లఖింపూర్ ఖేరీ రైతుల హత్య కేసు: యోగీ సర్కార్ ఆశ్చర్యకరమైన వాదన‌

ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన అదనపు అడ్వకేట్ జనరల్ గరిమా ప్రసాద్, ''ఇది చాలా తీవ్రమైన, అమానుషమైన నేరం, అత్యంత హేయమైనది. ఇటువంటి నిందితులకు చిన్న ఉపశమ‌నం ఇచ్చినా సమాజానికి తప్పుడు సంకేతాలు వెళ్తాయి.'' అని న్యాయమూర్తులు సూర్యకాంత్, జేకే మహేశ్వరిలతో కూడిన ధర్మాసనం ముందు వాదించారు.

Advertisement
Update: 2023-01-19 12:09 GMT

ఉత్తరప్రదేశ్ లక్షింపూర్ ఖేరీలో రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న రైతులపైకి వాహనం నడిపి 5గురి మరణాలకు కారకుడైన కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఈ రోజు విచారణ జరిపింది. ఈ సందర్భంగా యూపీ సర్కార్ ఆశిష్ మిశ్రాకు వ్యతిరేకంగా తీవ్రమైన వాదనలు వినిపించింది.

తనకు బెయిల్ నిరాకరించిన అలహాబాద్ హైకోర్టు తీర్పు పై ఆశిష్ మిశ్రా సుప్రీం కోర్టుకు వెళ్ళారు. ఈ రోజు ఈ అంశంపై వాదనలు జరిగాయి. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన అదనపు అడ్వకేట్ జనరల్ గరిమా ప్రసాద్, ''ఇది చాలా తీవ్రమైన, అమానుషమైన నేరం, అత్యంత హేయమైనది. ఇటువంటి నిందితులకు చిన్న ఉపశమ‌నం ఇచ్చినా సమాజానికి తప్పుడు సంకేతాలు వెళ్తాయి.'' అని న్యాయమూర్తులు సూర్యకాంత్, జేకే మహేశ్వరిలతో కూడిన ధర్మాసనం ముందు వాదించారు.

మరో వైపు మిశ్రా తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ మాట్లాడుతూ, తన క్లయింట్ ఏడాదికి పైగా కస్టడీలో ఉన్నారని చెప్పారు. ఈ కేసులో దాదాపు 208 మంది సాక్షులు ఉన్నారని, విచారణ పూర్తి కావడానికి కనీసం 5 ఏళ్లు పడుతుందని ట్రయల్ కోర్టు దాఖలు చేసిన స్టేటస్ రిపోర్టును రోహత్గీ ప్రస్తావించారు.

మరో ఎఫ్‌ఐఆర్‌లో కూడా దాదాపు 200 మంది సాక్షులు ఉన్నారని రోహత్గీ తెలిపారు. అంటే దాదాపు 400 మంది సాక్షులను విచారించడానికి 7 నుంచి 8 ఏళ్లు పట్టవచ్చని ఆయన తెలిపారు.

సత్వర విచారణ హక్కు ఆర్టికల్ 21లో భాగమని వాదిస్తూ, ఆ రోజు ఘటన జరిగిన సమయంలో మిశ్రా ఘటనా స్థలంలో లేరని రికార్డులు చెబుతున్నాయని ఆయన‌ అన్నారు. ఇది హత్య కేసు కాదని, జనం హింసాత్మకంగా మారి కొందరిని చంపిన కేసు అని అన్నారు.

కాగా బాధిత కుంటుంబాల తరపున వాదించిన సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే, మిశ్రాకు బెయిల్‌ మంజూరు చేస్తే అది భయంకరమైన సందేశాన్ని పంపుతుందని అన్నారు. 5 సంవత్సరాలలోపు విచారణ జరగదనే వాదన‌ బెయిల్ పొందడానికి సాకుగా ఉండదని దవే అన్నారు. "ఇది కోల్డ్ బ్లడెడ్ మర్డర్. ఇందులో కుట్ర ఉంది, దానిని నేను నిరూపించగలను" అని అతను వాదించాడు.

నేటికీ, మిశ్రా తండ్రి, కేంద్ర సహాయ మంత్రిగా ఉన్నారని, ఎఫ్ ఐఆర్ లో అతన్ని సహ-కుట్రదారుగా పేర్కొనలేదని దవే వాదించారు. ఒక సంవత్సరం జైలులో గడిపినంత మాత్రాన నిందితుడికి బెయిల్ ఇవ్వవచ్చా అని ఆయన ప్రశ్నించారు.

ఇరు వర్గాల వాదనలు విన్న సుప్రీ‍ం కోర్టు ధర్మాసనం తన ఉత్తర్వులను రిజర్వ్ చేసింది.

Tags:    
Advertisement