లోక్‌సభ ఎన్నికల అభ్యర్థుల్లో 121 మంది నిరక్షరాస్యులు

ఎన్నికల్లో పోటీ పడుతున్న వారిలో 121 మంది నిరక్షరాస్యులని ఏడీఆర్ తన నివేదికలో తెలిపింది. అయితే ఎన్నికల్లో పోటీ చేసే వారిలోనే ఇంతమంది నిరక్షరాస్యులు ఉండడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

Advertisement
Update: 2024-05-24 07:09 GMT

దేశంలో ప్రస్తుతం జరుగుతున్న లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో 121 మంది నిరక్షరాస్యులు ఉన్నట్లు ది అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రీఫార్మ్స్ (ఏడీఆర్) నివేదిక వెల్లడించింది. 18వ లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల విద్యార్హతలను అధ్యయనం చేసిన ఏడీఆర్ సంస్థ తాజాగా ఆ వివరాలను వెల్లడించింది.

ఎంపీ ఎన్నికల్లో పోటీ పడుతున్న వారిలో 198 మంది డాక్టరేట్ పట్టా పొందిన వారు ఉండగా.. 4,211 మంది డిగ్రీ ఆపై చదివినట్లు పేర్కొంది. 1303 మంది 12వ తరగతి పూర్తి చేసిన వారు ఉండగా.. 42 మంది డిప్లొమా చదివినట్లు తెలిపింది. 2,436 మంది 5 నుంచి 12వ తరగతి తరగతుల మధ్య చదివిన వాళ్ళు ఉండగా.. 1,263 మంది తాము బడికి వెళ్లలేదని.. అయినా చదవడం, రాయడం వచ్చని చెప్పినట్లు పేర్కొంది.

ఇక ఎన్నికల్లో పోటీ పడుతున్న వారిలో 121 మంది నిరక్షరాస్యులని ఏడీఆర్ తన నివేదికలో తెలిపింది. అయితే ఎన్నికల్లో పోటీ చేసే వారిలోనే ఇంతమంది నిరక్షరాస్యులు ఉండడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రజల్లో అక్షరాస్యత పెంచేందుకు వివిధ ప్రభుత్వాలు ఎన్నో కార్యక్రమాలు చేపట్టాయి.

అనియత విద్య, సాక్షర భారత్ వంటి రాత్రిపూట బడులను కూడా ఏళ్లకు ఏళ్ళు నిర్వహించాయి. అయినప్పటికీ లోక్ సభ ఎన్నికల్లో పోటీ పడుతున్న అభ్యర్థుల్లోనే 121 మంది నిరక్షరాస్యులు ఉండడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇటువంటివారు ప్రజాప్రతినిధులుగా ఎన్నికైతే పాలన ఏ విధంగా చేస్తారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇక దేశంలోని పలు రాష్ట్రాలు తమ రాష్ట్రాల్లో అక్షరాస్యత శాతం పెరిగిందని తరచూ పేర్కొంటుండగా.. ప్రభుత్వాలు పేర్కొన్నంత అక్షరాస్యత శాతం నిజంగా ఆయా రాష్ట్రాల్లో లేదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

Tags:    
Advertisement

Similar News