ఈ అమీబా మెదడును తినేస్తుంది..! - ఒక్కసారి సోకితే బతకడం కష్టం
అరుదైన ఇన్ఫెక్షన్ బారిన పడి దక్షిణ కొరియాలో ఓ వ్యక్తి (50) మృతిచెందాడు. `ప్రైమరీ అమీబిక్ మెనింజోఎన్‌సైఫలిటీస్ (పీఏఎం)` అని పిలిచే ఈ ఇన్ఫెక్షన్ థాయ్‌లాండ్‌లో అతనికి సోకింది.
ఓ పక్క కోవిడ్ వైరస్ ప్రపంచాన్ని కుదిపేస్తుంటే.. అక్కడక్కడ వెలుగుచూస్తున్న కొత్త వైరస్‌లు, ఇన్ఫెక్షన్లు ప్రజలను మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా అరుదైన ఇన్ఫెక్షన్ బారిన పడి దక్షిణ కొరియాలో ఓ వ్యక్తి (50) మృతిచెందాడు. `ప్రైమరీ అమీబిక్ మెనింజోఎన్‌సైఫలిటీస్ (పీఏఎం)` అని పిలిచే ఈ ఇన్ఫెక్షన్ థాయ్‌లాండ్‌లో అతనికి సోకింది. మెదడును తినేసే `నెగ్లేరియా ఫౌలెరి` అనే అమీబా వల్ల అతనికి ఈ ఇన్ఫెక్షన్ సోకింది. అక్కడ నాలుగు నెలలు ఉండి డిసెంబర్ 10న దక్షిణ కొరియాకు వచ్చిన అతను ఇక్కడ మృతిచెందాడు. ఈ విషయాన్ని `ది కొరియా డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ఏజెన్సీ(కేడీసీఏ) ధ్రువీకరించింది.
ఔషధం లేదు...
అమీబా ఏకకణ జీవి, దాని ఆకారాన్ని మార్చగల సామర్థ్యం దానికి ఉంది. ఇవి సాధారణంగా చెరువులు, సరస్సులు, నెమ్మదిగా కదులుతున్న నదులు వంటి నీటి వనరులలో కనిపిస్తాయి. కొన్నిసార్లు, ఈ ఏకకణ జీవులు మానవ శరీరంలోకి ప్రవేశించి వివిధ అనారోగ్యాలకు కారణమవుతాయి. అయితే ప్రాణాంతకం కావు. `నెగ్లేరియా ఫౌలెరి` మాత్రం మనిషి ప్రాణం తీయగలదు. ఒక్కసారి ఈ అమీబా వల్ల ఇన్ఫెక్షన్ సోకిందంటే ప్రాణాలు కాపాడటం అసాధ్యమనే చెప్పాలి. 1962 నుంచి 2021 మధ్యలో అమెరికాలో 154 మందిపై ఈ అమీబా దాడి చేయగా, నలుగురు మాత్రమే మృత్యువు నుంచి బయటపడ్డారు. మనిషి నుంచి మనిషికి ఈ ఇన్ఫెక్షన్ సోకదని వైద్యులు స్పష్టం చేయడం ఊరటనిచ్చే అంశం. దీనికి ఇప్పటివరకు సరైన వైద్యం అందుబాటులో లేదు.
నెగ్లేరియా ఫౌలెరి ఏం చేస్తుందంటే..
నెగ్లేరియా ఫౌలెరి అమీబా మనిషి ముక్కు ద్వారా శరీరంలోకి చేరుతుంది. మెదడు వద్దకు చేరి దానిని ఆహారంగా భావిస్తుంది. అక్కడి కీలక ప్రాంతాలను తినేస్తుంది. తీవ్రమైన భరించలేని తలనొప్పి ఈ ఇన్ఫెక్షన్ మొదటి లక్షణం. ఆ తర్వాత మానసిక సమతుల్యత దెబ్బతినడం, భ్రాంతికి గురవడం తదితర మార్పులకు గురై బాధిత వ్యక్తి కోమాలోకి వెళ్లిపోతాడు. అమెరికాకు చెందిన సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీపీ) ఈ విషయాన్ని వెల్లడించింది.