6నెలలు ఆగక్కర్లేదు.. ఎప్పుడు కోరుకుంటే అప్పుడే విడాకులు

ఈ స్పీడ్ యుగంలో ప్రేమ పెళ్లి అయినా, పెద్దలు కుదిర్చిన పెళ్లి అయినా.. విడాకుల దగ్గరకొచ్చే సరికి అంతా స్పీడ్ గా జరిగిపోవాలనుకుంటున్నారు. దానికి తగ్గట్టే సుప్రీంకోర్టు కూడా స్పీడ్ గా విడిపోవాలనుకుంటున్న జంటలకు ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది.

Advertisement
Update: 2023-05-01 06:49 GMT

విడాకుల వ్యవహారంలో సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులిచ్చింది. భార్యాభర్తలు అంగీకరిస్తే వెంటనే విడాకులు ఇవ్వొచ్చని స్పష్టం చేసింది. పరస్పర అంగీకారం ఉంటే 6 నెలలు ఆగాల్సిన అవసరం లేదని చెప్పింది. ఇప్పటి వరకు విడాకుల కేసుల్లో ఉన్న ఆరు నెలల నిరీక్షణ నిబంధనను సుప్రీంకోర్టు సడలించింది.

విడాకులకోసం భార్యాభర్తలు కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తే, పరస్పర అంగీకారం ఉన్నా కూడా ఆరు నెలల వ్యవధి తప్పనిసరి. ఈలోగా భార్యాభర్తలు మనసు మార్చుకుని కలసిపోయే అవకాశం ఉంటుందని, కుటుంబం విచ్ఛిన్నం కాకుండా ఉంటుందనేది ఆ నిబంధన ముఖ్య ఉద్దేశం. కొంతమంది ఈ ఆరు నెలల నిబంధన వల్ల కలసిపోయినవారు కూడా ఉన్నారు. తమ తప్పు తెలుసుకుని తిరిగి ఒక్కటై సంతోషకరమైన జీవితాన్ని కొనసాగిస్తున్న దంపతులున్నారు. అయితే ఆరు నెలల నిబంధనపై ఇటీవల కాలంలో తీవ్ర వ్యతిరేకత వస్తోంది. పరస్పరం విడాకులు కావాలనుకున్నా కూడా ఆరునెలలు వెయిట్ చేయాలా అని అంటున్నారు విడిపోవాలనుకుంటున్న దంపతులు. ప్రస్తుత కాలమానం ప్రకారం సుప్రీంకోర్టు కూడా ఈ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది.

విడాకులకోసం దరఖాస్తు చేసుకుంటే ఇకపై ఆరు నెలలు వేచి చూడాల్సిన అవసరం లేదు. విడిపోవాలనుకుంటున్న జంట పరస్పర అంగీకారం తెలియజేస్తే వారికి వెంటనే విడాకులు మంజూరు చేస్తుంది కోర్టు. లీగల్ సెటిల్మెంట్ చేసుకోవాలని సూచిస్తుంది. అయితే భరణం, కట్నకానుకలు.. ఇతర విషయాల్లో ఇద్దరి మధ్య ఏకాభిప్రాయం కుదరకపోతే మాత్రం విడాకుల సమస్య ఎడతెగకుండా సాగుతూనే ఉంటుంది. ఈ స్పీడ్ యుగంలో ప్రేమ పెళ్లి అయినా, పెద్దలు కుదిర్చిన పెళ్లి అయినా.. విడాకుల దగ్గరకొచ్చే సరికి అంతా స్పీడ్ గా జరిగిపోవాలనుకుంటున్నారు. దానికి తగ్గట్టే సుప్రీంకోర్టు కూడా స్పీడ్ గా విడిపోవాలనుకుంటున్న జంటలకు ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. 

Tags:    
Advertisement

Similar News