మామా కోడళ్ళు మరింత ఇరుక్కుంటున్నారా?

కోటి రూపాయలు డిపాజిట్ చేసిన వాళ్ళందరు విచారణకు హాజరైతే అసలు విషయాలు బయటపడతాయి. కోటి రూపాయలు డిపాజిట్ చేసిన వాళ్ళ ఆర్థిక నేప‌థ్యం ద్వారా మరిన్ని వివరాలు బయటపడే అవకాశముంది.

Advertisement
Update: 2023-07-12 06:10 GMT

మార్గదర్శి చిట్ ఫండ్స్ దర్యాప్తు కీలకమైన మలుపు తీసుకుంది. మార్గదర్శిలో కోటి రూపాయలకు మించి డిపాజిట్లు వేసిన ఖాతాదారులకు సీఐడీ నోటీసులు జారీ చేసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బోర్డ్ ఆఫ్‌ డెరెక్ట్ ట్యాక్సెస్(సీడీబీటీ) నిబంధనల ప్రకారమే కోటి రూపాయలు డిపాజిట్ చేసిన ఖాతాదారులను విచారణకు రావాల్సిందిగా సీఐడీ నోటీసులు జారీ చేసింది. మార్గదర్శిలో కోటి రూపాయలకు పైగా ఎంతమంది డిపాజిట్ చేశారన్న వివరాలను సీఐడీ చెప్పలేదు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే మార్గదర్శిలో బ్లాక్ మనీ ఉందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ పదేపదే ఆరోపించిన విషయం తెలిసిందే. అలాగే మనీల్యాండరింగ్ జరుగుతోందని సీఐడీ అనుమానిస్తోంది. మార్గదర్శిలో జరుగుతున్న మోసాలు, చట్ట ఉల్లంఘనలను మొట్టమొదట బయటపెట్టిందే ఉండవల్లి. మార్గదర్శికి వ్యతిరేకంగా ఉండవల్లి సుమారు 17 ఏళ్ళుగా న్యాయస్థానాల్లో పోరాడుతున్నారు. ఆయన ఒంటరి పోరాటానికి చాలాకాలం ఏ కోణంలో కూడా మద్దతు దొరకలేదు. ఒంటరి పోరాటం చేసి ఆలసిపోతున్న దశలో సడెన్‌గా ఏపీ ప్రభుత్వం మద్దతుగా నిలిచింది.

ఎప్పుడైతే ప్రభుత్వం కూడా మార్గదర్శికి వ్యతిరేకంగా పోరాటం మొదలుపెట్టిందో అప్పుడు ఉండవల్లి పోరాటానికి ఒక్కసారిగా బలం పెరిగింది. అదే చివరకు ఛైర్మన్ రామోజీరావు, ఎండీ, కోడలు శైలజను సీఐడీ విచారించే దశకు చేరుకుంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే మార్గదర్శిలో కోటి రూపాయలు డిపాజిట్ చేయటం అంటే మామూలు విషయంకాదు. మధ్య, ఎగువ మధ్య తరగతి జనాలు లక్షల రూపాయలకు మించి డిపాజిట్లు చేయలేరు. అలాంటిది ఏకంగా కోటి రూపాయలు డిపాజిట్ చేయటంపై సీఐడీ అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్లుంది.

ఈ కార‌ణం చేత‌నే మార్గదర్శి చిట్ ఫండ్స్ రూపంలో నల్లధనం చెలామణి అవుతోందని ఉండవల్లి ఆరోపించారు. ఇప్పుడు కోటి రూపాయలు డిపాజిట్ చేసిన వాళ్ళందరు విచారణకు హాజరైతే అసలు విషయాలు బయటపడతాయి. కోటి రూపాయలు డిపాజిట్ చేసిన వాళ్ళ ఆర్థిక నేప‌థ్యం ద్వారా మరిన్ని వివరాలు బయటపడే అవకాశముంది. అప్పుడు మనీల్యాండరింగ్, నల్లధనం ఆరోపణల అసలు విషయాలు వెలుగుచూస్తాయి. అదే జరిగితే రామోజీ, శైలజ చుట్టూ ఉచ్చు మరింతగా బిగుసుకునే అవకాశాలున్నాయి.

Tags:    
Advertisement

Similar News