పెళ్లి బృందం బస్సుపై తెగిపడిన విద్యుత్ వైర్లు.. పలువురి దుర్మరణం

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో తీవ్ర విషాదం జరిగింది. పెళ్లి బృందం బస్సుపై హై టెన్షన్ విద్యుత్ వైర్ తెగిపడి వాహనం దగ్ధం కావడంతో అందులోని పలువురు వ్యక్తులు సజీవ దహనం అయ్యారు.

Advertisement
Update: 2024-03-11 12:14 GMT

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో తీవ్ర విషాదం జరిగింది. పెళ్లి బృందం బస్సుపై హై టెన్షన్ విద్యుత్ వైర్ తెగిపడి వాహనం దగ్ధం కావడంతో అందులోని పలువురు వ్యక్తులు సజీవ దహనం అయ్యారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాదకర సంఘటన సోమవారం ఘాజీపూర్ జిల్లాలో జరిగింది.

పెళ్లి వేడుకకు బయలుదేరిన ప్రైవేట్ బస్సు మర్దా పోలీస్ స్టేషన్ పరిధిలోని మహాహర్ ధామ్ సమీపంలో వెళుతుండగా హై టెన్షన్ విద్యుత్ వైర్ తెగి వాహనంపై పడింది. దీంతో ఒక్కసారిగా వాహనంలో మంటలు చెలరేగాయి. చూస్తుండగానే బస్సు దగ్ధం కావడంతో వాహనంలో ఉన్న ప్రయాణికులు బయటకు రాలేని పరిస్థితిలో సజీవ దహనం అయ్యారు. చాలామంది తీవ్రంగా గాయపడ్డారు.

ఈ ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే అక్కడికి చేరుకొని మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 35 మంది ప్రయాణికులు ఉన్నారు. అధికారులు ఇప్పటివరకు ఆరుగురి మృతదేహాలను వెలికితీశారు. తీవ్రంగా గాయపడ్డ వారిని సమీప ఆస్పత్రులకు తరలించారు. గాయపడ్డ వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఘాజీపూర్ ఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సహాయం అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి యోగి సంతాపం తెలియజేశారు. కాగా, ప్రమాదం జరిగినప్పుడు బస్సు దగ్ధమవుతుండగా తీసిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Tags:    
Advertisement

Similar News