సోరెన్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టు అసహనం

సోరెన్‌ పిటిషన్‌పై అసహనం వ్యక్తం చేసింది. ట్రయల్‌ కోర్టులో రెగ్యులర్‌ బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేయడం, అది తిరస్కరణకు గురికావడం గురించి తమకు తెలుపలేదని, కేసులో వాస్తవాలను దాచడానికి ప్రయత్నించారని మండిపడింది.

Advertisement
Update: 2024-05-23 05:29 GMT

మధ్యంతర బెయిల్‌ కోసం జార్ఖండ్‌ మాజీ సీఎం, జేఎంఎం కార్యనిర్వాహక అధ్యక్షుడు హేమంత్‌ సోరెన్‌ వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఈ కేసులో వాస్తవాలను దాచి బెయిల్‌ కోసం పిటిషన్‌ దాఖలు చేశారంటూ మండిపడింది. బుధవారం ఈ పిటిషన్‌ను కొట్టివేస్తూ తీర్పు ఇచ్చేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో బెయిల్‌ పిటిషన్‌ను తామే ఉపసంహరించుకుంటున్నామంటూ సోరెన్ తరఫు సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌ కోర్టుకు తెలిపారు.

భూ కుంభకోణంతో ముడిపడిన మనీ ల్యాండరింగ్‌ కేసులో హేమంత్‌ సోరెన్‌ జైలులో ఉన్న విషయం తెలిసిందే. ఆయన లోక్‌సభ ఎన్నికలకు ప్రచారం నిమిత్తం తనకు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ ఇటీవల సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. కేజ్రీవాల్‌కు మంజూరైన మధ్యంతర బెయిల్‌ అంశాన్ని ఈ సందర్భంగా ధర్మాసనం ముందు ప్రస్తావించారు.

దీనిపై విచారణ ప్రారంభించిన జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా, జస్టిస్‌ సతీష్‌ చంద్ర శర్మతో కూడిన ధర్మాసనం.. సోరెన్‌ పిటిషన్‌పై అసహనం వ్యక్తం చేసింది. ట్రయల్‌ కోర్టులో రెగ్యులర్‌ బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేయడం, అది తిరస్కరణకు గురికావడం గురించి తమకు తెలుపలేదని, కేసులో వాస్తవాలను దాచడానికి ప్రయత్నించారని మండిపడింది. ఒకే రకమైన ఉపశమనం కోసం రెండు న్యాయస్థానాలను ఆశ్రయించడాన్ని ఈ సందర్భంగా ప్రశ్నించింది. అనంతరం బెయిల్‌ అభ్యర్థ‌నను కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేయటానికి ధర్మాసనం సిద్ధం కాగా.. తమ పిటిషన్‌ను వెనక్కి తీసుకుంటున్నట్టు కపిల్‌ సిబల్‌ తెలిపారు. ఇక సోరెన్‌కి బెయిల్‌ కోసం హైకోర్టును ఆశ్రయించేందుకు ధర్మాసనం అనుమతించింది.

Tags:    
Advertisement

Similar News