పూణే యాక్సిడెంట్ కేసులో బాలుడి తాత అరెస్ట్.. ఏం చేశాడో తెలుసా ..

పూణేలోని కళ్యాణి నగర్‌లో ఆదివారం తెల్లవారుజామున మోటార్‌సైకిల్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లను ఓ పోర్షే కారు ఢీకొట్టింది. బైక్‌పై ప్ర‌యాణిస్తున్న‌వారిద్దరూ మరణించారు. మద్యం మత్తులో ఓ మైనర్ కారు నడుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement
Update: 2024-05-25 09:36 GMT

పూణేలో ఓ టీనేజర్‌ మద్యం మత్తులో లగ్జరీ కారుతో బైక్‌ను ఢీకొన్న ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింన విషయం తెలిసిందే. ఈ ఘటనలో దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడి తాతను ఈ రోజు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో నేరాన్ని ఫ్యామిలీ డ్రైవర్‌పై మోపేందుకు తాత సురేంద్ర అగర్వాల్‌ ప్రయత్నించినట్టుగా సమాచారం.



పూణే బాలుడి డ్రంకెన్ డ్రైవ్ కేసు వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసు నుంచి బాలుడిని త‌ప్పించ‌డం అతడి కుటుంబ సభ్యులు యత్నించినట్టు పోలీసులు పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం ఎరవాడ పోలీసుల నుంచి సురేంద్ర అగర్వాల్‌ను క్రైమ్‌ బ్రాంచ్‌ వారు కస్టడీలోకి తీసుకున్నారు. ఎరవాడ పీఎస్‌లో నమోదైన ఎఫ్ఐఆర్ ప్రకారం.. ప్రమాదం జరిగిన రోజు రాత్రి పోలీస్ స్టేషన్ నుంచి ఇంటికి వచ్చిన తనను బాలుడి తాత బలవంతంగా తీసుకెళ్లి బీఎండబ్ల్యూ కారులో కూర్చోబెట్టారని డ్రైవర్ ఆరోపించారు. అక్కడ తన ఫోన్ లాక్కుని అక్రమంగా నిర్బంధించారని, ప్రమాద సమయంలో కారు నడిపింది తానేనని చెప్పి ఆ నేరాన్ని తనపై వేసుకోమన్నారని డ్రైవర్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో బాలుడి తాతను అరెస్టు చేశారు. మరోవైపు నిందితుడికి అనుకూలంగా వ్యవహరించిన కారణంగా ఎరవాడ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఇద్దరు అధికారులను సస్పెండ్ చేశారు. కేసును క్రైమ్‌ బ్రాంచ్‌కు బదిలీ చేశారు. యువకుడి తండ్రి, మద్యం షాపుల యజమాని, ఉద్యోగులపై నమోదైన నేరంపై క్రైమ్ బ్రాంచ్ ఇప్పటికే దర్యాప్తు చేస్తోందని పోలీసు కమిషనర్ తెలిపారు.



పూణేలోని కళ్యాణి నగర్‌లో ఆదివారం తెల్లవారుజామున మోటార్‌సైకిల్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లను ఓ పోర్షే కారు ఢీకొట్టింది. బైక్‌పై ప్ర‌యాణిస్తున్న‌వారిద్దరూ మరణించారు. మద్యం మత్తులో ఓ మైనర్ కారు నడుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఆ నిందితుడు రియల్ట‌ర్ విశాల్ అగర్వాల్ (50) కుమారుడు. బాలుడిని కోర్టులో హాజరు పరచగా జువైనల్‌ కోర్టు కొన్ని షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. ప్రమాదంపై వ్యాసం రాయాలని, ట్రాఫిక్‌ పోలీసులతో కలిసి 15 రోజుల పాటు పనిచేయాలని ఆదేశించింది. మానసిక నిపుణుడి వద్ద చికిత్స తీసుకోవాలని, కొంతకాలం పాటూ ఎవరైనా రోడ్డు ప్రమాదాలకు గురైతే ఆ బాధితులకు సాయం చేయాలని సూచించింది. అయితే ఈ కోర్టు తీర్పుపై విమర్శలు వ్యక్తమవడంతో జువెనైల్ జస్టిస్ బోర్డ్ తీర్పును సవరించింది. బాలుడిని జూన్ 5 వరకు అబ్జర్వేషన్ హోమ్‌కు పంపింది. తండ్రిని, రెండు బార్‌ల సిబ్బందిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి తాతకు అండర్‌వరల్డ్ డాన్ చోటా రాజన్‌తోనూ సంబంధాలు ఉన్నట్టు వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈ దిశగానూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News