నా సహనాన్ని పరీక్షించొద్దు.. మనవడికి దేవెగౌడ స్ట్రాంగ్‌ వార్నింగ్‌

ప్రజ్వల్‌ రేవణ్ణ తనకు, తన కుటుంబానికి, పార్టీకి, శ్రేయోభిలాషులకు కలిగించిన బాధ తీవ్రమైనదని దేవెగౌడ తన లేఖలో పేర్కొన్నారు. ఆ షాక్‌ నుంచి కోలుకోవడానికి కొంత సమయం పట్టిందని తెలిపారు.

Advertisement
Update: 2024-05-24 02:14 GMT

తన మనవడు ప్రజ్వల్‌ రేవణ్ణకు మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చారు. ఎక్కడున్నా తక్షణమే వచ్చి పోలీసుల ముందు లొంగిపోవాలని, తన సహనాన్ని పరీక్షించొద్దని, లేదంటే తన ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ మేరకు ఎక్స్‌లో ఆయన ఒక లేఖను పోస్ట్‌ చేశారు. లైంగిక దాడుల కేసులో నిందితుడిగా ఉన్న హసన ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ విదేశాలకు పరారైన విషయం తెలిసిందే. విదేశాల్లో ఉన్న ప్రజ్వల్‌ను దేశానికి రప్పించేందుకు కర్నాటక రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుండగా, లొంగిపోవాలంటూ ప్రజ్వల్‌ కుటుంబీకుల నుంచి వరుస విజ్ఞప్తులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మాజీ ప్ర‌ధాని దేవెగౌడ కూడా పైవిధంగా స్పందించారు.

ఆ లేఖలో ఏముందంటే...

ప్రజ్వల్‌ రేవణ్ణ తనకు, తన కుటుంబానికి, పార్టీకి, శ్రేయోభిలాషులకు కలిగించిన బాధ తీవ్రమైనదని దేవెగౌడ తన లేఖలో పేర్కొన్నారు. ఆ షాక్‌ నుంచి కోలుకోవడానికి కొంత సమయం పట్టిందని తెలిపారు. ప్రజ్వల్‌పై నమోదైన కేసులో దోషిగా తేలితే అతనికి కఠినశిక్ష పడాల్సిందేనని స్పష్టం చేశారు. తన కుమారుడు, మాజీ సీఎం కుమారస్వామి కూడా ఇదే వైఖరితో ఉన్నాడని ఆయన తెలిపారు. ప్రజ్వల్‌.. ఎక్కడున్నా వచ్చి పోలీసుల ముందు లొంగిపో.. లేదంటే నాతో పాటు కుటుంబసభ్యుల ఆగ్రహానికి గురవుతావ్‌.. అంటూ ఆ లేఖలో దేవెగౌడ హెచ్చరించారు. అంతకుముందు ఈ విషయంపై మాజీ సీఎం కుమారస్వామి స్పందిస్తూ.. తాతపై గౌరవం ఉంటే 48 గంటల్లోగా పోలీసులు ముందు లొంగిపోవాలని విజ్ఞప్తి చేశారు. అశ్లీల వీడియోల కేసు అందరినీ తల దించుకునేలా చేసిందని, ఈ ఘటనకు తాను బేషరతుగా ప్రజలను క్షమాపణలు కోరుతున్నానని చెప్పారు.

Tags:    
Advertisement

Similar News