ముస్లిం రిజర్వేషన్‌పై హైకోర్టు సంచలన తీర్పు

రాష్ట్ర ఓబీసీ జాబితాను సమీక్షించి చేరికలు, తొలగింపులపై సిఫార్సులతో శాసనసభకు నివేదిక ఇవ్వాలని, బీసీ కమిషన్‌తోనూ సంప్రదింపులు జరపాలని పశ్చిమబెంగాల్‌ బీసీ సంక్షేమ విభాగాన్ని ధర్మాసనం ఆదేశించింది.

Advertisement
Update: 2024-05-23 04:55 GMT

ముస్లిం ఉప కులాలకు రిజర్వేషన్‌ కల్పించేందుకు ఉద్దేశించిన ఓబీసీ హోదాను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. పశ్చిమబెంగాల్‌లో అక్కడి ప్రభుత్వం 2010 తరువాత ప్రభుత్వ ఉద్యోగాలు, సర్వీసుల్లో రిజర్వేషన్లు కల్పించేందుకు 77 ముస్లిం ఉప కులాలను ఓబీసీలుగా గుర్తిస్తూ తీసుకొచ్చిన ఉత్తర్వులు చట్ట విరుద్ధమని ధర్మాసనం తెలిపింది. మతాన్ని ఏకైక ప్రామాణికంగా తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నారని గుర్తుచేసింది. ముస్లిం సమాజాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం ఒక వస్తువుగా పరిగణిస్తున్నారని జస్టిస్‌ తపబ్రత చక్రవర్తి, జస్టిస్‌ రాజశేఖర్‌ మంథా ధర్మాసనం తెలిపింది. అయితే, ఇప్పటికే ఈ విధమైన రిజర్వేషన్లు పొందినవారు, ప్రభుత్వ ఉద్యోగాలు, సర్వీసులకు ఎంపికైనవారికి తమ తీర్పు వర్తించదనీ.. వారు ఉద్యోగాల్లో యథావిధిగా కొనసాగవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది.

2012లో చేసిన ఒక చట్టం కింద కొన్ని కులాలకు ఓబీసీ రిజర్వేషన్లు కల్పించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా హైకోర్టు ఈ ఉత్తర్వులు జారీ చేసింది. 2010 ఏప్రిల్‌ – సెప్టెంబరు మధ్య 77 కులాలను ఓబీసీలుగా ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను, 2012 చట్టం ఆధారంగా కొత్తగా చేర్చిన మరో 37 కులాల ఓబీసీ హోదాను కోర్టు కొట్టివేసింది. పశ్చిమబెంగాల్‌ రాష్ట్రంలో 2011 మే 7 వరకు సీపీఎం ప్రభుత్వం ఉండగా, ఆ తర్వాత టీఎంసీ అధికారంలోకి వచ్చింది.

2010కి ముందు రాష్ట్ర ప్రభుత్వం 66 కులాలను ఓబీసీలుగా వర్గీకరించడాన్ని ఎవరూ సవాలు చేయనందున అందులో తాము జోక్యం చేసుకోవడం లేదని కోర్టు తెలిపింది. ఓబీసీల రిజర్వేషను శాతాన్ని 7 నుంచి 17 శాతానికి పెంచుతూ 2010 సెప్టెంబరులో జారీ చేసిన ఉత్తర్వులను సైతం ధర్మాసనం కొట్టివేసింది. ఈ తీర్పుపై స్టే కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని హైకోర్టు తోసిపుచ్చింది. రాష్ట్ర ఓబీసీ జాబితాను సమీక్షించి చేరికలు, తొలగింపులపై సిఫార్సులతో శాసనసభకు నివేదిక ఇవ్వాలని, బీసీ కమిషన్‌తోనూ సంప్రదింపులు జరపాలని పశ్చిమబెంగాల్‌ బీసీ సంక్షేమ విభాగాన్ని ధర్మాసనం ఆదేశించింది.

సుప్రీంలో సవాల్‌ చేస్తాం : మమతా బెనర్జీ

కలకత్తా హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో సవాల్‌ చేస్తామని పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుధవారం స్పష్టం చేశారు. ఎన్నికల తరుణంలో ఓబీసీ రిజర్వేషన్లను అడ్డుకోవడానికి బీజేపీ కుట్ర పన్నిందని ఆమె ఆరోపించారు.

మోడీ స్పందన ఇదీ..

కలకత్తా హైకోర్టు తీర్పుపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందిస్తూ ఇది ప్రతిపక్షాలకు గట్టి చెంపదెబ్బ లాంటిదని చెప్పారు. ఢిల్లీ ఎన్నికల సభలో మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు. తాను ముస్లిం అనే పదాన్ని వాడినప్పుడల్లా మతపరమైన ప్రకటనలు చేస్తున్నానని ఆరోపించారని ఆయన విమర్శించారు.

Tags:    
Advertisement

Similar News