పోలైన ఓట్ల సంఖ్యలో మార్పులు అసాధ్యం.. - స్పష్టం చేసిన ఎన్నికల సంఘం

ఓటింగ్‌ పూర్తయిన 48 గంటల్లోగా ప్రతి పోలింగ్‌ కేంద్రం వారీగా ఓటింగ్‌ శాతాలను ఈసీ వెబ్‌సైట్‌లో ఉంచాలని అభ్యర్థిస్తూ అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫామ్స్‌ (ఏడీఆర్‌) అనే సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.

Advertisement
Update: 2024-05-26 03:39 GMT

పోలైన ఓట్ల సంఖ్యలో మార్పులు చేయడం అసాధ్యమని ఎన్నికల సంఘం (ఈసీ) మరోసారి స్పష్టం చేసింది. దేశంలో ఎన్నికల ప్రక్రియకు హాని కలిగించేలా ఒక క్రమపద్ధతిలో తప్పుడు కథనాలను వ్యాప్తి చేస్తూ.. దుర్మార్గపు ప్రయత్నాలు చేస్తున్నారని ఈ సందర్భంగా ఈసీ ఆరోపించింది. లోక్‌సభ ఎన్నికల తొలి ఐదు దశలకు సంబంధించి నమోదైన ఓట్ల వివరాలను శనివారం విడుదల చేసిన ఎన్నికల సంఘం.. నియోజకవర్గాల వారీగా మొత్తం ఓట్లు, పోలైన ఓట్ల గణాంకాలను తన వెబ్‌సైట్‌లో వెల్లడించింది.

ఓటింగ్‌ పూర్తయిన 48 గంటల్లోగా ప్రతి పోలింగ్‌ కేంద్రం వారీగా ఓటింగ్‌ శాతాలను ఈసీ వెబ్‌సైట్‌లో ఉంచాలని అభ్యర్థిస్తూ అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫామ్స్‌ (ఏడీఆర్‌) అనే సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. అయితే, ఇప్పటికే ఐదు దశల పోలింగ్‌ ముగిసి.. మరో రెండు దశలు మాత్రమే మిగిలి ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో దీనిపై ఈసీకి ఆదేశాలు జారీ చేయలేమని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.

ఈ నేపథ్యంలోనే ఎన్నికల సంఘం తాజా ప్రకటనలో దీనిపై స్పష్టత ఇచ్చింది. ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఓటు హక్కును వినియోగించుకున్నవారి కచ్చితమైన సంఖ్యను వెల్లడించేందుకు ’ఓటర్‌ టర్నవుట్‌ డేటా ఫార్మాట్‌’ను మరింత విస్తరించాలని నిర్ణయించినట్టు వివరించింది. మొత్తం ఓటర్ల సంఖ్య, నమోదైన పోలింగ్‌ శాతం ద్వారా ఎంతమంది ఓటేశారనేది తెలుసుకోవచ్చని పేర్కొంది. ఈ రెండు వివరాలూ ఇప్పటికే ప్రజల వద్ద అందుబాటులో ఉన్నాయని గుర్తు చేసింది. పోలింగ్‌ శాతాన్ని విడుదల చేస్తున్న ఈసీ.. నమోదైన ఓట్ల సంఖ్యనూ వెల్లడించాలని డిమాండ్లు వస్తున్న నేపథ్యంలో పైవిధంగా స్పందించింది.

Tags:    
Advertisement

Similar News