మా ఎంపీ కనబడుట లేదు.. వెదికి తెచ్చినవారికి రూ.50వేల బహుమతి

సన్నీ డియోల్ ఫుల్ టైమ్ పొలిటీషియన్ కాదు. ఆయన ప్రధాన వ్యాపకం సినిమాలు. ఎంపీగా గెలిచిన తర్వాత కూడా ఆయన సినిమాలకే ఎక్కువ టైమ్ కేటాయించారు.

Advertisement
Update: 2023-12-13 07:31 GMT

సినీ నటుడు, లోక్ సభ సభ్యుడు సన్నీడియోల్ పై ఆయన సొంత నియోజకవర్గ ఓటర్లు వినూత్న రీతిలో నిరసన తెలుపుతున్నారు. పంజాబ్ లోని గురుదాస్ పూర్ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన, నియోజకవర్గానికి మొహం చాటేశారని ఆరోపిస్తున్నారు స్థానికులు. ఆయనపై తమ ఆగ్రహాన్ని సెటైరిక్ గా వ్యక్తం చేస్తున్నారు. తమ ఎంపీ కనపడటంలేదని సన్నీ డియోల్ ఫొటోలతో పోస్టర్లు వేశారు. ఆయనను వెదికి తెచ్చిచ్చిన వారికి 50వేల రూపాయల నజరానా అని కూడా ప్రకటించారు.

2019 సార్వత్రిక ఎన్నికల్లో గురుదాస్ పూర్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా గెలుపొందారు సన్నీడియోల్. కాంగ్రెస్‌ ప్రత్యర్థి సునీల్ జక్కర్ పై 82,459 ఓట్ల తేడాతో గెలుపొందారు. కేంద్రం నిధులతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని మాటిచ్చారాయన. అయితే గెలిచిన తర్వాత ఆయన నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో లేరు. ముంబైలోనే ఉండిపోయారు. దీంతో ఆయనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతేడాది కూడా ఇలాగే పోస్టర్లు వేశారు, ఈసారి పోస్టర్లలో 50వేల బహుమతి అని కూడా జత చేశారు.

సన్నీ డియోల్ ఫుల్ టైమ్ పొలిటీషియన్ కాదు. ఆయన ప్రధాన వ్యాపకం సినిమాలు. ఎంపీగా గెలిచిన తర్వాత కూడా ఆయన సినిమాలకే ఎక్కువ టైమ్ కేటాయించారు. ఈ ఏడాది గదర్-2 సినిమాతో పెద్ద హిట్ అందుకున్నారు. కానీ రాజకీయాల్లో మాత్రం అనుకున్నంత సక్సెస్ కాలేదని, గెలిచిన తర్వాత అసలు నియోజకవర్గం మొహం కూడా చూడలేదనే విమర్శలున్నాయి. ఎలాగైనా ఆయన్ను నియోజకవర్గానికి రప్పించాలనే కసితో ఉన్న స్థానిక యువత ఇలా ఆయన పరువు బజారున పడేసేలా ప్రవర్తించింది. కనపడుటలేదు అనే పోస్టర్లతోపాటు, సోషల్ మీడియాలో ఆ పోస్టర్లను వైరల్ గా మార్చారు. దీనిపై సన్నీ డియోల్ ఇంకా స్పందించలేదు. 

Tags:    
Advertisement

Similar News