గవర్నర్ ఉండేది రాజకీయాలు చేయడానికి కాదు.. తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై ఆసక్తికర వ్యాఖ్యలు

తమిళనాడు ప్రభుత్వంపై గవర్నర్ చేస్తున్న విమర్శలు రాజకీయంగా బీజేపీకి మేలు చేసేవే అయినప్పటికీ.. అలాంటి ప్రకటనలకు గవర్నర్ దూరంగా ఉండాలని తాను కోరుకుంటున్నట్లు చెప్పారు.

Advertisement
Update: 2023-07-06 14:47 GMT

గవర్నర్లు ఉండేది రాజకీయాలు చేయడానికి కాదని.. వారు రాజకీయాలు చేయడం మొదలుపెడితే వారి హోదాకు ఉన్న గౌరవం పోతుందని తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం తమిళనాడులో సీఎం స్టాలిన్ సర్కారుకు, గవర్నర్ ఆర్ఎన్ రవి మధ్య రాజకీయ పోరు జరుగుతున్న సంగతి తెలిసిందే. స్టాలిన్ 2021లో తమిళనాడు ముఖ్యమంత్రి కాగా.. ఆయన ముఖ్యమంత్రి అయిన కొద్ది రోజులకే ఆ రాష్ట్ర గవర్నర్‌గా ఆర్ఎన్ రవిని కేంద్ర ప్రభుత్వం నియమించింది.

అయితే ఆయన గవర్నర్ గా వచ్చినప్పటి నుంచి బీజేపీకి మద్దతుగా, తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నడుచుకుంటున్నారని డీఎంకే నేతలు ఆరోపిస్తున్నారు. అసెంబ్లీలో ప్రభుత్వం చేసిన చాలా బిల్లులను ఆమోదించకుండా ఆర్ఎన్ రవి పెండింగ్‌లో పెట్టుకున్నారు.

అయితే ఇటీవల తమిళనాడు క్యాబినెట్ మంత్రి సెంథిల్ బాలాజీ అవినీతి ఆరోపణలపై అరెస్టు కాగా.. ఆయనను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేశారు గవర్నర్ ఆర్ఎన్ ర‌వి. దీనిపై డీఎంకే ప్రభుత్వం సీరియస్ అయ్యింది. చట్టపరంగా దీనిని ఎదుర్కొనేందుకు సీఎం స్టాలిన్ సిద్ధం కావడంతో గవర్నర్ ఆర్ఎన్ రవి తన నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు.

ఈ వివాదం ఇలా నడుస్తుండగా తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై గవర్నర్ ఆర్ఎన్ రవి తీరుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు ప్రభుత్వంపై గవర్నర్ చేస్తున్న విమర్శలు రాజకీయంగా బీజేపీకి మేలు చేసేవే అయినప్పటికీ.. అలాంటి ప్రకటనలకు గవర్నర్ దూరంగా ఉండాలని తాను కోరుకుంటున్నట్లు చెప్పారు.

రాష్ట్రంలో నెలకొన్న సమస్యల గురించి మాట్లాడటానికి గవర్నర్ రాజకీయ నేత కాదని అన్నారు. అలా మాట్లాడితే తప్పుడు సంకేతాలు పంపినట్లవుతుందన్నారు. గవర్నర్ ఉన్నది రాజకీయాలు చేయడానికి కాదని, ఆయన తన పని తాను చూసుకోవడమే మేలని అభిప్రాయపడ్డారు.

మరి తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆ రాష్ట్ర సమస్యల గురించి ప్రశ్నిస్తుంటారు కదా? అని మీడియా అడిగిన ప్రశ్నకు అన్నామలై సమాధానం ఇస్తూ.. గవర్నర్ మీడియా ముందుకు వచ్చి మాట్లాడితే ప్రభుత్వ అక్రమాలు బయటపడతాయని, కానీ గవర్నర్ అలా చేయకూడదనే తాను బలంగా కోరుకుంటున్నట్లు అన్నామలై చెప్పారు.

Tags:    
Advertisement

Similar News