'రాబోయేది హిందూ దేశం....ముస్లిం యువతులూ హిందూ అబ్బాయిలను పెళ్ళి చేసుకోండి'
వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో దిట్ట అయిన సుదర్షన్ టీవీ ఛీఫ్ ఎడిటర్ సురేశ్ చవాన్కే ముస్లిం యువతుల గురించి అభ్యంతరకరంగా మాట్లాడారు.
రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడంలో పేరెన్నిక గన్న సుదర్శన్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ సురేశ్ చవాన్కే మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న ఓ వీడియోలో ముస్లిం యువతులు హిందూ అబ్బాయిలను పెళ్లి చేసుకోవాలని కోరాడు. ముస్లిం యువతులు మతం మారితే పొందే ప్రయోజనాల జాబితా కూడా అతను చదివి వినించాడు. చాలా మంది ముస్లిం అమ్మాయిలు హిందూ అబ్బాయిలతో ప్రేమలో పడుతున్నారని కూడా అతను పేర్కొన్నాడు. ఢిల్లీలో నవరాత్రుల సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
'''మీరు హిందువులను వివాహం చేసుకుని, హిందువుగా మారితే మీరు విడాకులు తీసుకోనవసరం లేదు, మీరు పిల్లల ఉత్పత్తి కర్మాగారంగా మారాల్సిన అవసరం లేదు. రెండో భార్యగా ఉండాల్సిన అవసరం లేదు.'' అని ఆయన అన్నారు.
''భవిష్యత్తులో భారతదేశం హిందూ రాష్ట్రంగా మారబోతోంది. హిందూ మతంలోకి మారిన ముస్లిం యువతులు లు అందులో మొదటగా సభ్యులు అవుతారు''' అని సురేశ్ చవాన్కే అన్నారు.
హిందూ దేవుళ్లపై నమ్మకం లేని వారిని దాండియా కార్యక్రమాలకు అనుమతించవద్దని ఆయన కోరారు. ''దాండియా ఆడాలనుకునే ముస్లిం మహిళలు తమ ప్రాంతంలో కార్యక్రమాలను ఏర్పాటు చేసుకోండి. అక్కడికి మా హిందూ అబ్బాయిలను పంపేందుకు నేను సిద్ధంగా ఉన్నాను' అని ఆయన తెలిపారు.
సురేష్ చవాన్కే ఇలా వివాదాస్పదంగా మాట్లాడటం ఇది మొదటిసారి కాదు. గతేడాది ఢిల్లీలో జరిగిన హిందూ యువ వాహిని కార్యక్రమంలో ఈయన కొంతమంది వ్యక్తులతో రెచ్చగొట్టే విధంగా ప్రమాణం చేయించారు.
"ఈ దేశాన్ని హిందూ రాష్ట్రంగా మార్చడానికి మా చివరి శ్వాస వరకు పోరాడుతాము, అవసరమైతే చనిపోవడానికి, చంపడానికి మేము సిద్దంగా ఉన్నాము'' అని కొందరు యువకులతో ఈయన ప్రమాణం చేయించాడు. ఆ వీడియోను ఆయనే తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు.
కాగా ముస్లిం యువతల గురించి సురేష్ చవాన్కే చేసిన వ్యాఖ్యల పట్ల సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఆయనపై నెటిజనులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.