100 తలల రావణుడు మోదీ.. ఖర్గే ఘాటు విమర్శ

ఎన్నిసార్లు ప్రధాని మోదీ మొహం చూసి ఓట్లు వేయాలి, ఆయనేమైనా 100 తలల రావణుడా అని ప్రశ్నించారు ఖర్గే. అభ్యర్థి పేరుతో బీజేపీ ఓట్లు అడగాలని, మోదీ వచ్చి మున్సిపాల్టీల్లో పనిచేయలేరు కదా అని లాజిక్ తీశారు.

Advertisement
Update: 2022-11-29 10:11 GMT

మోదీకి 100 తలలున్నాయా, ఆయన రావణుడా అంటూ ఘాటుగా విమర్శించారు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే. గుజరాత్ ఎన్నికల్లో మోదీ ప్రచారంపై ఆయన విరుచుకుపడ్డారు. అసలు గుజరాత్ ఎన్నికలతో మోదీకి సంబంధమేంటని ప్రశ్నించారు. ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలా గుజరాత్ ఎన్నికల ప్రచారాన్ని నెత్తికెత్తుకోవడం దేనికి సంకేతమన్నారు.

100 తలల రావణుడా..?

మోదీ ప్రధాని అని, ఆయన తన పని మరచిపోయి.. కార్పొరేషన్, ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో ప్రతి చోటా ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు ఖర్గే. ఎప్పుడూ తన గురించే మాట్లాడుకుంటున్నారని, తనని చూసి ఓట్లు వేయాలని అడుగుతున్నారని విమర్శించారు. ఎన్నిసార్లు ప్రధాని మోదీ మొహం చూసి ఓట్లు వేయాలి, ఆయనేమైనా 100 తలల రావణుడా అని ప్రశ్నించారు ఖర్గే. అభ్యర్థి పేరుతో బీజేపీ ఓట్లు అడగాలని, మోదీ వచ్చి మున్సిపాల్టీల్లో పనిచేయలేరు కదా అని ప్రశ్నించారు.

బీజేపీ ప్రతి విమర్శలు..

మోదీని రావణుడంటూ ఖర్గే చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. గుజరాత్ ఎన్నికల్లో బీజేపీని తట్టుకోలేకే కాంగ్రెస్ అధ్యక్షుడు కంట్రోల్ తప్పారని, ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు బీజేపీ నేతలు. మౌత్ కా సౌదాగర్, రావణ్ అంటూ ప్రధాని మోదీని కాంగ్రెస్ పార్టీ అవమానిస్తూనే ఉందని అన్నారు. మోదీ అభివృద్ధి పథంలో దేశాన్ని నడిపిస్తున్నారని, ఆయన్ని చూపించే తాము ఓట్లు అడుగుతామని అంటున్నారు. కానీ కాంగ్రెస్ మాత్రం మోదీని టార్గెట్ చేసింది. గల్లీ ఎన్నికలకు కూడా మోదీ ఎందుకొస్తున్నారంటూ నిలదీస్తున్నారు కాంగ్రెస్ నేతలు. గుజరాత్ ప్రభుత్వాన్ని మోదీ, అమిత్ షా చెప్పుచేతల్లో పెట్టుకున్నారని, అసలు గుజరాత్ సీఎం మొహం చూపించి ఓట్లు అడగడంలేదని, ఆయన్ను డమ్మీగా మార్చేశారని మండిపడ్డారు. గుజరాత్ లో బీజేపీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రులు సొంతగా నిర్ణయాలు తీసుకోలేరని, వారి జుట్టు మోదీ, షా చేతుల్లో ఉంటుందని ఎద్దేవా చేశారు.

Tags:    
Advertisement

Similar News