జమిలి ఎన్నికలకు నో చెప్పిన మమతా బెనర్జీ

జమిలి ఎన్నికల విషయంలో అధ్యయనం కోసం గతేడాది సెప్టెంబర్‌లో ఏర్పడిన అత్యున్నతస్థాయి కమిటీ అప్పటి నుంచి రెండుసార్లు సమావేశాలు నిర్వహించింది.

Advertisement
Update: 2024-01-12 03:06 GMT

జమిలి ఎన్నికలకు నో చెబుతూ పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ దీనిపై ఏర్పాటు చేసిన అధ్యయన కమిటీకి లేఖ రాశారు. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలను ఏకకాలంలో నిర్వహించాలనే ఉద్దేశంతో ‘ఒకే దేశం – ఒకే ఎన్నిక’ పేరుతో అధ్యయనానికి మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ తరహా విధానం భారత రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణానికి వ్యతిరేకమని మమతా బెనర్జీ తన లేఖలో పేర్కొన్నారు. ఒకే దేశం – ఒకే ఎన్నిక భావనతో తాను ఏకీభవించడం లేదని ఆమె స్పష్టంచేశారు.

ప్రజాస్వామ్య ముసుగులో నియంతృత్వాన్ని అనుమతించే వ్యవస్థగా జమిలి విధానం మారుతుందని మమతా బెనర్జీ పేర్కొన్నారు. తాను నిరంకుశత్వానికి వ్యతిరేకమని, అందుకే జమిలి ఎన్నికలకు దూరమని ఆమె స్పష్టం చేశారు. ‘జమిలి ఎన్నికల విషయంలో మీ సూత్రీకరణ, ప్రతిపాదనలతో విభేదిస్తున్నాం. ఈ కాన్సెప్ట్‌ స్పష్టంగా లేదు. భారత రాజ్యాంగం ‘ఒకే దేశం– ఒకే ప్రభుత్వం’ అనే భావనను అనుసరించడం లేదు. కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ కారణాల వల్ల తమ ఐదేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేయకపోవచ్చు. గత 50 ఏళ్లలో లోక్‌సభ అనేకసార్లు ముందస్తుగా రద్దయ్యింది. ఇలాంటి పరిస్థితుల్లో కొత్తగా ఎన్నికలు నిర్వహించడమే మార్గం. కేవలం ఏకకాలంలో ఎన్నికల కోసమే ముందస్తుకు వెళ్లాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాలను ఒత్తిడి చేయరాదు. ఇలా చేస్తే.. ఐదేళ్ల పాలన విషయంలో ఓటర్ల ఎన్నికల విశ్వాసాన్ని ప్రాథమికంగా ఉల్లంఘించడమే అవుతుంది’ అని మమతా తన లేఖలో పేర్కొన్నారు.

జమిలి ఎన్నికల విషయంలో అధ్యయనం కోసం గతేడాది సెప్టెంబర్‌లో ఏర్పడిన అత్యున్నతస్థాయి కమిటీ అప్పటి నుంచి రెండుసార్లు సమావేశాలు నిర్వహించింది. ఇదే క్రమంలో 6 జాతీయ పార్టీలు, 33 ప్రాంతీయ పార్టీల నుంచి అభిప్రాయాలు కోరింది. న్యాయ కమిషన్‌ నుంచి కూడా ఈ విధానంపై సలహాలు తీసుకుంది. ప్రజల నుంచి కూడా సలహాలు, సూచనలను ఆహ్వానించగా, ఇప్పటివరకు ఈ-మెయిల్‌ ద్వారా 5 వేలకు పైగా సూచనలు, అభిప్రాయాలు వచ్చాయని అధికార వర్గాలు వెల్లడించాయి. తాజాగా ఈ అంశంపై పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా పైవిధంగా స్పందించారు.

Tags:    
Advertisement

Similar News