Enola Holmes 2: 'ఎనోలా హోమ్స్ 2' - సండే స్పెషల్ రివ్యూ

Enola Holmes 2: జగత్ప్రసిద్ధ బ్రిటిష్ డిటెక్టివ్ పాత్ర షెర్లాక్ హోమ్స్ గురించి తెలియని వారుండరు. షెర్లాక్ హోమ్స్ మీద చాలా సినిమాలొచ్చాయి. షెర్లాక్ హోమ్స్ చెల్లెలితో రాలేదు. షెర్లాక్ హోమ్స్ టీనేజీ చెల్లెలు డిటెక్టివ్ ఎనోలా హోమ్స్ సాహసాలతో సీక్వెల్స్ ప్రారంభమయ్యాయి.

Advertisement
Update: 2022-11-06 08:40 GMT

జగత్ప్రసిద్ధ బ్రిటిష్ డిటెక్టివ్ పాత్ర షెర్లాక్ హోమ్స్ గురించి తెలియని వారుండరు. షెర్లాక్ హోమ్స్ మీద చాలా సినిమాలొచ్చాయి. షెర్లాక్ హోమ్స్ చెల్లెలితో రాలేదు. షెర్లాక్ హోమ్స్ టీనేజీ చెల్లెలు డిటెక్టివ్ ఎనోలా హోమ్స్ సాహసాలతో సీక్వెల్స్ ప్రారంభమయ్యాయి. 2020 లో 'ఎనోలా హోమ్స్' విడుదలై విపరీత జనాదరణ పొందాక, దీని సీక్వెల్ గా నవంబర్ 4 న 'ఎనోలా హోమ్స్ 2' విడుదలైంది. నెట్ ఫ్లిక్స్ లో హిందీ ఆడియోతో అందుబాటులో వున్న ఈ డిటెక్టివ్ ఫన్ థ్రిల్లర్ ప్రశంసలందుకుంటోంది. డిటెక్టివ్ ఎనోలాగా తిరిగి మిల్లీ బాబీ బ్రౌన్ కాస్త కొంటె తనం, తెగువ గల అదే నటనని ఫన్నీగా కొనసాగించింది. అన్న షెర్లాక్ హోమ్స్ గా హెన్రీ కావిల్ నటించాడు. ఈ సీక్వెల్ కి కూడా హారీ బ్రాడ్ బీర్ దర్శకత్వం వహించాడు. బ్రిటిష్ నటీనటులతో, దర్శకుడితో అమెరికన్ కంపెనీతో బాటు మిల్లీ బాబీ బ్రౌన్ నిర్మాతగా వుంది. 'ఎనోలా' మిల్లీ బాబీ బ్రౌన్ 2004 లో జన్మించిన 18 ఏళ్ళ టీనేజర్.

ఎనోలా పాత్ర ఎలా పుట్టిందని తెలుసుకుంటే, ఈ షెర్లాక్ హోమ్స్ టీనేజర్ చెల్లెలి పాత్రని సృష్టిచింది అమెరికన్ రచయిత్రి నాన్సీ స్ట్రింగర్. యంగ్ అడల్ట్ ఫిక్షన్ కింద ఈ పాత్రని సృష్టించి, ఎనోలా హోమ్స్ మిస్టరీస్ పేరుతో ఏడు నవలలు రాసింది. వీటిలో రెండు సినిమాలుగా వచ్చాయి. 'ఎనోలా హోమ్స్ 2' 19 శతాబ్దపు షెర్లాక్ హోమ్స్ కాలంలోనే పీరియెడ్ మూవీగా వుంటుంది. నేర పరిశోధన అంటే మన తెలుగు సినిమాల్లోలాగా ఇన్వెస్టిగేషన్ తోనే బోరు కొట్టించకుండా, ఇన్వెస్టిగేషన్ కి యాక్షన్ ని జోడించుకుని ఫన్ రైడ్ గా వుంటుందిది. ఈ కథ ఇంగ్లాండులో 1888 లో అగ్గిపెట్టెల కర్మాగారంలో జరిగిన మ్యాచ్ గర్ల్స్ స్ట్రయిక్ (అగ్గిపుల్లల కార్మికురాళ్ళ సమ్మె) ఆధారంగా వుంటుంది.

చదువు మానేసి చలో లండన్ కి...

ఎనోలా హోమ్స్ చదువుకోకుండా తల్లిని వదిలేసి లండన్ పారిపోయి వచ్చి అన్నలాగా డిటెక్టివై, హోమ్స్ వంశం పేరు నిలబెట్టాలనుకుంటుంది. కానీ అన్న షెర్లాక్ హోమ్స్ తన వరల్డ్ ఫేమస్ చిరునామా 221 బేకర్స్ స్ట్రీట్ లో తిరుగులేని డిటెక్టివ్ గా చెలామణి అవుతున్నాడు. అన్నకి తెలియకుండా తను 'హోమ్స్ డిటెక్టివ్ ఏజెన్సీ' అని ప్రారంభించి కూర్చుంటే, రెండు కారణాలతో కేసులు రావడం లేదు : ఒకటి, సొంత ఐడెంటిటీ లేక అన్న చాటు పిల్లగా బ్రతకాల్సి రావడం; రెండు, అమ్మాయి కావడం. దీంతో ఇక లాభంలేదని మూటా ముల్లె సర్దుకోబోతూంటే, ఓ 14 ఏళ్ళ అమ్మాయి బెస్సీ వచ్చి వరంలా కేసు దానమిస్తుంది.

బెస్సీ అక్క సారా కనిపించడం లేదని ఫిర్యాదు. ఎనోలా వాళ్ళింటికి వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. బెస్సీ, సారా అగ్గిపెట్టెల కర్మాగారంలో కార్మికురాళ్ళు. అక్కడేమైనా క్లూ దొరుకుతుందేమోనని ఎనోలా కార్మికురాలిగా చేరుతుంది. వందల మంది కార్మికురాళ్ళని నోటి పరీక్ష జరిపి లోపలికి పంపిస్తూ వుంటారు. అది టైఫస్ విషజ్వరం పరీక్ష. చాలామంది ఈ విషజ్వరంతో చనిపోతున్నారు. కార్మికురాలిగా లోపలికి వెళ్ళిన ఎనోలా కన్నుగప్పి మేనేజర్ ఆఫీసులోకి దూరి పరిశోధన చేస్తుంది. కొన్ని అగ్గిపుల్లలు దొరుకుతాయి. అవి ఇప్పుడు తయారవుతున్న తెలుపు రంగు బదులు ఎరుపు రంగు అగ్గిపుల్లలు.

ఎనోలాకి మే అనే కార్మికురాలి మీద అనుమానం వచ్చి ఆమెని అనుసరిస్తుంది. మధ్యలో బాగా తాగి వస్తున్న షెర్లాక్ హోమ్స్ కనిపిస్తాడు. అతడ్ని ఇంటి దగ్గర దిగబెడుతుంది. అతనొక కేసుని ఛేదించడానికి ఒంటరిగా కష్టపడుతున్నాడని తెలుసుకుంటుంది. తను కూడా తన కేసుతో ఒంటరిగానే కష్టపడుతోంది. ప్రభుత్వాధికారులు పాల్పడుతున్న బ్లాక్ మెయిల్ షెర్లాక్ చూస్తున్న కేసు. అయితే వాళ్ళ ఖాతాల్లోకి డబ్బు ఎక్కడ్నించి వస్తోందో అంతు చిక్కకుండా వుంది.

తర్వాత మే కోసం వెళ్ళిన ఎనోలా అక్కడ మే ని చంపిన నేరం మీదపడి, పట్టుకోవడానికి వచ్చిన స్కాట్ లాండ్ యార్డ్ పోలీసు అధికార్లని కొట్టి పారిపోతుంది. ఇప్పుడు పోలీసుల నుంచి తప్పించుకుంటూ కేసు ఎలా ఛేదించింది ఎనోలా? అసలు సారా ఏమైంది? కార్మికురాళ్ళు టైఫస్‌తో కాకుండా అగ్గిపుల్లల్లో ఉపయోగించే తెల్లటి భాస్వరం వల్ల చనిపోతున్నారని ఎనోలా కెలా తెలిసింది? ఆర్ధిక మంత్రి లార్డ్ మెక్‌ఇంటైర్ లాభాలు సంపాదించడానికి చౌకగా ఉండే భాస్వరాన్ని ఉపయోగించి అగ్గిపుల్లలు ఉత్పత్తి చేస్తున్నాడని ఎప్పుడు తెలిసింది? తన వెంటపడుతున్న స్కాట్ లాండ్ యార్డ్ అధికారులు కూడా బ్లాక్ మెయిలర్సేనా? కౌంటర్ కేసులో పీకల్లోతు ఇరుక్కున్న చెల్లెల్ని షెర్లాక్ హోమ్స్ ఎలా కాపాడాడు? ఇద్దరూ కలిసి అగ్గిపెట్టెల కర్మాగారం కుంభ కోణాన్ని ఎలా రట్టు చేశారు? ఇవన్నీ రసవత్తరంగా సాగే ఈ విక్టోరియా కాలపు మిగతా కథలో తెలుస్తాయి.

మిల్లీ బాబీ బ్రౌనే హైలైట్

ఎనోలా హోమ్స్ గా మిల్లీ బాబీ బ్రౌన్ తో చాలా ఫన్ ఇదంతా. టీనేజీ తెగువ, ప్రమాదాల్ని తేలికగా తీసుకునే తత్వం, హాస్యం, చిలిపితనం, కొంటె తనం- తెలిసీ తెలియక ఏం చేస్తోందో అర్ధంగాని సాహసకృత్యాలు- ఇవన్నీ కలర్ఫుల్ క్యారక్టర్ గా మార్చేశాయి. ప్రారంభమే పోలీసులతో ఛేజింగ్, యాక్షన్; హత్యలో ఇరుక్కునే సన్నివేశంలో పోలీసు అధికారుల్ని మోతమోగించి పారిపోయే ధైర్యం - క్లయిమాక్స్ వరకూ ఇదే స్పీడు. ఆమెలో ప్రవహిస్తోంది హోమ్స్ రక్తం.

చివరికి జైల్లో ఇక ఉరి వేస్తారనగా ఆమె తల్లి వచ్చేసి, జైలరమ్మతో కలిసి కూతుర్ని విడిపించుకుని పారిపోయే దృశ్యం ఇంకా వినోదం. ముగ్గురు ఆడవాళ్ళు గుర్రబ్బగ్గీలో పారిపోతూ వెంటాడుతున్న పోలీసుల్ని - ఎస్పీ సహా- బాంబులతో బెంబేలెత్తించి గెలిచే యాక్షన్ ఎపిసోడ్ ఆ కాలంలో స్త్రీ శక్తిని హైలైట్ చేస్తుంది.

స్త్రీవాదం, పారిశ్రామిక కుట్ర, శ్రామికవర్గ తిరుగుబాటు, ఓ ప్రేమ కథ, తల్లి నుంచి జీవిత పాఠాలు, అన్న నుంచి సహకార గుణం వంటి అంశాలతో ఈ రెండు గంటల సినిమా స్పీడుగా సాగుతుంది. ఎనోలా పాత్రకి ఇంకో టెక్నిక్ వాడారు. ఫోర్త్ వాల్ టెక్నిక్. అంటే పాత్ర కెమెరా వైపు తిరిగి ప్రేక్షకులతో మాట్లాడే ప్రక్రియ. దీంతో అడుగడుగునా ప్రేక్షకులు ఆమెతో ఇన్వాల్వ్ అయిపోతారు. ఆ మాట్లాడే రెండు మాటలు చాలా తమాషాగా వుంటాయి. ఆమె హావభావాలు, శరీర భాషా ఫన్నీగా వుంటాయి.

షెర్లాక్ పాత్రలో హెన్రీ కావిల్ డౌన్ ప్లే చేస్తాడు. ఎనోలా పాత్ర హైలైట్ అవడానికి తను బ్యాక్ గ్రౌండ్ లో వుంటాడు. ఆమె మరీ ప్రమాదంలో పడిపోతే తప్ప ముందుకు రాడు. ఒంటరిగా ఏదైనా సాధించగలననుకునే ఎనోలా, ఒంటరిగా కష్టపడుతున్న అన్న మాటలు వింటుంది. మనుషులు ఒంటరిగా ఏం సాధించలేరని, ఆధారపడడానికి ఒకరుండాలని, షెర్లాక్ చెప్పడంతో ఒప్పుకుంటుంది. 'హోమ్స్ అండ్ హోమ్స్' అని కంబైన్డ్ ఏజెన్సీ ప్రారంభిస్తారు.

ఇంతకీ షెర్లాక్ తో వుండే అసలు తోడు ఏమయ్యాడు? అతను ముగింపులో ఏదో పనుండి వస్తాడు. తన పేరు డాక్టర్ వాట్సన్ అంటాడు. ఇలా నేర పరిశోదనల్లో షెర్లాక్ వెంట వుండే పాపులర్ పాత్ర డాక్టర్ వాట్సన్ పరిచయమవుతుంది. రెండో సీక్వెల్లో ఈ పాత్ర కూడా వుండొచ్చు.

Tags:    
Advertisement

Similar News