ఎన్నికల వరకు తగ్గేదే లేదు.. ఆ భర్తలను వదిలేదే లేదు

ఈ వ్యవహారం అసోంలో సంచలనంగా మారింది, విమర్శలు ఎదుర్కొంటోంది. కానీ సీఎం హిమంత తగ్గేదే లేదంటున్నారు. 2026 అసెంబ్లీ ఎన్నికల వరకు ఈ యజ్ఞం ఆపేది లేదని తాజాగా స్టేట్ మెంట్ ఇచ్చారు.

Advertisement
Update: 2023-02-04 23:30 GMT

అసోంలో బాల్య వివాహాలను నిరోధించడానికి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే బాల్య వివాహాలు చేసుకున్న దంపతుల విషయంలో సీఎం హిమంత బిశ్వశర్మ సీరియస్ గా ఉన్నారు. భర్తలను అరెస్ట్ చేసి జైళ్లకు పంపిస్తున్నారు. శనివారం ఒక్కరోజే అసోంలో 2250మంది భర్తలు అరెస్ట్ అయ్యారు. వీరు చేసిన పాపం ఒక్కటే. 18 ఏళ్లలోపు బాలికలను వివాహం చేసుకోవడం. నాలుగేళ్ల క్రితం పెళ్లై, ప్రస్తుతం భార్య వయసు 22 ఏళ్లు ఉన్నా కూడా భర్తపై కేసు పెట్టి జైలులో వేస్తున్నారు. దీంతో ఈ వ్యవహారం అసోంలో సంచలనంగా మారింది, విమర్శలు ఎదుర్కొంటోంది. కానీ సీఎం హిమంత తగ్గేదే లేదంటున్నారు. 2026 అసెంబ్లీ ఎన్నికల వరకు ఈ యజ్ఞం ఆపేది లేదని తాజాగా స్టేట్ మెంట్ ఇచ్చారు.

బాల్యవివాహాలను ఎవరూ సమర్థించరు కానీ, మరీ ఇలా అరెస్ట్ లు, జైళ్లు అంటే ఇంటి దగ్గర ఒంటరిగా మిగిలిపోయిన ఆ భార్యల సంగతేంటనే ప్రశ్న వినపడుతోంది. తమ భర్తలతో తాము సంతోషంగా కాపురం చేసుకుంటున్నామని, ప్రభుత్వం ఇలా కక్షగట్టినట్టు ప్రవర్తించడమేంటని భార్యలు వాపోతున్నారు. వారి కుటుంబ సభ్యులు ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారు. విపక్షాలు సీఎం హిమంత నిర్ణయంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాయి. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ కూడా అసోం సీఎం నిర్ణయాన్ని తప్పుబట్టారు. కుటుంబాలు విచ్ఛిన్నం చేస్తున్నారంటూ మండిపడ్డారు.

బాల్య వివాహాలకు వ్యతిరేకంగా రాష్ట్ర పోలీసులు చేపట్టిన ఆపరేషన్ 2026 అసోం ఎన్నికల వరకు కొనసాగుతుందని సీఎం హిమంత బిశ్వ శర్మ స్పష్టం చేశారు. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 4,074 ఎఫ్ఐఆర్ లు నమోదయ్యాయని చెప్పారు. బాల్య వివాహాలకు చేసిన తల్లిదండ్రులకు నోటీసులు ఇచ్చి వదిలేస్తున్నామని అరెస్ట్ చేయడం లేదని ఆయన అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 4 వేల బాల్య వివాహాలు జరుగగా, అందులో 8 వేల మంది నిందితులుగా ఉన్నారని చెప్పారు. తల్లిదండ్రులను విడిచిపెడితే అరెస్ట్ ఎదుర్కొనే నిందితుల సంఖ్య సుమారు 3,500 వరకు ఉంటుందని వెల్లడించారు. వివాహాలు నిర్వహించే ముస్లిం పెద్దల ఖాజీల వ్యవస్థను నియంత్రించాలని, అవగాహన కల్పించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారాయన.

అసోంలో మాతా శిశు మరణాల రేటు ఎక్కువగా ఉందని, దానికి కారణం బాల్యవివాహాలేనంటున్నారు సీఎం హిమంత. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే నివేదికల ప్రకారం రాష్ట్రంలో నమోదైన వివాహాలలో సగటున 31 శాతం వివాహాలు, చైల్డ్ మ్యారేజ్ లే కావడం దురదృష్టకరం అని చెబుతున్నారు. అయితే అరెస్ట్ లతో ఆయన ఈ వ్యవహారాన్ని మరింత జటిలం చేశారని తెలుస్తోంది.

Tags:    
Advertisement

Similar News