తమిళ సినిమాల్లో తమిళులకే ఛాన్స్ ఇవ్వాలి.. ఆర్కే సెల్వమణి కామెంట్స్ వైరల్

తమిళ సినిమాల్లో తమిళ నటులకు మాత్రమే అవకాశాలు ఇవ్వాలని, టెక్నీషియన్లను కూడా ఇక్కడివారినే తీసుకోవాలని అభిప్రాయపడ్డారు.

Advertisement
Update: 2023-09-16 16:35 GMT

తమిళ సినిమాల్లో తమిళులకే ఛాన్స్ ఇవ్వాలని ఏపీ మంత్రి రోజా భర్త, దక్షిణ భారత సినీ కార్మికుల సమాఖ్య అధ్యక్షుడు ఆర్కే సెల్వమణి చేసిన కామెంట్స్ వివాదాస్పదంగా మారాయి. పాన్ ఇండియా మోజులో పడి తమిళ సంప్రదాయాలు, భాషను మేకర్స్ పట్టించుకోవడంలేదని ఆయన వ్యాఖ్యానించారు. తాజాగా ఓ సినిమా ఈవెంట్‌లో పాల్గొన్న సెల్వమణి మాట్లాడుతూ.. తమిళ సినీ ఇండస్ట్రీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పాన్ ఇండియా అంటూ తమిళ సినిమాలు తమ ఉనికిని కోల్పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తమిళ సినిమాల్లో తమిళ నటులకు మాత్రమే అవకాశాలు ఇవ్వాలని, టెక్నీషియన్లను కూడా ఇక్కడివారినే తీసుకోవాలని అభిప్రాయపడ్డారు.

కాగా, ఆర్కే సెల్వమణి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేశారని ప్రచారం సాగుతోంది. కొద్దిరోజుల కిందట బ్రో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. తమిళ సినీ ఇండస్ట్రీ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్ లో ఎన్నో పాన్ ఇండియా స్థాయి సినిమాలు రూపుదిద్దుకుంటున్నాయని.. ఈ సినిమాల్లో నటించేందుకు ఇతర భాషల నుంచి నటులను తీసుకోవడం జరుగుతోందని, అలాగే వివిధ రాష్ట్రాలకు చెందిన టెక్నీషియన్లు పనిచేస్తున్నారని అన్నారు.

కానీ, తమిళ సినీ ఇండస్ట్రీలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమాల్లో ఇతర భాషలకు చెందిన నటులకు అవకాశం కల్పించడం లేదని, ఇతర భాషలకు చెందిన టెక్నీషియన్లను కూడా ఎంపిక చేసుకోవడం లేదని పవన్ విమర్శించారు. తమిళంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమాల్లో ఇతర భాషలకు చెందిన వారికి కూడా అవకాశాలు కల్పించాలని పవన్ కోరారు.

పవన్ కళ్యాణ్ చేసిన ఈ కామెంట్స్ అప్పట్లో సెన్సేషన్ సృష్టించాయి. పవన్ వ్యాఖ్యలపై కోలీవుడ్ కు చెందిన పలువురు నటులు, నిర్మాతలు స్పందించారు. అన్ని భాషల వారికి తమ సినిమాల్లో అవకాశాలు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే ఈ వ్యవహారం గురించి తాజాగా ఆర్కే సెల్వమణి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కాగా.. తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్లు సెల్వమణి మరోసారి స్పష్టం చేశారు.

Tags:    
Advertisement

Similar News