పేటీఎంపై రివ్యూకి నో ఛాన్స్‌.. - తేల్చిచెప్పిన ఆర్బీఐ గవర్నర్‌

కస్టమర్ల ప్రయోజనాలను పరిరక్షించడం వంటి వాటికి కట్టుబడి ఉంటామని స్పష్టంచేశారు. పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌పై విధించిన ఆంక్షలను సమీక్షించే అవకాశం దాదాపు లేనట్టేనని పునరుద్ఘాటించారు.

Advertisement
Update: 2024-02-12 14:16 GMT

పేటీఎంపై చర్యల విషయంలో సమీక్షకు అవకాశం లేదని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా గవర్నర్‌ శక్తికాంత దాస్‌ స్పష్టంచేశారు. సోమవారం ఆయన ఈ అంశంపై స్పందిస్తూ.. సమగ్ర అంచనా తర్వాతే ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుందన్నారు. పేమెంట్స్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌పై ఆర్బీఐ ఇటీవల ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. దానిపై శ‌క్తికాంత్ దాస్ తాజాగా స్పందిస్తూ ఫిన్‌టెక్‌ రంగానికి తాము పూర్తి మద్దతిస్తామని, అదే సమయంలో కస్టమర్ల ప్రయోజనాలను పరిరక్షించడం వంటి వాటికి కట్టుబడి ఉంటామని స్పష్టంచేశారు. పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌పై విధించిన ఆంక్షలను సమీక్షించే అవకాశం దాదాపు లేనట్టేనని పునరుద్ఘాటించారు.

పేటీఎంకు చెందిన పేమెంట్స్‌ బ్యాంకులో నిబంధనల ఉల్లంఘన జరిగినట్టు ఇటీవల గుర్తించిన ఆర్బీఐ ఆ మేరకు ఆంక్షలు విధించింది. అందులో భాగంగా ఫిబ్రవరి 29 తర్వాత ఏ కస్టమర్, ప్రీపెయిడ్‌ ఇన్‌స్ట్రుమెంట్, వ్యాలెట్, ఫాస్టాగ్‌ లో డిపాజిట్లు, టాప్‌–అప్‌లు చేపట్టకూడదని ఆదేశించింది. సమగ్ర సిస్టమ్‌ ఆడిట్, బయటి ఆడిటర్ల నివేదికలను అనుసరించి ఈ చర్యలు తీసుకుంది. ఈ ఆంక్షలకు సంబంధించిన నివేదికను ఇవ్వాల్సిందిగా ఆర్బీఐని ఈడీ, ఫైనాన్షియల్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌ కోరాయి. దీంతో ఆంక్షల నుంచి బయటపడేందుకు పేటీఎం మార్గాలను అన్వేషిస్తోంది.

Tags:    
Advertisement

Similar News