పపువా న్యూ గినియా విషాదం.. మృతులు 670 మంది

పపువా న్యూ గినియా రాజధాని పోర్ట్‌ మోర్స్బీకి సుమారు 600 కిలోమీటర్ల దూరంలో, ఎన్గా ప్రావిన్స్‌లో ఈ ఘోర విపత్తు సంభవించింది. తెల్లవారుజామున 3 గంటలకు ప్రజలు నిద్రలో ఉన్న సమయంలో ఈ దుర్ఘటన చోటుచేసుకోవడంతో భారీ ప్రాణనష్టం సంభవించింది.

Advertisement
Update: 2024-05-26 15:23 GMT

పసిఫిక్‌ ద్వీప దేశమైన పపువా న్యూ గినియాలోని ఓ మారుమూల గ్రామంలో కొండచరియలు విరిగిపడి భారీ ప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనలో మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. మొదట 100 మంది మృతి చెందారని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పటి వరకు 670 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్‌ ఫర్ మైగ్రేషన్ (IOM) సంస్థ అంచనా వేసింది. దాదాపు నాలుగు ఫుట్‌బాల్ మైదానాల విస్తీర్ణంలో శిథిలాలు పరచుకున్నట్లు సమాచారం. ఈ ఘోర ప్రమాదంలో 150కి పైగా ఇళ్లు ధ్వంసమయ్యాయని యూఎన్‌ మైగ్రేషన్ ఏజెన్సీ మిషన్ చీఫ్‌ సెర్హన్ అక్టోప్రాక్ అన్నారు. సుమారు ఆరు నుంచి ఎనిమిది మీటర్ల లోతులో చిక్కుకుపోయిన వారు ప్రాణాలతో బయటపడే అవకాశం దాదాపు లేనట్లే అని ఆయన పేర్కొన్నారు. అయితే ఆదివారం నాటికి కేవలం ఐదు మృతదేహాలు, ఆరో మృతదేహానికి సంబంధించిన ఓ కాలును మాత్రమే వెలికితీశారు. ప్రస్తుతానికి ఇంకా అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రాణాలతో బయటపడిన వారిని అధికార యంత్రాంగం సురక్షితమైన ప్రదేశాలకు తరలిస్తోంది.

పపువా న్యూ గినియా రాజధాని పోర్ట్‌ మోర్స్బీకి సుమారు 600 కిలోమీటర్ల దూరంలో, ఎన్గా ప్రావిన్స్‌లో ఈ ఘోర విపత్తు సంభవించింది. తెల్లవారుజామున 3 గంటలకు ప్రజలు నిద్రలో ఉన్న సమయంలో ఈ దుర్ఘటన చోటుచేసుకోవడంతో భారీ ప్రాణనష్టం సంభవించింది. విపత్తు కారణంగా 1,000 మందికి పైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఒకవైపు మరిన్ని కొండచరియలు విరిగిపడటం, ప్రావిన్స్‌ రాజధాని రోడ్లు మూసుకుపోవటం, ఘటనాస్థలానికి చేరుకునే మార్గంలో తెగల ఘర్షణల కారణంగా బాధితులకు సహాయక సామగ్రి చేరవేయడంలో ఆటంకాలు ఎదురవుతున్నాయి. దీంతో సహాయక కాన్వాయ్‌లకు కూడా సైనికుల భద్రత కల్పిస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News