కేరళలో గవర్నర్ వర్సెస్ సీఎం.. వైస్ ఛాన్స్‌లర్లకు నరకం..

కేరళలోని 9 యూనివర్శిటీల వీసీలు వెంటనే రాజీనామా చేయాలని గవర్నర్ ఆరిఫి మొహ్మద్ ఖాన్ ఆదేశాలిచ్చారు. డెడ్ లైన్ కూడా ప్రకటించారు.

Advertisement
Update: 2022-10-24 02:48 GMT

రాష్ట్రాల గవర్నర్లకి ఇతర శాసన సంబంధమైన అధికారాలు ఉండవు కానీ, యూనివర్శిటీల వైస్ ఛాన్స్ లర్లను నియమించే విషయంలో వారిదే తుది నిర్ణయం. అయితే స్థానిక ప్రభుత్వం సలహాలు మాత్రం తీసుకోవాల్సిందే. కానీ బీజేపీ నియమిత గవర్నర్లు ఇటీవల రాష్ట్రాలపై పెత్తనం కోరుకుంటున్నారు. దీంతో యూనివర్శిటీల వైస్ ఛాన్స్‌లర్ల నియామకం రాజకీయ రగడకు వేదిక అవుతోంది. ఆమధ్య తెలంగాణలో కూడా ఇదే గొడవ జరిగింది. తాజాగా కేరళ సీఎం పినరయి విజయన్, గవర్నర్ ఆరిఫ్ మొహ్మద్ ఖాన్ మధ్య యూనివర్శిటీ వీసీల నియామకంపై గొడవ మొదలైంది. అది పెరిగి పెద్దదై సుప్రీంకోర్ట్ వరకు వెళ్లింది. తాజాగా వీసీలంతా రాజీనామా చేయాలంటూ గవర్నర్ ఆదేశాలు జారీ చేయడం మరింత సంచలనంగా మారింది.

9మంది రాజీనామా చేయాల్సిందే..

కేరళలోని 9 యూనివర్శిటీల వీసీలు వెంటనే రాజీనామా చేయాలని గవర్నర్ ఆరిఫి మొహ్మద్ ఖాన్ ఆదేశాలిచ్చారు. డెడ్ లైన్ కూడా ప్రకటించారు. కేరళలోని ఏపీజే అబ్దుల్ కలాం టెక్నలాజికల్ యూనివర్సిటీ వీసీ నియామకం యూజీసీ నిబంధనలకు విరుద్ధమంటూ ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ ఉత్తర్వులను చూపిస్తూ, రాష్ట్రంలోని 9 వర్సిటీల వీసీలు కూడా రాజీనామా చేయాలని ఆదేశాలిచ్చారు గవర్నర్.

ఎందుకీ గొడవ..?

కేరళలోని పలు యూనివర్శిటీలకు వైస్ ఛాన్స్ లర్లను నియమించే విషయంలో ప్రభుత్వం నిబంధనలు పాటించలేదనేది గవర్నర్ ఆరోపణ. వీసీలను నియమించేది గవర్నర్లే అయినా, వారి పేర్లు సూచించేది మాత్రం రాష్ట్ర ప్రభుత్వమే. అయితే కేరళ ప్రభుత్వం ఒక్కో పోస్ట్ కి ఒక్కరి పేరునే సూచించింది. యూజీసీ నిబంధనల ప్రకారం ముగ్గురి పేర్లు సూచించాలి, అందులో ఒకరిని గవర్నర్ ఎంపిక చేయాలి. కానీ ఇక్కడ అలా జరగలేదు. దీంతో గవర్నర్ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మాత్రం గవర్నర్ నిర్ణయాన్ని తప్పుపడుతోంది. ఆయన ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్నవారిని వీసీలుగా నియమించాలని చూస్తున్నారని ఆరోపిస్తున్నారు అధికార పార్టీ నేతలు.

వివాదాస్పద వ్యాఖ్యలు..

ఇటీవల గవర్నర్ కేరళ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. డ్రగ్స్ విషయంలో త్వరలో పంజాబ్ ని కేరళ దాటిపోతుందని అన్నారు. మద్యం, లాటరీని రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన ఆదాయ వనరుగా చూస్తోందని, అది సిగ్గుచేటు అని విమర్శలు చేశారు. గవర్నర్ చేసిన వ్యాఖ్యలపై కేరళ ప్రభుత్వం మండిపడుతోంది. తాజాగా వీసీల రాజీనామా ఆదేశాలతో మరోసారి గవర్నర్, సీఎం మధ్య ఉన్న విభేదాలు రచ్చకెక్కినట్టయింది.

Tags:    
Advertisement

Similar News