నగ్నంగా రోడ్డుపైకి నిరుద్యోగులు.. ఎందుకంటే..?
అక్రమార్కులను అరెస్ట్ చేసి, జీతం రూపంలో తీసుకున్న సొమ్ము రికవరీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. విధిలేక తాము నగ్నంగా వీధుల్లో పరుగులు తీయాల్సి వచ్చిందన్నారు.
దేశంలో ఎప్పుడూ ఇలాంటి నిరసనలు చూసి ఉండం.. అర్థనగ్న నిరసనలు అక్కడక్కడ జరుగుతుంటాయి కానీ, ఇలా పూర్తి నగ్నంగా వీధుల్లో పరిగెట్టేందుకు ఎప్పుడూ భారత యువత సాహసం చేయలేదు. కానీ తొలిసారి 12మంది నిరసనకారులు ఒంటిపై నూలుపోగు లేకుండా రోడ్లపై పరిగెత్తారు. అది కూడా అసెంబ్లీవైపు దూసుకెళ్లడంతో పోలీసులకు ఏం చేయాలో పాలుపోలేదు. ఈ ఘటన చత్తీస్ ఘడ్ రాజధాని రాయ్ పూర్ లో జరిగింది.
చత్తీస్ ఘడ్ లో ఎస్సీ, ఎస్టీ లకు రిజర్వ్ చేసిన ఉద్యోగాలు, బ్యాక్ లాగ్ ఉద్యోగాల్లో అక్రమార్కులు తిష్టవేశారనే ఆరోపణలు ఉన్నాయి. కొంతమంది నకిలీ ధృవీకరణ పత్రాలతో ఈ ఉద్యోగాలు పొందారు. దీనిపై అసలు అభ్యర్థులు ఆందోళన చేపట్టారు. నకిలీ కుల ధ్రువీకరణ పత్రాలు ఉపయోగించి ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన వారిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కొన్నిరోజులుగా ఈ నిరసనలు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. దీంతో ఈరోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతుండగా ఆందోళనకారులు నగ్న నిరసన చేపట్టారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
నకిలీ సర్టిఫికెట్ లతో 267మంది ఉద్యోగాలు పొందారని, అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని అర్హులకు న్యాయం చేయాలని తాము పోరాటం చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవట్లేదని అంటున్నారు నిరసనకారులు. అక్రమార్కులను అరెస్ట్ చేసి, జీతం రూపంలో తీసుకున్న సొమ్ము రికవరీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. విధిలేక తాము నగ్నంగా వీధుల్లో పరుగులు తీయాల్సి వచ్చిందన్నారు.