పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్న చిరంజీవి

తెలుగు సినీ ఇండస్ట్రీలో అక్కినేని నాగేశ్వరరావు తర్వాత ఈ గౌరవం అందుకున్న రెండవ తెలుగు నటుడిగా చిరంజీవి ఈ ఘనత సాధించారు.

Advertisement
Update: 2024-05-09 17:11 GMT

మెగాస్టార్ చిరంజీవి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మవిభూషణ్ అవార్డు అందుకున్నారు. ఇవాళ న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో రెండవ విడత పద్మ పురస్కారాల ప్రదానోత్సవం జరిగింది. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మవిభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు.

నాలుగు దశాబ్దాలుగా సినీ రంగానికి చేసిన సేవకుగాను ఈ అవార్డు ఆయనను వరించింది. ఈ కార్యక్రమంలో చిరంజీవితో పాటు భార్య సురేఖ, కుమారుడు రామ్ చరణ్, కోడలు ఉపాసన పాల్గొన్నారు. కొన్నేళ్ల కిందటే పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డులు అందుకున్న చిరంజీవి ఇప్పుడు దేశ రెండో అత్యున్నత పురస్కారమైన పద్మవిభూషణ్ అవార్డు అందుకున్నారు.

తెలుగు సినీ ఇండస్ట్రీలో అక్కినేని నాగేశ్వరరావు తర్వాత ఈ గౌరవం అందుకున్న రెండవ తెలుగు నటుడిగా చిరంజీవి ఈ ఘనత సాధించారు. దశాబ్దాల తెలుగు సినిమా చరిత్రలో ఈ అవార్డు కేవలం ఈ ఇద్దరికి మాత్రమే దక్కింది. రాష్ట్రపతి నుంచి పద్మవిభూషణ్ అవార్డు అందుకున్న చిరంజీవికి తెలుగు ఇండస్ట్రీకి చెందిన పలువురు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ ఏడాది జనవరి 25న మొత్తం 132 మందికి కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించింది. గత నెల 22న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో పాటు సగం మందికి పద్మ పురస్కారాలను ప్రదానం చేసిన రాష్ట్రపతి మిగిలిన వారికి ఇవాళ సాయంత్రం ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి జగ్ దీప్ ధన్ ఖడ్, ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా తదితరులు పాల్గొన్నారు.

Tags:    
Advertisement

Similar News