క్రీడాకారులను ప్రోత్సహించడం కోసం 2001లో ఏర్పాటు చేసిన మిషన్ ఒలింపిక్ వింగ్ ఆశించిన ఫలితాలు సాధించడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు

10మంది విదేశీ శిక్షకులు సేవలు...

2021 నుంచి సైనికదళాల క్రీడాకారులకు శిక్షణ ఇవ్వడం కోసం 10 మంది విదేశీ కోచ్ లు, భారత్ కు చెందిన 16 మంది విఖ్యాత శిక్షకులు తీవ్రంగా శ్రమించారని గుర్తు చేశారు. కామన్వెల్త్ గేమ్స్, ఆసియాక్రీడల్లో సైనికదళాలకు చెందిన క్రీడాకారులు అత్యుత్తమంగా రాణిస్తూ దేశానికే గర్వకారణంగా నిలుస్తున్నారని ప్రశంసించారు.

2006 ఖతర్ ఆసియా క్రీడల్లో 14 పతకాలు, 2010 ఆసియాక్రీడల్లో 12 పతకాలు, కొరియా వేదికగా 2014లో జరిగిన ఆసియాక్రీడల్లో 11, 2018 ఆసియాక్రీడల్లో 13 పతకాలను ఆర్మీ అథ్లెట్లు సాధించారని వివరించారు.

సైనికదళాలకు చెందిన క్రీడాకారులకు ప్రపంచ ప్రమాణాలతో కూడిన శిక్షణ సదుపాయాలు కల్పించడానికి అధికప్రాధాన్యమిస్తున్నట్లు ఆర్మీ చీఫ్ తెలిపారు. గత ఏడాది పలువురు మహిళా క్రీడాకారులకు సైనికదళాలలో ఉద్యోగాలు ఇచ్చి ప్రోత్సహించినట్లు చెప్పారు.

బాక్సింగ్, కుస్తీ, షూటింగ్, ట్రాక్ అండ్ ఫీల్డ్ విభాగాలలో మహిళలకు ఎక్కువగా అవకాశాలు కల్పించినట్లు తెలిపారు.

తమిళనాడు ప్రభుత్వ నజరానా 9 కోట్ల 40 లక్షలు...

ఆసియాక్రీడల్లో భారత్ కు పతకాలు సాధించిన తమిళనాడు క్రీడాకారులకు ముఖ్యమంత్రి ఎమ్ కే స్టాలిన్ 9 కోట్ల 40 లక్షల రూపాయలు మేర నగదు పురస్కారాలను అంద చేశారు.

భారత్ సాధించిన మొత్తం 107 పతకాలలో తమిళనాడు అథ్లెట్లు సాధించినవి 28 పతకాలు ఉన్నాయి. దేశానికి అత్యధిక పతకాలు అందించిన రాష్ట్ర్రాల వరుసలో తమిళనాడు 5వ స్థానంలో ఉందని ముఖ్యమంత్రి తెలిపారు.

స్వర్ణ విజేతలకు 50 లక్షలు..

స్వర్ణ పతకం సాధించిన ఒక్కో అథ్లెట్ కు 50 లక్షల రూపాయల చొప్పున, రజతం తెచ్చినవారికి 30 లక్షలు, కాంస్య విజేతలకు 20 లక్షల రూపాయలు చొ్ప్పున తమిళనాడు ప్రభుత్వం అందచేసింది.

ఆసియాక్రీడల్లో పాల్గొన్న 655మంది సభ్యుల భారత బృందంలో తమిళనాడుకు చెందిన క్రీడాకారులు 48 మంది ఉన్నారు. 17 రకాల క్రీడాంశాలలో 20 మంది అథ్లెట్లు 28 పతకాలు గెలుచుకొన్నట్లు తమిళనాడు క్రీడామంత్రి ఉదయనిధి తెలిపారు.

స్క్వాష్ లో బంగారు పతకాలు సాధించిన దీపిక పల్లికల్, సౌరవ్ గోశాల్, చదరంగంలో రజతాలు నెగ్గిన గ్రాండ్ మాస్టర్లు వైశాలి, ప్రజ్ఞానంద్, క్రికెట్లో స్వర్ణం నెగ్గిన వాషింగ్టన్ సుందర్ తమిళనాడుకు చెందినవారే కావడం విశేషం.

హిమాచల్ ప్రభుత్వ ప్రోత్సాహకాలు...

ఆసియాక్రీడల్లో బంగారు పతకం సాధించిన మహిళల కబడ్డీ జట్టు సభ్యుల్లో పలువురు హిమాచల్ ప్రదేశ్ కు చెందినవారే ఉన్నారు. తమ రాష్ట్ర్రానికి గర్వకారణంగా నిలిచిన క్రీడాకారులకు 10 లక్షల రూపాయల చొప్పున ఇస్తున్నట్లు హిమాచల్ ముఖ్యమంత్రి తెలిపారు.

Tags:    
Advertisement

Similar News