Love Me If You Dare Review: లవ్ మీ ఇఫ్ యూ డేర్ –రివ్యూ! {1.75 /5}

Love Me If You Dare Telugu Movie Review: ఆశీష్ రెడ్డి హీరోగా 2022 లో కాలేజీ యాక్షన్ ‘రౌడీ బాయ్స్’ తో పరిచయమయ్యాడు గానీ అది సక్సెస్ కాలేదు. తిరిగి ఇప్పుడు ‘లవ్ మీ ఇఫ్ యూ డేర్’ అనే రోమాంటిక్ హార్రర్ లో నటించాడు.

Advertisement
Update: 2024-05-25 10:21 GMT

చిత్రం: లవ్ మీ ఇఫ్ యూ డేర్

రచన- దర్శకత్వం : అరుణ్ భీమవరపు

తారాగణం : ఆశీష్ రెడ్డి, వైష్ణవీ చైతన్య, రవి కృష్ణ, సిమ్రాన్ చౌదరి తదితరులు

సంగీతం: ఎంఎం కీరవాణి, ఛాయాగ్రహణం : పీసీ శ్రీరామ్

బ్యానర్ : శ్రీ వెంకటేశ్వర ఎంటర్ టైన్మెంట్స్

నిర్మాతలు: హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి, నాగ మల్లిడి

విడుదల : మే 25, 2024

రేటింగ్: 1.75 /5

ఆశీష్ రెడ్డి హీరోగా 2022 లో కాలేజీ యాక్షన్ ‘రౌడీ బాయ్స్’ తో పరిచయమయ్యాడు గానీ అది సక్సెస్ కాలేదు. తిరిగి ఇప్పుడు ‘లవ్ మీ ఇఫ్ యూ డేర్’ అనే రోమాంటిక్ హార్రర్ లో నటించాడు. ఇందులో హిట్టయిన ‘బేబీ’ నటి వైష్ణవీ చైతన్య హీరోయిన్. అరుణ్ భీమవరపు కొత్త దర్శకుడు. దిల్ రాజు బ్యానర్. ఇన్ని హంగులున్న ఈ సినిమా ఈ సమ్మర్ స్లంప్ లో విడుదలైంది. మరి ఇది సేద తీర్చేదా, వేడి పెంచేదా? ఆశీష్ రెడ్డికి ఈసారైనా హిట్టా కాదా? కొత్త దర్శకుడు ఎంతవరకు కొత్త విషయం తోవచ్చాడు? ఇవి తెలుసుకుందాం...

కథ

అర్జున్ (ఆశీష్ రెడ్డి) యూట్యూబర్ గా అంతుచిక్కని రహస్యాలుగా మిగిలిపోయిన ఉదంతాలపై వీడియోలు చేస్తూంటాడు. ఎవరెంత వారించినా పాడు పడిన భవనాలు, శ్మశానాలు పట్టుకు తిరుగుతూంటాడు. ఇతడికి తోడుగా ప్రతాప్(రవికృష్ణ) వుంటాడు. ప్రతాప్ గర్ల్ ఫ్రెండ్ ప్రియా(వైష్ణవి చైతన్య) కూడా వీళ్ళతో జత కడుతుంది. ఓ రోజు దివ్యవతి అనే దయ్యం గురించి తెలుస్తుంది. ఆ దెయ్యం తన దగ్గరికి వచ్చిన వాళ్ళని చంపేస్తుందని తెలియడంతో దాని కథ తెలుసుకోవాలని అర్జున్ వెళ్తాడు. వెళ్ళి దాంతో ప్రేమలో పడతాడు. అసలు ఈ దివ్యవతి ఎవరో తెలుసుకోవడం మొదలెడతాడు. ఈ క్రమంలో ఇంకో ముగ్గురు అమ్మాయిలు చనిపోయినట్టు తెలియడంతో, వాళ్ళకి దివ్యవతికి సంబంధమేమిటని వెతకడం మొదలుపెడతాడు.

అసలు దివ్యవతి ఎవరు? ఆమె ఎలా చనిపోయింది. అర్జున్ తనని ప్రేమిస్తే ఏం చేసింది? చనిపోయిన ఆ ముగ్గురు అమ్మాయిలు ఎవరు? ఎలా చనిపోయారు? అర్జున్ దయ్యాన్ని ఎందుకు ప్రేమించాడు? చివరికి ఏం తేలింది? ఇదీ మిగతా కథ.

ఎలావుంది కథ

ఈ రోమాంటిక్ హార్రర్ కథ హీరో దెయ్యాన్ని ప్రేమించడం గురించి. హీరో దెయ్యాన్ని ప్రేమించే కథతో శ్రీ విష్ణు నటించిన హార్రర్ కామెడీ ‘ఓం భీమ్ బుష్’ రెండు నెలల క్రితమే వచ్చేసింది. కాబట్టి ‘లవ్ మీ ఇఫ్ యూ డేర్’ తో కొత్త అనుభూతేమీ కలగదు. పైగా దెయ్యాన్ని ప్రేమించే కథతో ‘ఓం భీమ్ బుష్’ విఫలమైనట్టే, కథ చేసుకోలేక ఇది కూడా ఫ్లాప్ ముద్రవేసుకుంది.

సినిమా కథలో కథాపరంగా ఎదురయ్యే ప్రశ్నల్ని డామినేట్ చేస్తూ అసలేం కథ చెప్పారు, ఏం చెప్పాలనుకున్నారు, ఎందుకు చెప్పాలనుకున్నారు... వంటి ప్రశ్నలే వెంటాడుతూంటాయి. కొత్త దర్శకుడు తాను కన్ఫ్ఫ్యూజ్ అయి, ఎంతో కొంత ఆరోగ్యంగా వున్న ప్రేక్షకుల్నీ కన్ఫ్యూజ్ చేసి ఆస్పత్రికి వెళ్ళేట్టు చేశాడు. సినిమాలో హార్రర్ ఏమీ ఫీలవ్వంగానీ, దీన్ని దిల్ రాజు బ్యానర్ లో ఎలా తీశారా అని భయభ్రాంతులకి లోనవుతాం.

ఇది రోమాంటిక్ హార్రర్ అయినప్పుడు ఈ కథకే కట్టుబడక దెయ్యమైన హీరోయిన్ ఎలా చనిపోయిందీ, ఇంకో ముగ్గురు ఎలా చనిపోయారూ అనే ఇన్వెస్టిగేషన్ కథగా తయారు చేయబోవడంతో - ఆ ఇన్వెస్టిగేషన్ కూడా చేతగాక అసలుకే ఎసరు తెచ్చింది. దెయ్యం- హీరో మధ్య ఒక ఇంట్రెస్టింగ్ రోమాంటిక్ స్టోరీని చూపించాల్సింది పోయి- అవసరం లేని ఇన్వెస్టిగేటివ్ కథగా చేశారు.

రోమాన్స్ మీదే దృష్టి పెట్టివుంటే, ఆ రోమాన్సులో హీరో అసలెందుకు దెయ్యంతో ప్రేమలో పడ్డాడనే దాన్ని చూపించడం కుదిరేది. ఒక దెయ్యంతో ఎందుకు ప్రేమలో పడ్డాడో చెప్పకుండా ఇంకేం చెప్పినా కథని ఫాలో అవడం కష్టం. దెయ్యంతో హీరోకి ఏ ఫీలింగూ, ఎమోషన్లూ లేకుండా ‘ప్రేమిస్తూనే’ వుంటాడు.

ఫస్టాఫ్ లో దెయ్యం ఫ్లాష్ బ్యాక్ తర్వాత ప్రేమలో పడ్డం వరకూ ఫర్వా లేదనుకున్నా, సెకండాఫ్ లో మరో ముగ్గురు అమ్మాయిల దెయ్యం కథలు, వాటికీ ఇన్వెస్టిగేషన్లు ఎత్తుకోవడంతో గందరగోళమైపోయింది సినిమా. అసలు కథ నుంచి తెగిపోయి కొసరు కథలు చెప్పుకునే ఖర్మానికి దిగజారిపోయింది. చాలా కన్ఫ్యూజన్ తో భరించడం కష్టంగా తయారైంది. ఇక చివరి వరకూ సస్పెన్సు కోసం దాచిన విషయం తీరా ఓపెన్ చేస్తే విషయం లేక ముగింపు చతికిల బడింది. 2003 లో మహేష్ భట్ తీసిన ‘సాయా’ రోమాంటిక్ హార్రర్ మిస్టరీ ముగింపు ఎంత కదిలించేదిగా వుంటుందని? ఆత్మతో ఊహించని విషయం బయట పడుతుంది.

నటనలు- సాంకేతికాలు

ఆశీష్ సీరియస్ గా, మూడీగా కనిపిస్తాడు. అతడిది సీరియస్ ఇన్వెస్టిగేషన్, నాన్ సీరియస్ లవ్. కథ అందించిన పాత్రని బట్టి ఇంతే అనుకుని నటించినట్టున్నాడు. అసలు కథేమిటో అర్ధమైతే పాత్రేమిటో తీర్చిదిద్దగలడు దర్శకుడు. కాబట్టి ఆశీష్ ని కూడా భరించక తప్పదు. హెల్ప్ చేసే పాత్రగా హీరోయిన్ వైష్ణవీ చైతన్య ఫర్వాలేదు. పాత్ర నిడివి కూడా వుంది. హీరో ఫ్రెండ్ గా రవికృష్ణ కూడా ఫర్వా లేదు. ఇక దెయ్యాలుగా కనిపించే నటీమణులు కన్ఫ్యూజన్ ని క్రియేట్ చేయాడానికి పనికొచ్చారు.

కీరవాణి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ తప్ప పాటలు ఎందుకో ఆయన స్థాయిలో లేవు. టాప్ సినిమాటోగ్రాఫర్ పిసి శ్రీరామ్ ఛాయాగ్రహణం వల్ల విజువల్స్ ఉన్నతంగా వచ్చాయి. ప్రొడక్షన్ విలువలకి కొదవేమీ లేదు, పెద్ద బ్యానర్ కాబట్టి. కానీ పెద్ద బ్యానర్ నుంచి ఇలాటి సినిమా రావడమే విచిత్రం. అదీ ప్రేక్షకులు రాని ఈ సమ్మర్ స్లంప్ లో!


Full View


Tags:    
Advertisement

Similar News