ఓట్లు మనకే పడతాయా..? అయితే ఎస్టీ హోదా ఇచ్చేయండి..

కాశ్మీర్ లో గుజ్జర్లు, పహారీల మధ్య విభేదాలు సృష్టించేందుకు, ఆ విభేదాలతో తాము లాభపడేందుకు ప్రయత్నిస్తున్నారు బీజేపీ నేతలు. పహారీలకు ఎస్టీ హోదా ప్రకటించబోతున్నారు.

Advertisement
Update: 2022-10-04 02:49 GMT

మత రాజకీయాలు, కుల రాజకీయాలు, విద్వేష రాజకీయాలకు బీజేపీ పెట్టింది పేరు. తమకి లాభం వస్తుంది అనుకుంటే ఏ ఇద్దరి మధ్య అయినా చిచ్చు పెట్టడం వారికి అలవాటే. సంబంధం లేనివారు కూడా కొట్టుకునేలా చేస్తారు బీజేపీ నేతలు. ఇప్పుడు కాశ్మీర్ లో గుజ్జర్లు, పహారీల మధ్య విభేదాలు సృష్టించేందుకు, ఆ విభేదాలతో తాము లాభపడేందుకు ప్రయత్నిస్తున్నారు బీజేపీ నేతలు. పహారీలకు ఎస్టీ హోదా ప్రకటించబోతున్నారు.

బీజేపీకి ఏంటి లాభం..?

ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ లో గుజ్జర్లు, బకేర్వాల్‌ లు ఎస్టీలు. పహారీ భాష మాట్లాడేవారు కూడా తమను ఎస్టీల్లో చేర్చాలని చాన్నాళ్లనుంచి డిమాండ్ చేస్తున్నారు. కానీ భాషా ప్రాతిపదికన అలా ఎస్టీ హోదా ఇవ్వడం కుదరదు కాబట్టి కేంద్రం నిర్ణయం తీసుకోలేదు. కానీ ఇప్పుడు బీజేపీకి అక్కడ వారితో రాజకీయ అవసరం ఏర్పడింది. జమ్మూ కాశ్మీర్ కి ఉన్న ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేసిన తర్వాత త్వరలో అక్కడ ఎన్నికలు జరగాల్సి ఉంది. జమ్మూ కాశ్మీర్ లో ఎన్నికలు పెడితే బీజేపీకి విజయావకాశాలు తక్కువ. అందుకే అక్కడ విద్వేషాలు రెచ్చగొట్టేందుకు సిద్ధమైంది. పహారీలకు ఎస్టీకోటా ప్రకటిస్తే ఆ వర్గం అంతా తమవైపు ఉంటారనేది కమలం పార్టీ ఆలోచన. దీన్ని అమలులో పెట్టేందుకు అమిత్ షా మూడు రోజుల పర్యటనకు వెళ్తున్నారు.

పహారీలకు ఎస్టీ హోదా ప్రకటించడం లాంఛనం అని తేలిపోయింది. దీంతో ఆ వర్గానికి చెందిన నాయకులు, ఇతర పార్టీలనుంచి బీజేపీవైపు చూస్తున్నారు. నేషనల్ కాన్ఫరెన్స్ కి చెందినవారిలో కొంతమంది అమిత్ షా పర్యటన సందర్భంగా బీజేపీతో చేతులు కలపబోతున్నారు. అమిత్ షా సభలకు ఆయా నాయకులు పెద్ద ఎత్తున పహారీలను తరలిస్తున్నారు. దీంతో ఆయా పార్టీలన్నీ కలవరపడుతున్నాయి. ఇప్పటి వరకూ పహారీలు నేషనల్ కాన్ఫరెన్స్ కి ఓటు బ్యాంక్ గా ఉన్నారు. వారికి కేంద్రం ఎస్టీ హోదా ప్రకటిస్తే, వారంతా బీజేపీ సానుభూతి పరులుగా మరాడం ఖాయం. అందుకే నేషనల్ కాన్ఫరెన్స్ అధినేతలు హడావిడి పడుతున్నారు. కాశ్మీర్ లో ఓటుబ్యాంకు రాజకీయాలు చెల్లవంటూ మండిపడుతున్నారు.

కులాన్నయినా, మతాన్నయినా కేవలం రాజకీయకోణంలో చూడటమే బీజేపీకి అలవాటు. ఆ అలవాటుతోనే జమ్మూ కాశ్మీర్ ని విభజించి అక్కడ రాజకీయ లబ్ధి పొందాలనుకుంటోంది. ప్రస్తుతం జమ్మూకాశ్మీర్ లో ఎన్నికలకు టైమ్ దగ్గరపడటంతో అక్కడ ఎస్టీ ఎత్తుగడ వేసింది బీజేపీ.

Tags:    
Advertisement

Similar News