కథా నాయకత్వం లేని నయా సినిమాలు!

ఈ మూడూ రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకి దూరంగా ఆఫ్ బీట్ గా చేసిన ప్రయోగాలు. ఆఫ్ బీట్ కి ఇప్పుడు కాలం కలిసొస్తున్నట్టుంది. బాక్సాఫీసు దగ్గర విఫలమయ్యే వీటిని ఓటీటీ వేదిక ఆదుకుంటోంది.

Advertisement
Update: 2024-05-23 15:56 GMT

ఈ మూడు సినిమాలు- ‘ఓల్డ్’ (హాలీవుడ్), ‘డియర్ ఫ్రెండ్’ (మాలీవుడ్), ‘గార్గి’ (కాలీవుడ్) -చూస్తే కామన్ గా ఒకటి కన్పిస్తుంది- కథా నాయకత్వం లోపించడం. ఈ మూడూ ఆఫ్ బీట్ సినిమాలు. ‘ఓల్డ్’ (జులై 2021) శ్యామలన్ నైట్ తీసిన ఆంగ్ల సినిమా, ‘డియర్ ఫ్రెండ్’ (జూన్ 2022) టోవిన్ థామస్ నటించిన మలయాళ సినిమా. ‘గార్గి’ (జులై 2022) సాయి పల్లవి నటించిన తమిళ సినిమా. ‘ఓల్డ్’ ఒక నవల ఆధారంగా కొత్త ఐడియాతో కూడిన కథ. ‘డియర్ ఫ్రెండ్’ నల్గురు అర్బన్ ఫ్రెండ్స్ కథ. ‘గార్గి’ చైల్డ్ రేప్ చుట్టూ కథ. ఈ మూడూ రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకి దూరంగా ఆఫ్ బీట్ గా చేసిన ప్రయోగాలు. ఆఫ్ బీట్ కి ఇప్పుడు కాలం కలిసొస్తున్నట్టుంది. బాక్సాఫీసు దగ్గర విఫలమయ్యే వీటిని ఓటీటీ వేదిక ఆదుకుంటోంది. కాబట్టి ఏ మేకర్ ఏ తన సొంత పంథాలో, ప్రేక్షకుల అభీష్టాలతో నిమిత్తం లేకుండా, ఏ కథ ఎలా చెప్పాలనుకున్నా, ఓటీటీని నమ్ముకుని చెప్పేయవచ్చు. పై మూడు సినిమాల్లో రెండు ఆఫ్ బీట్ సినిమాలూ బాక్సాఫీసు దగ్గర విఫలమై ఓటీటీ కొచ్చినవే!

‘ఓల్డ్’ ప్రపంచ వ్యాప్తంగా 57 మార్కెట్లలో 90 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. దీని బడ్జెట్ వచ్చేసి 18 మిలియన్ డాలర్లు. హాలీవుడ్ కి అతిపెద్ద గ్లోబల్ మార్కెట్ వుంది కాబట్టి ఈ ఆఫ్ బీట్ ఈ మాత్రం వసూలు చేయగల్గింది. కానీ శ్యామలన్ తీసిన గత సినిమాలతో పోలిస్తే నిరాశే. ‘ఆఫ్టర్ ఎర్త్’ (2013) 251 మిలియన్ డాలర్లు, ‘స్ప్లిట్’ (2016) 279 మిలియన్ డాలర్లు, ‘గ్లాస్’ (2019) 247 మిలియన్ డాలర్ల బాక్సాఫీసు ముందు ‘ఓల్డ్’ బాక్సాఫీసు వసూళ్ళు దిగదుడుపే.

‘డియర్ ఫ్రెండ్’ మలయాళం 10 కోట్ల బడ్జెట్ కి కేవలం 56 లక్షల బాక్సాఫీసుతో భారీ ఫ్లాపుగా తేలింది. ‘గార్గి’ 5 కోట్ల బడ్జెట్ తో తమిళ, తెలుగు, కన్నడ భాషల్లో బాక్సాఫీసు బడ్జెట్ ని రీచ్ కాలేదు. ఇంత తక్కువ శాతంలో ప్రేక్షకులు థియేటర్లకి హాజరయ్యారు ఈ రెండు ఆఫ్ బీట్స్ కి. ఆఫ్ బీట్, ఆర్టు, వాస్తవిక సినిమా ఇవన్నీ ఒకటే, పేర్లు వేరు. ఇవి తీస్తే ఓటీటీ కోసమే తీయాలే తప్ప మరో మార్గం లేదు. వీటిని ఎంత తక్కువ బడ్జెట్ తో తీసినా బాక్సాఫీసుని అందుకోలేవు, అవార్డులు అందుకోవచ్చు.

1970-80 లలో ఆర్ట్ సినిమాల ఉద్యమం కొనసాగినప్పుడు ఆఫ్ బీట్ సినిమాలు నిలబడ్డాయి. తర్వాతి దశాబ్దంలో ఆర్ట్ సినిమాల కాలం చెల్లిపోయాక, 2000 లో ఆర్ట్ సినిమాల ప్రముఖుడు శ్యామ్ బెనెగల్ ఆర్టు నీ, కమర్షియల్ విలువల్నీ కలగలిపి క్రాసోవర్ సినిమాలనే మల్టీప్లెక్స్ సినిమాలకి తెరతీసి కొత్త బాట వేశారు. ఈ బాటలో కొత్త తరం దర్శకులు క్రాసోవర్ సినిమాలు తీస్తూ పోయారు. నేటికీ ఇవి వున్నాయి - కాకపోతే సెమీ రియలిస్టిక్ గా పేరు మారింది. సినిమాల చరిత్ర తెలుసుకోక పోతే సమకాలీన సినిమా అందించలేరు. ‘గార్గి’ 1970-80 లలో తీయాల్సిన ఆర్ట్ సినిమా.

మేకర్ తెలియక ఆర్ట్ సినిమాగా తీసినా, ఇంట్లో కూర్చుని వీటిని ఓటీటీల్లో చూసేస్తారు ప్రేక్షకులు- అన్ని సినిమాలకి కలిపి ఒక సంవత్సర చందా తప్ప, సినిమాకో చెల్లింపు అని వుండదు గనుక. అదే థియేటర్ కెళ్ళి పెద్ద తెర మీద చూడాలంటే మాత్రం థియేటర్ సినిమా వుండాల్సిందే. అంటే కమర్షియల్ సినిమా. అంటే కథా నాయకత్వమున్న సినిమా. అంటే కథని కథలా చూపించే సినిమా.

పై మూడూ కథని కథలా చూపించలేదు. కథ అంటేనే చాలా అలుసైపోయిన సరుకై పోయింది ఈ మధ్య. ఎవరిష్టమొచ్చినట్టు వాళ్ళు తీస్తారు. నిర్మాత నెత్తి మీద గొడ్డలి పెట్టి, నా సినిమా నా ఇష్టమంటాడు మేకర్. ఇతడికేం హక్కుందో తెలీదు. వార్తని వార్తలా చూపించక పోతే వార్త ఎలా కాదో, కథని కథలా చూపించక పోతేనూ అంతే. ‘మంత్రి గారు శంఖు స్థాపనకి వెళ్ళారు’ అని వార్త ప్రారంభించి - ఆహ్వానితులతో కలిసి విందారగించారు, ముచ్చటించారూ అంటూ చెప్పుకొస్తూ- అసలు శంఖు స్థాపన చేశాడా లేదా, చేస్తే ఆ సందర్భంగా ఆ పథకం గురించి ఏం వ్రాక్కుచ్చాడో చెప్పకపోతే అది వార్త ఎలా కాదో, కథని కథలా చెప్పేక పోతే అదలా సినిమా కాకుండా శ్రీలంక అవుతుంది. ప్రేక్షకులు బాక్సాఫీసు మీద తిరగబడే రోజులు కూడా త్వరలోనే వస్తాయి. ప్రస్తుతం బాక్సాఫీసుతో ఎందుకులే అని సినిమాల జోలికెళ్ళడం లేదు.

‘ఓల్డ్’ లో ఒక రిసార్ట్స్ లో గడపడాని కెళ్ళిన మూడు కుటుంబాలు సముద్రపు టొడ్డున విచిత్ర పరిస్థితి నెదుర్కొంటాయి. వాళ్ళ వయస్సు అరగంటకి ఒక ఏడాది చొప్పున పెరిగి పోతూంటుంది. పెద్దవాళ్ళు ముసలి వాళ్ళయి పోతారు, చిన్న పిల్లలు టీనేజీ కొచ్చేస్తారు. ఈ వింత పరిస్థితి నుంచి ఎలా తప్పించుకున్నారన్నది ఈ కొత్త ఐడియాతో కథ.

యుగాలు మారినా కథకుండే ప్రజాదరణ మారదు. ఎందుకంటే వాటిలో వుండేది ప్రధాన పాత్ర కథా నాయకత్వం. కథానాయకత్వం లేని కథ కథలా వుండదు, అప్పట్లో పాలకులు పారిపోయిన శ్రీలంకలా వుంటుంది. ‘ఓల్డ్’ లో వుండడానికి గేల్ గార్షియా బెర్నాల్ అనే అతను హీరోగా వుంటాడు గానీ, కథ అతన్తో వుండదు. ఎవరితోనూ వుండదు. అందరితో గంప గుత్తగా, అతుకుల బొంతలా వుంటుంది. హీరో కుటుంబంతో బిగినింగ్ మాత్రం వుంటుంది. సమస్య ప్రారంభమయ్యాక మిడిల్ సంఘర్షణ అతడితో వుండదు. పెరిగిపోయే వయసుతో మూడు కుటుంబాల అనుభవాలే చూపిస్తూ చూపిస్తూ ముగిసిపోతుంది సినిమా. ఒక మంచి కొత్త ఐడియా అద్భుతాలు చేయకుండా ఇలా పాడయి పోయింది.

2014 లో క్రిస్టఫర్ నోలన్ తీసిన 'ఇంటర్ స్టెల్లార్' లో హీరో మాథ్యీవ్ మెక్ కానే అంతరిక్ష పరిశోధనలో భాగంగా ఓ గ్రహం మీది కెళ్తాడు. ఆ గ్రహం మీద ఒక గంట భూమ్మీద 7 సంవత్సరాలతో సమానం. అతను తిరిగి భూమ్మీదికి మూడు గంటల్లో చేరుకుంటాడు. చేరుకుని చూస్తే, భూమ్మీద 21 ఏళ్ళు గడిచిపోయి వుంటాయి. తను 21 ఏళ్ళనాటి యువకుడుగానే వుంటాడు. తన కూతురు, కొడుకు తనకంటే పెద్దవాళ్లయిపోయి వుంటారు! అద్భుత కల్పన ఇది. ఇలాటి అద్భుతాన్ని 'ఓల్డ్' తో ప్రేక్షకులకి అందించలేక పోయాడు శ్యామలన్.

'డియర్ ఫ్రెండ్' మలయాళంలో నల్గురు అర్బన్ ఫ్రెండ్స్ వాళ్ళ షోకులూ సరదాలూ సెంటిమెంట్లతో ఫస్టాఫ్ అంతా గడిపేస్తారు. అంటే ఫస్టాఫ్ లో కథ లేదు. సెకండాఫ్ లో కథేదో ప్రారంభమవుతుంది. టోవిన్ థామస్ కనిపించకుండా పోతాడు. మిగతా ముగ్గురూ వెతకడం మొదలెడతారు. వెతుకుతూ వెతుకుతూవుంటే, ముగింపపులో కన్పిస్తాడు. ఏంట్రా ఏమైపోయావ్ అంటే, దానికేదో కారణం చెప్తాడు, చాలా ఫీలైపోయి కావలించుకుంటారు. అయిపోతుంది సినిమా. కథా నాయకత్వం లేకుండా ఇది అర్బన్ ఫ్రెండ్స్ కథట. బడ్జెట్లో 5 శాతం కలెక్షన్స్ చేసింది మరి. 2005 లో శేఖర్ కమ్ముల తీసిన 'హేపీడేస్' లో కాలేజీ ఫ్రెండ్స్ లో హీరో వరుణ్ సందేశ్ కథానాయకత్వం వహిస్తూ స్క్రీన్ ప్లేకి త్రీయాక్ట్ స్ట్రక్చర్ నేర్పరుస్తాడు.

ఇక 'గార్గి' విషయం. చైల్డ్ రేప్ కేసులో ఇరుక్కున్న తండ్రిని కాపాడే కథ, టీచర్ గా సాయిపల్లవి ఈ తండ్రిని కాపాడుకునేందుకు లాయర్ని ఆశ్రయిస్తుంది. ఇక ఆ లాయర్ కథ నడుపుతాడు. సాయిపల్లవి అతడితో వుంటుంది ఈ కష్టానికి బాధపడుతూ. కథానాయకత్వం వదులుకున్న ఆమె సీన్లన్నీ బాధపడుతూ వుండే సీన్లే- ముగింపులో మాత్రమే ఎవరేమిటో తెలుసుకునే వరకూ. అంటే ఇది బాక్సాఫీసుకి భారమై ఓటీటీని ఆశ్రయించే పరిస్థితి అన్నమాట.

ఈ మూడు సినిమాలే కాదు, ఇవి మచ్చుకి మూడు సినిమాలు. ఇలాటి సినిమాలు ఇప్పటికీ తీస్తూనే వున్నారు. తాజాగా సుహాస్ తో ‘ప్రసన్న వదనం’ కూడా. ఇదైతే విడుదలైన వారం తిరక్కుండానే ఓటీటీలోకి వచ్చేసింది. పైన చెప్పుకున్నట్టు ఇలాటి సినిమాలకి ఓటీటీలే దిక్కు.

సినిమా కథ నాయకుడి మీద వుండక పోతే అది సినిమా కథెలా అవుతుందన్నది ప్రశ్న. ఇలాటి సినిమాలకి హీరో దేనికి? పారితోషికాలు దేనికి? తన మీద కథే లేని హీరో కలెక్షన్లు ఎలా తెచ్చి నిర్మాతకి అప్పజెప్తాడు? అయినా ఈ ప్రశ్నలు అనవసరం. ప్రశ్నలంటే మేకర్స్ కి ఎలర్జీ!

Tags:    
Advertisement

Similar News