నల్ల దుస్తుల్లో కాంగ్రెస్ సభ్యులు.. రాహుల్ అనర్హతపై పార్లమెంట్ లో రచ్చ

ఓ దశలో స్పీకర్ ఓం బిర్లా కుర్చీపై కాంగ్రెస్ సభ్యులు కాగితాలు చించి విసిరేశారు. పోడియం వద్దకు దూసుకెళ్లి నినాదాలు చేశారు. సభను గౌరవప్రదంగా నడపాలనుకుంటున్నాను అంటూ స్పీకర్ పదే పదే చెప్పినా కాంగ్రెస్ సభ్యులు వెనక్కి తగ్గలేదు.

Advertisement
Update: 2023-03-27 09:12 GMT

రాహుల్ గాంధీపై అనర్హత వేటు అంశం పార్లమెంట్ ని స్తంభింపజేసింది. రాహుల్ ని అనర్హుడిగా ప్రకటించడంపై కాంగ్రెస్ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. లోక్ సభ, రాజ్యసభలో ఆందోళనకు దిగారు. రాహుల్ పై తీసుకున్న చర్యలకు నిరసనగా కాంగ్రెస్ సభ్యులు నల్ల దుస్తుల్లో పార్లమెంట్ కి హాజరయ్యారు. కాంగ్రెస్ నేతృత్వంలో ప్రతిపక్షాల సభ్యులు కూడా ఈ వ్యవహారంపై ఆందోళనకు దిగారు.

పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం అయిన వెంటనే విపక్షాలు ఆందోళన చేయడంతో స్పీకర్ ఓం బిర్లా ఒక నిమిషం లోపు సభను వాయిదా వేశారు. తిరిగి వారి ఆందోళనలు తీవ్రం కావడంతో మరోసారి ఉభయ సభలు వాయిదా పడ్డాయి. ఓ దశలో స్పీకర్ ఓం బిర్లా కుర్చీపై కాంగ్రెస్ సభ్యులు కాగితాలు చించి విసిరేశారు. పోడియం వద్దకు దూసుకెళ్లి నినాదాలు చేశారు. సభను గౌరవప్రదంగా నడపాలనుకుంటున్నాను అంటూ స్పీకర్ పదే పదే చెప్పినా కాంగ్రెస్ సభ్యులు వెనక్కి తగ్గలేదు.


అంతకుముందు ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే ఛాంబర్‌ లో ప్రతిపక్షాలు సమావేశమయ్యాయి. సభలో ఉమ్మడి వ్యూహంపై చర్చించారు ఎంపీలు. కాంగ్రెస్‌ తో పాటు డీఎంకే, ఎస్పీ, జేడీయూ, బీఆర్‌ఎస్, సీపీఎం, ఆర్జేడీ, ఎన్సీపీ, సీపీఐ, ఐయూఎంఎల్, ఎండీఎంకే, కేరళ కాంగ్రెస్, టీఎంసీ, ఆర్ఎస్పీ,ఆప్, జమ్ము కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్, ఉద్ధవ్ సేన నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. రాహుల్ గాంధీపై అనర్హత వేటుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఎంపీలు లోక్‌ సభలో వాయిదా నోటీసు ఇచ్చారు. రాజ్యసభలో, అదానీ సమస్య , రాజకీయ నేతలపై దర్యాప్తు ఏజెన్సీల దుర్వినియోగంపై నోటీసు ఇచ్చారు సభ్యులు. 

Tags:    
Advertisement

Similar News