మోదీ రిటైర్ కావాలని అమిత్ షా డిమాండ్ చేస్తున్నారా..?

తాజాగా రిటైర్మెంట్ వ్యవహారంపై అమిత్ షా చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. అమిత్ షా రిటైర్మెంట్ వ్యాఖ్యలకు కాంగ్రెస్ అదిరిపోయే కౌంటర్ ఇచ్చింది.

Advertisement
Update: 2024-05-22 09:47 GMT

ప్రస్తుతం ప్రధాని మోదీ వయసు 73 సంవత్సరాలు. బీజేపీలో ‘75 ఏళ్ల వయసు నిబంధన’ ఉంది. ఆ నిబంధన ప్రకారం 75 సంవత్సరాలు దాటిన వారికి ప్రభుత్వంలో పదవులు ఇవ్వరు. ఒకవేళ వారు కొనసాగాలనుకున్నా మిగతావాళ్లు పొగ పెట్టక మానరు. చాలామంది సీనియర్ల విషయంలో ఇది రుజువైంది. అంటే ఈసారి బీజేపీ అధికారంలోకి వస్తే మోదీ కేవలం రెండేళ్లు మాత్రమే ప్రధానిగా పనిచేయాలన్నమాట. ఆ తర్వాత ఆయన స్థానంలో అమిత్ షా అధికార పీఠం ఎక్కుతారనే చర్చ జరుగుతోంది.

మూడోసారి మోదీని ప్రధానిని చేయాలని అంటున్నారు బీజేపీ నేతలు. అయితే పూర్తికాలం ఆయనే ప్రధానిగా ఉంటారా అంటే మాత్రం ఖాయంగా చెప్పలేకపోతున్నారు. ఇటీవల ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా ఇదే విషయాన్ని లేవనెత్తారు. ఈసారి మోదీ ఓట్లు అడుగుతోంది తనకోసం కాదని, అమిత్ షా ని ప్రధానిని చేయడం కోసమని అన్నారు కేజ్రీవాల్. దీనిపై బీజేపీ నుంచి ఎలాంటి కౌంటర్ రాలేదు. పూర్తికాలం మోదీ ప్రధానిగా ఉంటారని ఎవరూ సాహసించి చెప్పలేకపోతున్నారు, అమిత్ షా ప్రధాని పదవి తీసుకోరు అని కూడా చెప్పడంలేదు. అంటే దీని వెనక ఏదో మర్మం ఉందనే విషయం స్పష్టమవుతోంది.

అమిత్ షా మనసులో మాట..

తాజాగా రిటైర్మెంట్ వ్యవహారంపై అమిత్ షా చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ కు వయసు మీదపడుతోందని చెప్పిన అమిత్ షా.. ఆయన రిటైర్ అవ్వాల్సిన టైమ్ వచ్చిందంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. నవీన్‌కు ఇప్పుడు 77 సంవత్సరాలున్నాయని, వయసు మీదపడటమే కాకుండా, ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని కూడా చెప్పుకొచ్చారు అమిత్ షా. అమిత్ షా రిటైర్మెంట్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ అదిరిపోయే కౌంటర్ ఇచ్చింది.



‘‘వయసు కారణంగా పట్నాయక్‌ రిటైర్ అవ్వాలని అమిత్‌ షా అన్నారు. ఒకవేళ బీజేపీ అధికారంలోకి వస్తే.. మోదీకి ఆయన ఇదే సూచన ఇస్తున్నారా..? బీజేపీ అధికారంలోకి రాకపోతే.. అత్యంత సంతోషించే వ్యక్తి అమిత్ షా అని అనిపిస్తోంది. అప్పుడు మోదీ కాకుండా ఆయనే సభలో ప్రతిపక్ష నేత స్థానంలో కూర్చునేలా ఉన్నారు’’ అంటూ కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ నేత చిదంబరం. నవీన్ పట్నాయక్ పేరు చెప్పి అమిత్ షా, మోదీకి సంకేతాలిస్తున్నారని అంటున్నారు కాంగ్రెస్ నేతలు. 

Tags:    
Advertisement

Similar News