జగన్‌కి లేని బాధ మీకెందుకు..? బయటపడ్డ గుమ్మడికాయల దొంగలు

నయానో భయానో వైసీపీ నేతల్ని లోబరచుకోడానికి బీజేపీ ప్రయత్నిస్తుందనేది కేసీఆర్ మాటల సారాంశం. ఇప్పుడు జీవీఎల్ కూడా చేరికలతో బలపడతామని చెబుతున్నారు. అంటే కేసీఆర్ మాటల్ని ఆయన పరోక్షంగా అంగీకరించినట్టే లెక్క.

Advertisement
Update: 2022-11-16 09:20 GMT

ఎట్టకేలకు గుమ్మడికాయల దొంగలు బయటకొచ్చారు, భుజాలు తడుముకున్నారు. ఏపీలో ప్రభుత్వాన్ని అస్థిరపరచే కుట్ర జరుగుతోందంటూ ఇటీవల కేసీఆర్ రెండుసార్లు మీడియా సమక్షంలో ప్రస్తావించారు. ఏపీలో వైసీపీ ఎమ్మెల్యేలతో బేరసారాలు జరుగుతున్నాయని, ప్రభుత్వాన్ని పడగొట్టడానికి బీజేపీ ప్లాన్లు గీస్తోందని చెప్పారు. వాస్తవానికి దీనిపై వైసీపీ రియాక్ట్ కావాల్సి ఉంది. మమ్మల్ని కొనే దమ్ము ఎవరికీ లేదు, మేం అమ్ముడుపోయే వాళ్లలాగా కనిపిస్తున్నామా, మా దైవం ఎప్పటికీ జగనే అనే పడికట్టు పదాలతో ఎమ్మెల్యేలు బయటకొస్తారేమో అనుకున్నారంతా. కానీ అంతా నిశ్శబ్దం. అధిష్టానం ఆదేశమో, లేక అసలీ విషయంలో మనం వేలు పెట్టడం ఎందుకనుకున్నారో.. వైసీపీ ఎంపీ కానీ, ఎమ్మెల్యే కానీ, ఎమ్మెల్సీ కానీ, చివరకు సలహాదారులు కూడా నోరు మెదపలేదు. ఆఖరికి జగన్ కూడా సైలెంట్‌గానే ఉన్నారు. అయితే ఇప్పుడీ విషయంపై బీజేపీ నేతలు స్పందిస్తున్నారు.

ఏపీ ప్రభుత్వాన్ని అస్థిరపరచేందుకు బీజేపీ కుట్ర చేస్తోందన్న తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలను ఖండించారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు. జగన్‌కి లేని బాధ కేసీఆర్‌కి ఎందుకన్నారు. అవన్నీ కట్టుకథలు, కాల్పనిక విషయాలు అని విమర్శించారు. కేసీఆర్ వైసీపీని నడిపిస్తున్నారా లేక ఆ పార్టీ అధికార ప్రతినిధిగా మాట్లాడుతున్నారా అని ప్రశ్నించారు. జాతీయ పార్టీ పెట్టారు కాబట్టి, అన్ని రాష్ట్రాల గురించి మాట్లాడే హక్కు ఉందనుకుంటున్నారా అని అడిగారు జీవీఎల్.

చేరికల మర్మమేంటి నరసింహా..?

ఇక చివరిగా జీవీఎల్ సెలవిచ్చిన విషయాలు వారి యాక్షన్ ప్లాన్‌ని బయటపెట్టాయి. 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ, జనసేన మాత్రమే ఏపీలో కలసి పోటీ చేస్తాయన్నారు జీవీఎల్. అయితే బీజేపీలోకి భారీగా చేరికలు ఉంటాయని హింట్ ఇచ్చారు. ఆ చేరికలు వైసీపీ నుంచి ఉంటే అప్పుడా వ్యూహాన్ని ఏమనాలి. వైసీపీని అస్థిరపరచే కుట్ర అంటే అదే కదా. నయానో భయానో వైసీపీ నేతల్ని లోబరచుకోడానికి బీజేపీ ప్రయత్నిస్తుందనేది కేసీఆర్ మాటల సారాంశం. ఇప్పుడు జీవీఎల్ కూడా చేరికలతో బలపడతామనే చెబుతున్నారు. అంటే కేసీఆర్ మాటల్ని ఆయన పరోక్షంగా అంగీకరించినట్టే లెక్క. అయితే ఇక్కడ జగన్ మౌన ప్రేక్షకుడిగా మిగిలిపోతారా లేక జాగ్రత్తపడతారా అనేది తేలాల్సి ఉంది.

Tags:    
Advertisement

Similar News