నాకు వందేళ్లు వచ్చేదాకా రాజకీయాల్లోనే.. ప్రధాని మోడీ వ్యాఖ్యలు వైరల్

బీజేపీలో వయసు నిబంధన ఉన్న సంగతి తెలిసిందే. 75 ఏళ్ళు నిండిన వారికి ఆ పార్టీలో ఎటువంటి పదవులు ఇవ్వరు. 2014లో అద్వానీ ప్రధాని రేసులో నిలిచినప్పటికీ వయసు సాకుగా చూపి మోడీకి ప్రధాని పదవి కట్టబెట్టారు.

Advertisement
Update: 2024-05-24 02:57 GMT

తాను ఇంకో రెండు దశాబ్దాల పాటు రాజకీయాల్లోనే ఉంటానని ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. దేవుడు తనను ప్రత్యేక కార్యం మీద పంపారని.. తనకు వందేళ్లు వచ్చే వరకు రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంటానని ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. తాను కూడా ప్రధాని రేసులో ఉన్నానని బీజేపీ అగ్రనేత అమిత్ షా పరోక్షంగా వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ప్రధాని చేసిన ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ వయసు 77 ఏళ్లని.. ఆయన రిటైర్ కావాల్సిన సమయం ఆసన్నమైందని ఇటీవల అమిత్ షా చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే అమిత్ షా నవీన్ పట్నాయక్ ను ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేయలేదని.. నవీన్ పేరు చెప్పి అమిత్ షా మోడీకి సంకేతాలు ఇస్తున్నారంటూ కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానించారు.

బీజేపీలో వయసు నిబంధన ఉన్న సంగతి తెలిసిందే. 75 ఏళ్ళు నిండిన వారికి ఆ పార్టీలో ఎటువంటి పదవులు ఇవ్వరు. 2014లో అద్వానీ ప్రధాని రేసులో నిలిచినప్పటికీ వయసు సాకుగా చూపి మోడీకి ప్రధాని పదవి కట్టబెట్టారు. ఇప్పుడు మోడీ వయసు 73 ఏళ్లు కావడంతో ఆయన ఇంకో రెండేళ్లు మాత్రమే ప్రధానిగా కొనసాగుతారని.. ఆ తర్వాత అమిత్ షా ప్రధానిగా బాధ్యతలు చేపడతారని ప్రచారం జరుగుతోంది. దీన్ని గుర్తు చేసేందుకే అమిత్ షా వయసుకు సంబంధించిన కామెంట్స్ చేశారని చిదంబరం, కేజ్రీవాల్ వంటివారు అభిప్రాయపడ్డారు.

ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ గురువారం ఓ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ.. రాజకీయాల్లో కొనసాగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఇంకో రెండు దశాబ్దాల పాటు క్రియాశీలక రాజకీయాల్లో కొనసాగుతానని స్పష్టం చేశారు. దేవుడు తనను ప్రత్యేక కార్యంపై పంపారని చెప్పారు. దేవుడు తనకు దారి చూపించడమే కాకుండా శక్తి కూడా ఇచ్చారన్నారు. 2047 కల్లా వికసిత్ భారత్ లక్ష్యం నెరవేర్చే వరకు దేవుడు తనను పైకి పిలవడనే విశ్వాసం ఉందని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు.

ఈ ఎన్నికల్లో ఎన్డీయే మళ్లీ అధికారంలోకి వచ్చినప్పటికీ ప్రధానిగా మోడీ ఎక్కువకాలం కొనసాగారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ప్రధాని మోడీ వయస్సు ప్రస్తుతం 73 కాగా.. 2047 వరకు రాజకీయాల్లో కొనసాగుతానని ఆయన చెబుతుండడంతో వందేళ్లు నిండేదాకా తాను రాజకీయాల్లో కొనసాగుతానని ప్రధాని మోడీ ప్రజలకు సంకేతాలు ఇచ్చినట్లయింది.

Tags:    
Advertisement

Similar News