కులాలను సృష్టించింది దేవుడు కాదు.. పూజారులే : ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్

మనం జీవించడానికి మనకు పని దొరికితే.. మనం తప్పకుండా సమాజం పట్ల బాధ్యత కలిగి ఉండాలని భగవత్ పేర్కొన్నారు.

Advertisement
Update: 2023-02-06 04:07 GMT

కులాలు, వర్ణాలను పూజారులు, మతాధికారులే సృష్టించారని.. వాటితో దేవుడికి ఏం సంబంధం లేదని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సంత్ శిరోమణి రోహిదాస్ 647వ జయంతి సందర్భంగా ముంబైలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొని, ఈ వ్యాఖ్యలు చేశారు. దేవుని ముందు అందరూ సమానమేనని, ఈ కుల, వర్ణ వ్యవస్థను పూజారులు సృష్టించి పెద్ద తప్పు చేశారని.. దానికి వారు తప్పకుండా బాధ్యత తీసుకోవాలని భగవత్ అన్నారు.

కాశీలోని మందిరాన్ని ధ్వంసం చేసిన తర్వాత మొఘల్ చక్రవర్తి ఔరంగజేబుకు చత్రపతి శివాజీ మహరాజ్ ఒక లేఖ రాశారు. హిందువులు, ముస్లింలు ఒకే దేవుని బిడ్డలని.. కానీ మీ రాజ్యంలో ఒకరి మీదనే దాడులు చేయడం తప్పని.. అందరినీ సమానంగా చూడాల్సిన బాధ్యత మీపై ఉన్నది. ఇలాంటి పనులు ఆపకపోతే నా కత్తితోనే సమాధానం ఇస్తానని ఆ లేఖలో పేర్కొన్నట్లు భగవత్ వెల్లడించారు.

మనం జీవించడానికి మనకు పని దొరికితే.. మనం తప్పకుండా సమాజం పట్ల బాధ్యత కలిగి ఉండాలని భగవత్ పేర్కొన్నారు. మనం చేసే పని చిన్నదా లేదా పెద్దగా అని ఎప్పుడూ ఆలోచించవద్దు.. ఎందుకంటే దేవుడి దగ్గర అందరూ సమానమే, మనందరం ఆయన బిడ్డలమే. ఆయన వద్ద కుల, వర్ణాల విభేదాలు లేవు అని స్పష్టం చేశారు.

నైతికత, వివేకము అనేవి ఈ దేశంలో సమానమైనవే. వీటి మధ్య పెద్దగా తేడా లేకపోయినా.. అభిప్రాయాల్లో మాత్రం కాస్త తేడా ఉన్నది. మతాన్ని మార్చడానికి ప్రయత్నించండి. ఒక వేళ దాన్ని మార్చలేకపోతే దాన్ని వదిలివేయండి అని అంబేద్కర్ చెప్పారని భగవత్ అన్నారు. నేను కూడా ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో మార్పు రావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.

తులసిదాస్, సూర్‌దాస్, కబీర్‌ల కంటే కూడా సంత్ రోహిదాస్ గొప్పవారు. శాస్త్రాలలో ఆయన బ్రాహ్మణుల మనసులను గెలవలేకపోయి ఉండొచ్చు. కానీ ఆయన బోధనలు అనేక మందికి హత్తుకున్నాయన్నది మాత్రం వాస్తవం. వారిలో దేవుని మీద నమ్మకాన్ని పెంచాయి. మీ మతాల ప్రకారమే మీరు మీ పని చేయండి. సమాజాన్ని ఏకం చేయడం, దాని అభివృద్ధి కోసం పాటుపడటం.. ఇదే మతం చెప్పేదని మోహన్ భగవత్ స్పష్టం చేశారు.

Tags:    
Advertisement

Similar News