జయలలితపై బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు

హిందువులు, క్రైస్తవులు, ముస్లింలు ఇలా అన్ని వర్గాల వారు కీర్తించుకునే నాయకురాలు జయలలిత అని శశికళ చెప్పారు. అమ్మ కుల, మత అడ్డంకులను అధిగమించిన గొప్ప నాయకురాలంటూ కొనియాడారు.

Advertisement
Update: 2024-05-26 03:29 GMT

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలితపై ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామలై సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు రాష్ట్రంలో జయలలిత ‘హిందుత్వ నాయకురాలి’గా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఆమె అందరికంటే ఉన్నతమైన హిందుత్వ నాయకురాలంటూ అభివర్ణించారు. ఇటీవల ఆయన జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. జయలలిత మరణం తరువాత అన్నాడీఎంకే హిందుత్వ భావజాలానికి దూరమైందని చెప్పారు. అనంతరం తమిళనాడులో ఏర్పడిన శూన్యతను పూరించడానికి బీజేపీకి మంచి అవకాశం ఉందని తెలిపారు.

బీజేపీ నేతలు కాకుండా అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి మద్దతు పలికిన వారిలో దేశంలోనే తొలి రాజకీయ నాయకురాలు జయలలిత అని అన్నామలై ఆ ఇంటర్వ్యూలో తెలిపారు. 2002–03లో తమిళనాడులో మతమార్పిడి నిరోధక చట్టాన్ని రూపొందించారని ప్రస్తావించారు. మరోవైపు అన్నామలై ప్రకటనపై జయలలిత సన్నిహితురాలు వీకే శశికళ ఘాటుగా స్పందించారు. అన్నామలై చేసిన ఈ వ్యాఖ్యలు జయలలితపై ఆయనకున్న అజ్ఞానాన్ని, అపార్థాన్ని తెలియజేస్తున్నాయని స్పష్టం చేశారు. జయలలిత లాంటి ప్రజానాయకురాలిని ఎవరూ ఇరుకున పెట్టలేరని శశికళ అన్నారు. జయలలిత తన చివరి శ్వాస వరకు ఎంజీఆర్‌ చూపిన బాటలోనే నిజమైన ద్రవిడ నాయకురాలిగా జీవించారని తెలిపారు.

హిందువులు, క్రైస్తవులు, ముస్లింలు ఇలా అన్ని వర్గాల వారు కీర్తించుకునే నాయకురాలు జయలలిత అని శశికళ చెప్పారు. అమ్మ కుల, మత అడ్డంకులను అధిగమించిన గొప్ప నాయకురాలంటూ కొనియాడారు. ప్రజల జీవితాలను మెరుగుపరిచేందుకు ఆమె తన జీవితాన్ని అంకితం చేశారని చెప్పారు. జయలలితకు దేవుడిపై నమ్మకం ఉందనే విషయం అందరికీ తెలిసిందేనని, అయితే ఆమె ఎప్పుడూ ఒకే మతాన్ని నమ్మలేదని శశికళ స్పష్టం చేశారు. అందరినీ సమానంగా చూసే ఏకైక నాయకురాలు జయలలిత అని ఆమె చెప్పారు.

Tags:    
Advertisement

Similar News