కల్తీ ఆహారాలను గుర్తించండిలా..

డబ్ల్యూహెచ్‌ఓ రిపోర్ట్ ప్రకారం కల్తీ ఆహార పదార్థాల వల్ల రోగాల బారిన పడి ప్రపంచ వ్యాప్తంగా ఏటా 2.2 మిలియన్ల మంది మరణిస్తున్నారు. వీరిలో చిన్నపిల్లల సంఖ్య ఎక్కువ. కల్తీ ఆహార పదార్థాలతో గర్భస్రావం, డయేరియా, క్యానర్ల వంటి 200 రకాల వ్యాధులు వ్యాపిస్తాయి.

Advertisement
Update: 2024-05-26 00:30 GMT

ఒకప్పుడు పాలల్లో నీళ్లు కలిపితేనే అయ్యో.. కల్తీ జరిగిందని మొత్తుకునేవాళ్లు. ఇప్పుడు పాలల్లో నీళ్లకు బదులు ప్రమాదకర రసాయనాలే కలుస్తు్న్నాయి. పాలు మాత్రమే కాదు, మార్కెట్లో ఇలాంటి కల్తీ ఆహారాలు బోలెడు ఉన్నాయి. వీటిని తినడం ద్వారా క్యాన్సర్లు, పలు రకాల వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. వీటిని ఎలా గుర్తించాలంటే..

డబ్ల్యూహెచ్‌ఓ రిపోర్ట్ ప్రకారం కల్తీ ఆహార పదార్థాల వల్ల రోగాల బారిన పడి ప్రపంచ వ్యాప్తంగా ఏటా 2.2 మిలియన్ల మంది మరణిస్తున్నారు. వీరిలో చిన్నపిల్లల సంఖ్య ఎక్కువ. కల్తీ ఆహార పదార్థాలతో గర్భస్రావం, డయేరియా, క్యానర్ల వంటి 200 రకాల వ్యాధులు వ్యాపిస్తాయి.

ఇలా కనిపెట్టొచ్చు.

పాలు: కొన్నిరకాల పాలలో డిటర్జెండ్ పౌడర్, యూరియా వంటివి కలుస్తాయి. పాలలా కనిపించే సింథటిక్ మిల్క్‌ కూడా ఉన్నాయి. వీటివల్ల లివర్ పాడవుతుంది. వేడిపాలను గ్లాస్‌లో తీసుకుని దానిలో నిమ్మరసం పిండితే పాలు విరిగిపోవాలి. లేదంటే అవి కల్తీ పాలే. లేదా చిన్నపాత్రలో కాచి చల్లార్చిన పాలను తీసుకుని నాలుగు చుక్కల అయోడిన్ కలపాలి. నీలిరంగులోకి మారితే కల్తీ జరిగినట్టు.

కారం: కారంపొడిలో ఎక్కువగా రంపపు పొట్టు, రంగు వచ్చేలా కాంగోరెడ్ అనే రసాయనం కలుపుతున్నారు. ఇది పెట్రోలియం బై ప్రొడక్ట్. అది క్యాన్సర్‌‌కు దారి తీయొచ్చు.

కారంపొడిని టీ స్పూన్‌లో కొద్దిగా తీసుకుని, దానిలో యాసిడ్ పోయాలి. కారంపొడి మొత్తం గులాబీరంగులోకి మారుతుంది. కాసేపటి తర్వాత దానిలో కొన్నినీళ్లు పోస్తే మళ్లీ ఎరుపురంగులోకి వస్తే అది నిజమైన కారంపొడి.

పసుపు: మొటానిల్ ఎల్లో అనే రంగు కలిపి పసుపు రంగులోకి మారుస్తున్నారు. దీన్ని ప్యాకెట్లలో పెట్టి పసుపుగా మార్కెట్లలో విక్రయిస్తున్నారు. ఇది పెట్రోలియం బై ప్రొడక్ట్. దీన్ని ఎక్కువగా వాడితే పక్షవాతం వస్తుంది.

పసుపు పొడిని కొద్దిగా చెంచాలో తీసుకుని, దానికి యాసిడ్‌ను కలిపితే అది గులాబీ రంగులోకి మారుతుంది. నీళ్లు పోస్తే గులాబీ రంగుపోయి, తిరిగి పుసుపు రంగులోకి వస్తే అది నిజమైన పసుపు పొడి.

టీ పొడి: వాడి పడేసిన టీ పొడికి రంగువేసి మళ్లీ కొత్తదానిలో కలుపుతున్నారు. బరువు ఎక్కువ వచ్చేందుకు టీ పొడిలో సన్నని ఇనుము పొడిన కూడా కలుపుతున్నారు. దీనివల్ల ఊపిరితిత్తులు దెబ్బతింటాయి. శ్వాసకోశ వ్యాధులు వస్తాయి. తడిచేసిన ఫిల్టర్ కాగితంపై టీ పొడిని వేసినప్పుడు ఎరుపు రంగు కనిపిస్తే అది కల్తీకింద లెక్క.

ఉప్పు: ఉప్పులో సుద్దపొడి అనే పదార్థాన్ని కలిపి కల్తీ చేస్తారు. వీటివల్ల అల్సర్లు, గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయి. ఉప్పు కలిపిన నీళ్లను వేడిచేస్తే సుద్దపొడి పైకి తేలిపోతుంది. ఆలుగడ్డ ముక్కపై అయొడైజ్డ్ ఉప్పు జల్లి, కొద్దిగా నిమ్మరసం కలిపాలి. అప్పుడు దానిపై నీలిమచ్చలు ఏర్పడితే అది కల్తీ జరగనట్లు లెక్క.


మిరియాలు: ఎండబెట్టిన బొప్పాయి గింజలు కలిపి మిరియాలుగా అమ్ముతారు కొన్నిచోట్ల. డిస్టిల్డ్‌ వాటర్‌లో గింజలు వేస్తే కొద్దిసేపటికి బొప్పాయి గింజలు పైకి తేలుతాయి. మిరియాలైతే అడుగుకు చేరతాయి.



అవాలు: బ్రహ్మజెముడు గింజలు కలిపి ఆవాలను కల్తీ చేస్తుంటారు. ఇవి తింటే కడుపునొప్పి వస్తుంది. ఆవాలు నీటిలో కలిపితే బ్రహ్మజెముడు గింజలు పైకి తేలుతాయి. ఆవాల్ని చేత్తో నలిపితే గింజలోపలి అంచుల్లో పసుపుఛాయ కనిపిస్తుంది. బ్రహ్మజెముడు విత్తనాలు తెలుపు రంగులో ఉంటాయి.

ఇకపోతే కాకర, బెండ, పచ్చిమిర్చి వంటి ఆకుపచ్చటి కూరగాయలు నిగనిగలాడుతూ కనిపించేందుకు కొన్ని నిషేధిత రంగులు వాడతారు. అనుమానం వస్తే వాటి ముక్కలను తెల్లటి బ్లాటింగ్ పేపర్‌పై వేయాలి. అప్పుడు రంగుల మచ్చలు ఏర్పడితే మోసం జరిగినట్లే. ఇలాగే పండ్ల విషయంలోనూ జరుగుతుంది. కాబట్టి కల్తీ ఆహారాల పట్ల అప్రమత్తంగా ఉంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి.

Tags:    
Advertisement

Similar News