వర్షంలో గొడుగు పట్టుకొని బస్ డ్రైవింగ్ - డ్రైవర్, కండక్టర్ సస్పెండ్

బస్సు డ్రైవర్ తన కుడి చేత్తో గొడుగు పట్టుకుని ఎడమచేత్తో బస్సు నడుపుతున్నాడు. ఆ వీడియోలో ఎదురుగా వరుసగా వాహనాలు వస్తున్నప్పటికీ డ్రైవర్ ఒంటిచేత్తోనే డ్రైవింగ్ కొనసాగించాడు.

Advertisement
Update: 2024-05-25 12:25 GMT

కర్ణాటకలో భారీ వర్షం కురుస్తున్న సమయంలో ఆర్టీసీ డ్రైవర్ ఒక చేత్తో గొడుగు పట్టుకుని మరో చేత్తో స్టీరింగ్ ప‌ట్టుకొని బస్సు నడిపాడు. బస్సుల పరిస్థితి అధ్వానంగా ఉండడంతోనే ఈ పరిస్థితి తలెత్తిందని విపక్షాలు విమర్శలు చేయగా.. సదరు వీడియో డ్రైవర్, కండక్టర్ సరదాగా తీసుకున్నదని గుర్తించిన నార్త్ వెస్ట్రన్ కర్ణాటక రోడ్డు ట్రాన్స్ పోర్టు కార్పొరేషన్ (ఎన్ డబ్ల్యుకేఆర్టీసీ) బస్సు డ్రైవర్, కండక్టర్ ను విధుల నుంచి సస్పెండ్ చేసింది.

సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలో జోరుగా వర్షం కురుస్తున్నట్లు కనిపిస్తోంది. బస్సు డ్రైవర్ తన కుడి చేత్తో గొడుగు పట్టుకుని ఎడమచేత్తో బస్సు నడుపుతున్నాడు. ఆ వీడియోలో ఎదురుగా వరుసగా వాహనాలు వస్తున్నప్పటికీ డ్రైవర్ ఒంటిచేత్తోనే డ్రైవింగ్ కొనసాగించాడు. ఈ వీడియో కండక్టర్ తీయగా అది సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది. దీంతో ప్రతిపక్షాలు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశాయి. డొక్కు బస్సుల కారణంగానే పరిస్థితి ఈ విధంగా తయారైందని మండిపడ్డాయి.

కాగా, దీనిపై ఎన్ డబ్ల్యుకేఆర్టీసీ విచారణ చేపట్టగా బస్సులో ఎలాంటి సమస్య లేదని తెలిసింది. వర్షపు నీరు పడకపోయినప్పటికీ డ్రైవర్ గొడుగు తెరిచి పట్టుకుని ఒంటి చేత్తో డ్రైవింగ్ చేస్తుంటే దానిని కండక్టర్ సరదాగా వీడియో తీశాడని తేలింది. దీంతో ఎన్ డబ్ల్యుకేఆర్టీసీ డ్రైవర్, కండక్టర్ ను విధుల నుంచి సస్పెండ్ చేసింది.

Tags:    
Advertisement

Similar News