బాల బాలికలకు కుక్కలతో పెళ్లి.. ఒడిశాలో ఘటన

బాలాసోర్ పట్టణ సమీపంలోని సోరో బ్లాక్ బంద్ గ్రామానికి చెందిన తపన్ సింగ్ అనే పదకొండేళ్ల బాలుడికి ఆడ కుక్కను, బుటు కుమార్తె అయిన ఏడేళ్ల లక్ష్మీ అనే బాలికకు మగ కుక్కతో ఘనంగా వివాహం జరిపించారు.

Advertisement
Update: 2023-04-19 05:43 GMT

భారతదేశం భిన్న కులాలు, భిన్న మతాల సమ్మేళనం. ఇక్కడ అనాది నుంచి ప్రజలు వివిధ కట్టుబాట్లను, ఆచారాలను కొనసాగిస్తూ వస్తున్నారు. దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధమైన ఆచారాలు, సంస్కృతులు ఉంటాయి. ఈ ఆచారాలు కట్టుబాట్లు చూడటానికి వింతగా ఉన్నప్పటికీ వాటిని నమ్మేవారు మాత్రం పాటిస్తూనే ఉంటారు. తాజాగా ఒడిశా రాష్ట్రంలో ఓ బాలికకు, బాలుడికి కుక్కలతో వివాహం జరిపించడం సంచలనంగా మారింది.

బాలాసోర్ పట్టణ సమీపంలోని సోరో బ్లాక్ బంద్ గ్రామానికి చెందిన తపన్ సింగ్ అనే పదకొండేళ్ల బాలుడికి ఆడ కుక్కను, బుటు కుమార్తె అయిన ఏడేళ్ల లక్ష్మీ అనే బాలికకు మగ కుక్కతో ఘనంగా వివాహం జరిపించారు. వివాహం చేసేది కుక్కలతో అయినప్పటికీ సంప్రదాయాన్ని అనుసరించి బంధుమిత్రుల సమక్షంలో ఈ వేడుకలను ఘనంగా జరపడం విశేషం.

దుష్టశక్తులను పారదోలడానికి కుక్కలతో పెళ్లి

దుష్టశక్తులను పారదోలడానికే చిన్నారులకు కుక్కలతో పెళ్లి జరుపుతున్నట్లు గ్రామ పెద్దలు తెలిపారు. బాలాసోర్ సమీప ప్రాంతాల్లో హో తెగకు చెందిన ప్రజలు ఇటువంటి సంప్రదాయాన్ని పాటిస్తారు. పిల్లల దవడలపై దంతాలు కనిపించడం అశుభం అని ఈ తెగకు చెందిన గిరిజనులు విశ్వసిస్తారు. దవడలపై దంతాలు వచ్చిన పిల్లలకు కుక్కలతో పెళ్లి జరిపిస్తారు. ఇలా చేస్తే పిల్లలకు దుష్టశక్తుల నుంచి ఎటువంటి హాని ఉండదని, దుష్టశక్తులు పారిపోతాయని ఈ తెగకు చెందిన ప్రజలు నమ్ముతారు.

ఇలా పిల్లలకు కుక్కలతో పెళ్లి జరిగితే పిల్లలకు జరగాల్సిన చెడు కుక్కలకు చేరుతుందని గిరిజన సమాజం విశ్వసిస్తుంది. ఏమీ తెలియని మారుమూల ప్రాంతానికి చెందిన గిరిజనులు ఈ ఆచారాలను నమ్మడం మామూలే అయినప్పటికీ.. ఈ ప్రాంతంలో చదువుకున్న వారు కూడా ఇటువంటి ఆచారాలను నమ్ముతున్నారు. అనాదిగా తమ తెగకు చెందిన పెద్దలు ఈ ఆచార, వ్యవహారాలను నమ్ముతూ వస్తున్నారని.. వాటిని తాము కూడా కొన‌సాగిస్తున్నట్లు వారు చెబుతున్నారు.

Tags:    
Advertisement

Similar News