జనసేనలో నాగబాబుకు కీలక బాధ్యతలు.. ప్రధాన కార్యదర్శిగా నియామకం

ఎన్నికలకు ఏడాది సమయం మాత్రమే ఉండడంతో నాగ‌బాబు సేవలు మరింత విస్తృతంగా పార్టీకి ఉపయోగపడే విధంగా కీలక బాధ్యతలు అప్పగించాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నారు. హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో నాగబాబును పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ నియామక పత్రాన్ని అందజేశారు.

Advertisement
Update: 2023-04-14 16:31 GMT

జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా పవన్ కళ్యాణ్ సోదరుడు, ప్రముఖ నటుడు నాగబాబు నియమితులయ్యారు. శుక్రవారం హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో నాగబాబుకు పవన్ కళ్యాణ్ నియామక పత్రాన్ని అందజేశారు. గతంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టిన సమయంలో నాగబాబు ఎంతో క్రియాశీలకంగా పనిచేశారు. పార్టీ ఆరంభానికి ముందే రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి అభిమానులతో సమావేశాలు నిర్వహించారు. చిరంజీవి పార్టీ పెట్టిన తర్వాత కూడా కీలక బాధ్యతలు నిర్వహించారు.

ఇక పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపించిన తర్వాత నాగబాబు కాస్త ఆలస్యంగా పార్టీలోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ ప్రస్తుతం పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. మెగా అభిమానులు, కార్యకర్తలకు తరచూ సమావేశాలు నిర్వహిస్తూ పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తున్నారు. పవన్ కళ్యాణ్‌పై ఎవరు విమర్శలు చేసినా వాటికి కౌంటర్ ఇవ్వడంలో నాగబాబు ముందుంటారు.

ప్రస్తుతం నాగబాబు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడిగా సేవలు అందిస్తున్నారు. ఎన్నికలకు ఏడాది సమయం మాత్రమే ఉండడంతో ఆయన సేవలు మరింత విస్తృతంగా పార్టీకి ఉపయోగపడే విధంగా కీలక బాధ్యతలు అప్పగించాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నారు. ఇవాళ పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో నాగబాబును పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ నియామక పత్రాన్ని అందజేశారు.

అలాగే నెల్లూరు జిల్లాకు చెందిన వేములపాటి అజయ్ కుమార్ కొద్ది రోజులుగా పార్టీ కోసం విశేష సేవలు అందిస్తుండడంతో ఆయన్ను జాతీయ మీడియా ప్రతినిధిగా నియమించారు. ప్రస్తుతం జనసేనలో పదవుల పరంగా పవన్ కళ్యాణ్ తర్వాత సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ ఉన్నారు. ఆయన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్‌గా ఉన్నారు. ప్రస్తుతం నాగబాబుకు అధ్యక్షుడు తర్వాతి పదవి అయిన ప్రధాన కార్యదర్శి పదవి అప్పగించడంతో మనోహర్‌కు మించిన పదవిని అప్పగించినట్లయింది.

Tags:    
Advertisement

Similar News