యోగర్ట్, కర్డ్.. రెండూ ఒకటేనా? ఆరోగ్యానికి ఏది మంచిది?

పెరుగులో బ్యాక్టీరియా తక్కువగా ఉండటంతో పాటు.. తోడు పెట్టిన దానిలో ఉండే బ్యాక్టీరియానే ఇందులో ఏర్పడుతుంది. అయితే యోగర్ట్ తయారీలో మాత్రం ఏ బ్యాక్టీరియా కావాలనుకుంటే దాన్ని ముందుగా కలుపుతారు.

Advertisement
Update: 2022-09-27 07:32 GMT

వంటల కార్యక్రమం చూస్తున్నా, ఏదైనా రిసిప్ గురించి చదువుతున్నా అప్పుడప్పుడూ 'యోగర్ట్' అనే పదార్థం గురించి వింటుంటాం. పెరుగు (కర్డ్)ను పోలి ఉండే ఈ పదార్థం ఏమిటనేది చాలా మందికి క్లారిటీ ఉండదు. ఒక్కోసారి పెరుగునే ఇంగ్లీష్‌లో యోగర్ట్ అంటారేమో అనే అనుమానం కూడా ఉంటుంది. కానీ ఇవి రెండు వేర్వేరు పదార్థాలు. చూడటానికి ఒకేలా కనిపించినా.. వాటి తయారీ, దానికి అనుసరించే పద్దతి పూర్తిగా వేరుగా ఉంటుంది.

యోగర్ట్, కర్డ్ రెండు కూడా పాల నుంచే తయారు చేస్తారు. మన దేశంలో పెరుగువాడకం అత్యధికంగా ఉంటుంది. బయట కొనుగోలు చేసే వారికంటే.. సింపుల్‌గా ఇంట్లో తోడు పెట్టుకొని పెరుగు తయారు చేసుకునే వాళ్లే ఎక్కువగా ఉంటారు. ఇది భారతీయుల భోజనంలో రెగ్యులర్‌గా వాడుతుంటారు. గోరు వెచ్చని పాలలో రాత్రి మిగిలిన పెరుగును కాస్త కలిపితే.. కొన్ని గంటల్లో పెరుగు తయారవుతుంది. సాధారణంగా తాజా పాలతోనే ఇండియాలో పెరుగు తయారు చేస్తుంటారు. తోడు పెట్టిన పెరుగులో ఉండే ప్రో బయోటిక్ బ్యాక్టీరియా ఫ్రెష్ పాలను పెరుగుగా మారుస్తుంది. అందుకే ఈ పెరుగుకు చాలా భిన్నమైన టేస్ట్, టెక్చర్ ఉంటుంది. గడ్డ పెరుగు అయినా సరే పాలల్లో ఉండే నీళ్లు సెపరేట్ అయిపోతుంటాయి.

ఇక యోగర్ట్ మాత్రం అలా తయారు చేయరు. పాలను కృత్రిమ రసాయనాల ద్వారా ఫెర్మెంట్ చేయడం వల్ల యోగర్ట్ తయారవుతుంది. ఇంటిలో కంటే కమర్షియల్‌గా ఫ్యాక్టరీల్లోనే ఎక్కువగా యోగర్ట్‌ను తయారు చేస్తుంటారు. పాలను ఒక ఉష్ణోగ్రతలోనే స్థిరంగా ఉంచి అందులో కృత్రిమ రసాయనాలు కలుపుతారు. దీంతో పెరుగుతో పోల్చితే యోగర్ట్ చాలా స్మూత్‌గా చిక్కగా కనిపిస్తుంది. పెరుగు, యోగర్ట్‌లో ప్రోబయోటిక్ బ్యాక్టీరియానే ఉంటుంది. కానీ యోగర్ట్‌లో దీని శాతం ఎక్కువగా ఉంటుంది.

పెరుగులో బ్యాక్టీరియా తక్కువగా ఉండటంతో పాటు.. తోడు పెట్టిన దానిలో ఉండే బ్యాక్టీరియానే ఇందులో ఏర్పడుతుంది. అయితే యోగర్ట్ తయారీలో మాత్రం ఏ బ్యాక్టీరియా కావాలనుకుంటే దాన్ని ముందుగా కలుపుతారు. దీంతో మనకు కావల్సిన బ్యాక్టీరియాతో కూడిన యోగర్ట్ ఏర్పడుతుంది. సాధారణంగా కర్డ్‌లో అనేక రకాలైన లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియాలు ఉంటాయి. కానీ, యోగర్ట్‌లో మాత్రం ఒకే రకమైన బ్యాక్టీరియా ఉండేలా ఫెర్మెంట్ చేస్తారు.

చాలా మందిలో లాక్టోస్ ఇంటోలరెన్స్ అనే సమస్య ఉంటుంది. అంటే, పాల పదార్థాల్లో ఉండే ఒక రకమైన చక్కెర వారి శరీరానికి పడవు. తాజా పాలతో పాటు కర్డ్‌లో ఈ లాక్టోజ్ ఉంటుంది. దీంతో లాక్టోజ్ ఇంటోలరెన్స్‌తో బాధపడే వారికి పెరుగును వైద్యులు సజెస్ట్ చేయరు. అదే సమయంలో గీక్ స్టైల్ యోగర్ట్‌ను ఇలాంటి సమస్యతో బాధపడే వారు తినాలని వైద్యులు సూచిస్తుంటారు.

శరీర ఉష్ణోగ్రతలను తగ్గించడం, జీర్ణ ప్రక్రియను మెరుగు పరచడం, గట్ హెల్త్ పెంపొందించడంలో పెరుగు ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఇందులో మిల్క్ ఫ్యాట్స్, కాల్షియం, ప్రోటీన్స్, పాస్ఫరస్ ఎక్కువగా ఉంటుంది. ఇవి ఎముకలకు బలాన్ని, పళ్ల ఆరోగ్యానికి ఉపయోగపడతాయి. ఇక యోగర్ట్‌లో ఆరోగ్యకరమైన ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. అంతే కాకుండా పలు రకాలైన యోగర్ట్‌లు మార్కెట్లో లభిస్తుండటంతో ఎవరికి నచ్చిన రకాన్ని వాళ్లు కొనుక్కునే అవకాశం ఉంటుంది. ఆర్థరైటిస్, ఓస్టియో పోరోసిస్ వంటి సమస్యలను తగ్గించడంలో యోగర్ట్ చక్కగా ఉపయోగపడుతుంది. రెండు కూడా ఆరోగ్యానికి మంచి చేసేవే.. అయితే యోగర్ట్ కమర్షియల్‌గా తయారు చేస్తారు కాబట్టి అది కొనుగోలు చేయడం కాస్త ఖరీదైన వ్యవహారం.

Tags:    
Advertisement

Similar News