పిల్లలకోసం అల్లాడిపోతున్న జపాన్..

గర్భం దాల్చినందుకు, పిల్లలు పుట్టినందుకు, పిల్లల సంరక్షణకు పలు రకాల రాయితీలు ప్రకటిస్తోంది జపాన్ ప్రభుత్వం. అయితే ఇవేవీ పెద్దగా ఫలితాలనివ్వట్లేదు.

Advertisement
Update: 2022-11-29 05:36 GMT

జపాన్ లో ఏడాదికేడాది పుట్టే పిల్లల సంఖ్య గణనీయంగా తగ్గిపోతోంది. ఆర్థిక అవసరాల దృష్ట్యా పిల్లల్ని కని, పెంచడం కష్టంగా భావిస్తున్నారు అక్కడి ప్రజలు. అసలు పెళ్లి చేసుకోడానికే యువత మొగ్గు చూపడం లేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అందుకే అక్కడ పెళ్లిళ్లు తగ్గిపోయాయి, పిల్లలు కూడా తగ్గిపోయారు. ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ వరకు జపాన్ లో మొత్తం 5,99,636మంది పిల్లలు పుట్టారు. ఆ సగటు లెక్క తీస్తే ఈ ఏడాది మొత్తమ్మీద 8,11,000మంది పిల్లలు మాత్రమే పుడతారని అంచనా. జపాన్ జనాభాతో పోల్చి చూస్తే ఈ జననాల సంఖ్య చాలా తక్కువ. అందుకే అక్కడి ప్రభుత్వం హడలిపోతోంది, హడావిడి పడుతోంది.

ఎందుకీ పరిస్థితి..?

జపాన్, ప్రపంచంలోనే మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థను కలిగి ఉంది. అక్కడ జీవన వ్యయాలు చాలా ఎక్కువ. కొంత కాలంగా జపాన్ లో వేతనాల పెంపు అంతంతమాత్రంగానే ఉంది. దీంతో పెళ్లి, పిల్లలు అంటేనే ప్రజలు హడలిపోతున్నారు. జపాన్ లో జననాల సంఖ్య గణనీయంగా తగ్గిపోవడంపై కన్జర్వేటివ్‌ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. పిల్లలకోసం అనేక రకాల పథకాలు ప్రవేశ పెట్టింది. గర్భం దాల్చినందుకు, పిల్లలు పుట్టినందుకు, పిల్లల సంరక్షణకు పలు రకాల రాయితీలు ప్రకటిస్తోంది. అయితే ఇవేవీ పెద్దగా ఫలితాలనివ్వకపోవడం విశేషం. ఉద్యోగ అవకాశాలు లేకపోవడం, ప్రయాణాలకు కష్టపడాల్సి రావడం, భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేయడానికి అక్కడి పరిస్థితులు అనుకూలించకపోవడంతో జపాన్ యువత పెళ్లి, పిల్లలపై ఆసక్తి తగ్గించేసింది.

1973 నుంచీ ఇంతే..

1973 సమయంలో జపాన్ లో జననాల సంఖ్య ఏడాదికి 21 లక్షలుగా ఉండేది. అప్పటినుంచి ఏడాదికేడాది జననాలు పూర్తిగా తగ్గిపోతున్నాయి. ఈ ఏడాది 8.11 లక్షలకు జననాల సంఖ్య తగ్గిపోయింది. ౨౦౪౦ నాటికి కేవలం 7.40 లక్షలమంది మాత్రమే ఏడాదికి జన్మిస్తారని సర్వేలు చెబుతున్నాయి. 14 ఏళ్ల క్రితం 12.5 కోట్లుగా ఉన్న జపాన్ జనాభా, 2060 నాటికి 8.67 కోట్లకు తగ్గిపోతుందని అంచనా.

జనాభా తగ్గితే మంచిదేకదా..

చైనా, భారత్ వంటి దేశాలు జనాభా తగ్గాలని బలంగా కోరుకుంటున్నా.. జనాభా విపరీతంగా పెరిగిపోతోంది. జపాన్ లో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. జననాల సంఖ్య తగ్గితే సహజంగానే కొన్ని సంవత్సరాల తర్వాత యువతరం తగ్గిపోతుంది, వృద్ధుల సంఖ్య ఆటోమేటిక్ గా పెరిగిపోయినట్టు అనిపిస్తుంది. ఇప్పటికే జపాన్ లో వృద్ధులు ఎక్కువయ్యారు. సైన్యంలో చేరేందుకు కూడా యువత దొరకడంలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం పిల్లలకోసం చేపట్టిన పథకాలు సత్ఫలితాలు ఇవ్వడంలేదు.

Tags:    
Advertisement

Similar News