ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొంతెత్తిన రచయితకు మరణ శిక్ష‌!

అక్టోబర్ 12న ఆ ఇంటర్వ్యూ ప్రసారం పూర్తి కాగానే అదే రోజు ఇరాన్ ప్రభుత్వం ఆయనను అరెస్టు చేసింది. ఆయనపై గూఢచర్యం ఆరోపణలు మోపి విచారణ జరిపి నిన్న ఉరి శిక్ష విధించింది.

Advertisement
Update: 2023-01-03 11:01 GMT

మత సామరస్యం, మత సహజీవనాన్ని ప్రచారం చేసే ఇరానియన్ రచయిత, చిత్రకారుడు మెహదీ బహ్మాన్ కు ఇరాన్ ప్రభుత్వం మరణశిక్ష విధించింది.

ఓ ఇజ్రాయిల్ టీవీ ఛానల్ కు ఆయన ఏప్రిల్ 2022లో ఇంటర్వ్యూ ఇచ్చాడు. అందులో ఆయన ఇరాన్ ప్రభుత్వం పై విమర్శలు ఎక్కుపెట్టాడు. దేశంలో ఇస్లామిక్ చట్టాన్ని విధించడాన్ని ఆయన వ్యతిరేకించాడు. అదే సమయంలో ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య సంబంధాలను పునరుద్దరించాలని పిలుపునిచ్చారు.

ఈ ఇంటర్వ్యూను ఆ ఛానల్ అక్టోబర్ 12 న టేలీకాస్ట్ చేసింది. ఆ సమయంలో దేశం అల్లకల్లోలంగా ఉంది.

సెపటంబర్ లో హిజాబ్ సరిగా ధరించలేదనే సాకుతో మహ్సా అమినీ అనే యువతిని మోరల్ పోలీసులు అరెస్టు చేసి చిత్రహింసలు పెట్టి చంపేశారు. ఆ తర్వాత దేశవ్యాప్తంగా ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమం ఊపందుకుంది. వేల మంది రోడ్లమీదికి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొంతు విప్పారు. మహిళలు హిజాబ్ లను కాల్చేశారు. జుట్టు ను కత్తిరించుకున్నారు. ఈ ఉద్యమ సమయంలో పోలీసు కాల్పుల్లో వందలాది మంది మరణించారు. వేలాది మంది జైళ్ళ పాలయ్యారు. అనేక మందిని ఉరితీసింది ప్రభుత్వం. ఈ నేపథ్యంలో రచయిత, చిత్రకారుడు మెహదీ బహ్మాన్ తో చేసిన ఇంటర్వ్యూను ఇజ్రాయిల్ ఛానల్ ప్రసారం చేసింది.

అక్టోబర్ 12న ఆ ఇంటర్వ్యూ ప్రసారం పూర్తి కాగానే అదే రోజు ఇరాన్ ప్రభుత్వం ఆయనను అరెస్టు చేసింది. ఆయనపై గూఢచర్యం ఆరోపణలు మోపి విచారణ జరిపి నిన్న ఉరి శిక్ష విధించింది.

మెహదీ బహ్మాన్ రచయితే కాకుండా గొప్ప చిత్రకారుడు కూడా. అతను షియా మతాధికారి మసౌమీ టెహ్రానీతో కలిసి వివిధ మతాల చిహ్నాలతో కూడిన‌ కళాకృతులను రూపొందించారు. తరువాత అతను ఈ చిహ్నాలను ఇరాన్‌లోని మైనారిటీ యూదు, క్రిస్టియన్, జొరాస్ట్రియన్, సున్నీ ఇస్లాం, మాండయన్ సబియన్, బహాయి కమ్యూనిటీల నాయకులకు బహుమతిగా ఇచ్చాడు. మత సామరస్యం కోసం ఆయన నిరంతరం కృషి చేశారు.

రచయిత, చిత్రకారుడు మెహదీ బహ్మాన్ కు ఉరి శిక్ష విధించడం పట్ల ఇరాన్ లోనే కాక ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వస్తున్నాయి.

Tags:    
Advertisement

Similar News