చదువుల పోటీలో మరో విద్యార్థి బలవన్మరణం..

ఆ లేఖను అతని గదిలో పోలీసులు గుర్తించారు. ఆ లేఖలో ఏముందంటే.. ‘సారీ నాన్నా.. నేను జేఈఈ చేయలేను.. వెళ్లిపోతున్నా‘ అని అభిషేక్‌ పేర్కొన్నాడు.

Advertisement
Update:2024-03-09 11:18 IST

చదువుల పోటీలో మరో చిన్నారి అసువులు బాశాడు. ఐఐటీ, ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ ఐటీ వంటి ప్రతిష్టాత్మక కేంద్ర ప్రభుత్వ విద్యాసంస్థల్లో చేరేందుకు రాసే జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ (జేఈఈ) కు సిద్ధమవుతున్న విద్యార్థి ఆ పోటీలో పరుగులు పెట్టలేక తన జీవితాన్నే అర్ధాంతరంగా ముగించుకున్నాడు. తాను అద్దెకు ఉంటున్న పీజీ గదిలోనే బలవన్మరణానికి పాల్పడ్డాడు. రాజస్థాన్‌లోని కోటాలో ఈ ఘటన శుక్రవారం జరిగింది. ఇప్పటికే గత ఏడాది కాలంలో పదుల సంఖ్యలో విద్యార్థులు కోటాలో బలవన్మరణానికి పాల్పడిన విషయం తెలిసిందే. జేఈఈ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు కోచింగ్‌ సెంటర్ల అడ్డాగా ఉన్న కోటాలో తాజా ఘటనతో మరోసారి విద్యార్థులు ఎంత ఒత్తిడికి గురవుతున్నారనేది అర్థమవుతోంది.

బిహార్‌లోని భాగల్‌పూర్‌కు చెందిన అభిషేక్‌ మండల్‌ (16) కోటాలోని విజ్ఞాన్‌ నగర్‌లో గల పీజీ హాస్టల్‌లో అద్దెకు ఉంటూ జేఈఈకి సిద్ధమవుతున్నాడు. శుక్రవారం అతను ఆత్మహత్యకు పాల్పడటం మరోసారి పోటీ పరీక్షల ఒత్తిడి తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఇక ఘటనాస్థలాన్ని పరిశీలించిన పోలీసుల కథనం ప్రకారం.. అభిషేక్‌ విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సందర్భంగా తన తండ్రిని ఉద్దేశించి ఒక లేఖ కూడా రాశాడు. ఆ లేఖను అతని గదిలో పోలీసులు గుర్తించారు. ఆ లేఖలో ఏముందంటే.. ‘సారీ నాన్నా.. నేను జేఈఈ చేయలేను.. వెళ్లిపోతున్నా‘ అని అభిషేక్‌ పేర్కొన్నాడు.

కోచింగ్‌ సెంటరులో జనవరి 29న జరిగిన జేఈఈ సెషన్‌–1 పరీక్షకు అభిషేక్‌ హాజరుకాలేదని డీఎస్పీ ధరంవీర్‌ సింగ్‌ తెలిపారు. ఇక్కడ శిక్షణ పొందుతున్న విద్యార్థుల్లో ఒత్తిడిని తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలతో జిల్లా యంత్రాంగం పలు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఆత్మహత్యలు ఆగకపోవడం గమనార్హం. ఇప్పటికైనా తల్లిదండ్రులు ఆలోచించి తమ పిల్లలపై బలవంతంగా ఒత్తిడిని రుద్దకుండా.. వారి ఆలోచనలను తెలుసుకుంటూ.. అందుకు అనుగుణంగా వారి భవిష్యత్తును తీర్చిదిద్దే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Tags:    
Advertisement

Similar News