దేశంలో రెండు సెకన్లకు ఓ కుక్క కాటు, అరగంటకో మరణం.. ఆందోళన కలిగిస్తున్న రిపోర్ట్

దేశంలో ప్రతి రెండు సెకన్లకు ఒకరు కుక్కకాటుకు గురవుతుండగా, వారిలో ప్రతి అరగంటకు ఒకరు మరణిస్తున్నారని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ , ఢిల్లీ ఎయిమ్స్ సంయుక్తంగా నిర్వహించిన తాజా అధ్యయనం తేల్చింది.

Advertisement
Update: 2023-04-09 07:08 GMT


*కొద్ది సేపటి క్రితం మెదక్ జిల్లా నర్సాపూర్ లో ఆరేళ్ళ చిన్నారిపై వీధికుక్క దాడి. చిన్నారి తలకు తీవ్ర గాయాలు. బాలిక పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్ తరలించారు.

*ఈ రోజు ఉదయం అనంత పురంలో ఓ డిగ్రీ విద్యార్థినిపై వీధికుక్క దాడి 


వీధికుక్కల దాడులకు సంబంధించిన వార్తలు ఈ మధ్య చాలా వింటున్నాం. హైదరాబాద్ లో వీధి కుక్కలు ఓ పసి బాలుడిని కరిచి చంపిన హృదయవిదారకరమైన సంఘటన ఇప్పటికీ జనం మర్చిపోలేకపోతున్నారు. అయితే ఒక్క హైదరాబాద్ లోనే కాదు దేశ వ్యాప్త‍ంగా వీధికుక్కల సమస్య తీవ్రంగానే ఉంది.

దేశంలో ప్రతి రెండు సెకన్లకు ఒకరు కుక్కకాటుకు గురవుతుండగా వారిలో ప్రతి అరగంటకు ఒకరు మరణిస్తున్నారని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ , ఢిల్లీ ఎయిమ్స్ సంయుక్తంగా నిర్వహించిన తాజా అధ్యయనం తేల్చింది.

అధ్యయనం ప్రకారం, భారత్‌లో 2 కోట్ల కుక్కలు ఉండగా అందులో వీధికుక్కలు 1.53 కోట్లు ఉన్నాయి. కుక్కకాటు, ఇతర జంతువుల కాటు వల్ల వచ్చే రేబిస్ కారణంగా ప్రతి సంవత్సరం 18,000 నుండి 20,000 మంది మరణిస్తున్నారు. దేశంలో 93% రేబిస్ మరణాలు కుక్క కాటు వల్లనే సంభవిస్తున్నాయనేది అధ్యయనం తెలిపింది. ఇందులో 63% మరణాలు వీధి కుక్కల వల్లనే. పట్టణాల్లో 60%, గ్రామాల్లో 64% వీధికుక్కల ద్వారా మరణాలు సంభవిస్తున్నాయి.

వ్యర్థాలను ప్రజలు స‌రైన పద్దతిలో పారవేయకపోవడం, చెత్త కుప్పలను సరిగ్గా మెయిన్‌టైన్‌ చేయకపోవడం వీధి కుక్కలు పెరగడానికి ఒక‌ కారణమని అధ్యయనం చెప్పింది. అలాగే చాలా ఆస్పత్రుల వల్ల కూడా వీధికుక్కలు పెరుగుతున్నాయని అధ్యయనం తెలిపింది. ఆస్పత్రుల్లో ఉండే రోగులు పడేసే ఆహార‌ వ్యర్థాల కోసం కుక్కలు ఆస్పత్రుల వద్దే తిష్టవేస్తున్నాయని అధ్యయనం కనుగొంది. అక్కడి కొచ్చే ప్రజల మీద దాడులు చేయడమే కాక మార్చురీల్లోకి చొరబడి శవాలను కూడా పీక్కుతింటున్నాయని అధ్యయనం తేల్చింది.

ఈ సమస్యకు పరిష్కారం కుటుంబ నియంత్రణ మాత్రమే అని AIIMS, ICMR అధ్యయనం చెప్పింది. వీధి కుక్కలకు ఆపరేషన్లకు బదులుగా టీకాలు, ఇతర అధునాతన కుటుంబ నియంత్రణ పద్ధతులను అవలంబిస్తే మెరుగైన ఫలితాలు లభిస్తాయని దీని ద్వారా వీధికుక్కలను నియంత్రణ చేయవచ్చని అధ్యయనం తెలిపింది.

Tags:    
Advertisement

Similar News