మృత నేతలను కూడా వదలరా? మోడీపై కాంగ్రెస్ నేత జైరాంరమేష్ నిప్పులు

ప్రధాని మోడీ రాజకీయ కక్ష సాధింపు చర్యలు చివరకు మరణించిన నేతలను కూడా వదలడం లేదని కాంగ్రెస్ పార్టీ దుయ్యబట్టింది. 2002 లో మోడీ గుజరాత్ సీఎంగా ఉండగా ఆయన ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్

Advertisement
Update: 2022-07-16 12:12 GMT

ప్రధాని మోడీ రాజకీయ కక్ష సాధింపు చర్యలు చివరకు మరణించిన నేతలను కూడా వదలడం లేదని కాంగ్రెస్ పార్టీ దుయ్యబట్టింది. 2002 లో మోడీ గుజరాత్ సీఎంగా ఉండగా ఆయన ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ కుట్ర పన్నారని 'సిట్' చేసిన ఆరోపణలను పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ఖండించారు. ఇవి దురుద్దేశపూరితమైనవని, బీజేపీ 'ఉత్పత్తి' చేసినవని ఆయన నిప్పులు కక్కారు. గుజరాత్ లో గోధ్రా అల్లర్ల అనంతరం రాష్ట్రప్రభుత్వాన్ని అస్థిరపరచి, అప్పటి సీఎంగా ఉన్న మోడీని ఈ అల్లర్లలో ఇరికించేందుకు అహ్మద్ పటేల్ కుట్ర పన్నినట్టు గుజరాత్ పోలీసులు (సిట్) సెషన్స్ కోర్టుకు సమర్పించిన తమ అఫిడవిట్ లో పేర్కొన్నారు. పటేల్ పన్నిన ఈ భారీ కుట్రలో సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్ కూడా భాగస్వామి అని, ఆమెకు పటేల్ ధన సహాయం చేశారని వారు ఆరోపించారు. అయితే నాడు చెలరేగిన మతపరమైన హింసాకాండకు బాధ్యత వహించకుండా తనకు తాను బయటపడేందుకు నరేంద్ర మోడీ చాకచక్యంగా పాటించిన వ్యూహంలో భాగమే ఇదని జైరాం రమేష్ ఆరోపించారు. మోడీ పొలిటికల్ వెండెట్టా మెషిన్ (రాజకీయ కక్షా యంత్రం) మరణించిన తన పొలిటికల్ ప్రత్యర్థులను సైతం వదలడం లేదని ఆయన అన్నారు. అహ్మద్ పటేల్ కరోనాకు గురై 2020లో మరణించారు. ఇలా మృత నేతలపై కూడా మీరు కక్ష తీర్చుకుంటున్నారని జైరాంరమేష్ తీవ్రంగా ధ్వజమెత్తారు. నాటి ముఖ్యమంత్రిగా ఉన్న మోడీకి సిట్ చీఫ్ క్లీన్ చిట్ ఇచ్చిన అనంతరం దీనికి బహుమతిగా ఆయనకు డిప్లొమాటిక్ 'పోస్టు'నిచ్చారన్నారు. '2002 లో రేగిన అల్లర్లను మోడీ అణచలేకపోయారు.. సమర్థంగా వ్యవహరించలేకపోయారు. దీంతో అప్పటి ప్రధాని వాజ్ పేయి.. మోడీకి తన 'రాజధర్మాన్ని' గుర్తు చేయాల్సి వచ్చింది.' అని జైరామ్ రమేష్ పేర్కొన్నారు.

సిట్ కూడా తన పొలిటికల్ మాస్టర్ చెప్పినట్టల్లా ఆడుతోందని, కీలుబొమ్మల్లాంటి ఇలాంటి సంస్థలు ఎలా వ్యవహరిస్తాయో తమకు తెలుసునని అన్నారు. మోడీ-షా (అమిత్ షా) ద్వయం ఏళ్లతరబడి సాగిస్తున్న ఎత్తుగడలకు ఈ విధమైన ఆరోపణలే తార్కాణంగా నిలుస్తున్నాయన్నారు. ' ఇది మరో ఉదాహరణ ! మరణించిన ఒక వ్యక్తి మీద వేసిన నింద.. ఈ విధమైన అబద్ధాలను ఖండించడానికి లేదా తోసిపుచ్చడానికి ఆ వ్యక్తి ఎలాగూ లేరు' అని జైరాంరమేష్ అన్నారు. మొత్తానికి బీజేపీ, మోడీ శవ రాజకీయాలు చేస్తున్నారని ఆయన చెప్పకనే చెప్పారు.

నా తండ్రిని ఇరికిస్తున్నారు.. అహ్మద్ పటేల్ కుమార్తె

తన తండ్రి అహ్మద్ పటేల్ పై సిట్ చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని ఆయన కుమార్తె ముంతాజ్ పటేల్ పేర్కొన్నారు. ఇది చాలా తప్పు.. హెడ్ లైన్స్ కోసం, సెన్సేషన్ కోసం మరణించిన వ్యక్తి పేరును వాడుకోవడం చాలా సులభమని ఆమె బీజేపీపై ధ్వజమెత్తారు. , తనను తాను సమర్థించుకునేందుకు అహ్మద్ పటేల్ ఇక్కడ లేరని పేర్కొన్న ఆమె.. . ఒక కుటుంబంగా తాము ఇంతకన్నా ఏమీ చెప్పలేమని, అహ్మద్ పటేల్ కార్యకలాపాల్లో తాము జోక్యం చేసుకోలేదని అన్నారు.అయితే ఒక దశలో కోపంతో ఊగిపోయారు. తన తండ్రిపై చేసిన ఆరోణలు కట్టుకథ అని, బోగస్ అని ముంతాజ్ పటేల్ తీవ్రంగా ఖండించారు. గుజరాత్ లో జరగనున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బీజేపీ ఇలాంటి కట్టుకథలు చెబుతోందన్నారు.

ప్రతి ఏడాదీ ఏ ఎన్నికలు వచ్చినా ఓ కొత్త వివాదాన్ని ఆ పార్టీ సృష్టిస్తుందని, కొన్నేళ్ల క్రితం ఇలాంటి వివాదం ఎందుకు రాలేదని ఆమె ప్రశ్నించారు. కేంద్రానికీ విషయం తెలుసునని, కనీసం గత 8 ఏళ్ళలో ఈ సమస్యను వారెందుకు ప్రస్తావించలేదన్నారు. 'మీకు పెద్ద పేర్లు రావాలి.. వాంగ్మూలాలు, సాక్ష్యాలు ఎలా వస్తాయో మాకు తెలుసు ! ఎవరైనా ఏ స్టేట్మెంట్ ఇచ్చినా ఎవరు దాన్ని వెరిఫై చేస్తారు' అని ఆమె ప్రశ్నించారు. గుజరాత్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అహ్మద్ పటేల్ పేరును కుట్ర థియరీల్లోకి లాగడానికి బీజేపీ ప్రయత్నాలు ప్రారంభించిందని ముంతాజ్ ట్వీట్ చేశారు. తన తండ్రి జీవించి ఉన్నప్పుడు కూడా ఎన్నికల సమయంలో ఆ పార్టీ ఇలాగే చేసిందని, ఆయన లేని ఈ సమయంలో.. ఇప్పుడూ అదేవిధంగా వ్యవహరిస్తోందని ఆమె అన్నారు.

సోనియా గాంధీపై బీజేపీ విమర్శ

గుజరాత్ రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చేందుకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తన రాజకీయ కార్యదర్శి అహ్మద్ పటేల్ ద్వారా ప్రయత్నించారని బీజేపీ అధికారప్రతినిధి సాంబిత్ పాత్రా ఆరోపించారు. ఈ కుట్రలకు ఎవరు సూత్రధారో సిట్ తన అఫిడవిట్ లో వెలుగులోకి తెచ్చిందన్నారు. అహ్మద్ పటేల్ కేవలం ఓ పేరు మాత్రమేనని, దీని వెనుక సోనియా ఉన్నారని ఆయన అన్నారు. నరేంద్ర మోడీని అవమానపరచేందుకు ఆమె యత్నించారని, మొత్తం కుట్రకు ఆమె సూత్రధారి అని ఆయన పేర్కొన్నారు.


Tags:    
Advertisement

Similar News