పవన్‌పై అలగలేదు.. ఆయనంటే ఎప్పుడూ గౌరవమే.. బండ్ల గణేష్

'జీవితమంతా నేను నా బాస్ ని ప్రేమిస్తూనే ఉంటాను. గౌరవిస్తాను.' అని ట్వీట్ చేశాడు. పవన్‌పై ఏ అలకలేదని బండ్ల గణేష్ వెల్లడించాడు.

Advertisement
Update: 2022-12-05 10:15 GMT

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌పై నిర్మాత, నటుడు బండ్ల గణేష్ అలిగినట్లు వస్తున్న వార్తలపై బండ్ల గణేష్ స్పందించాడు. పవన్‌పై తాను అలగలేదని.. ఆయనంటే ఎప్పుడూ గౌరవమేనని తాజాగా క్లారిటీ ఇచ్చాడు. బండ్ల గణేష్‌కి పవన్ కళ్యాణ్ అంటే ఎంతో అభిమానం. తాను పవన్‌కి భక్తుడినని చెప్పుకుంటూ ఉంటారు. జనసేన పార్టీ అధినేతగా ఉన్న పవన్‌పై రాజకీయ నాయకులు ఎవరైనా విమర్శలు చేసినా బండ్ల గణేష్ వారికి ఘాటుగా కౌంటర్ ఇస్తుంటారు.

పవన్ నటించిన తీన్ మార్ సినిమాతో నిర్మాతగా మారిన బండ్ల గణేష్.. ఆ తర్వాత ఆయనతో గబ్బర్ సింగ్ వంటి హిట్ సినిమాను నిర్మించాడు. కాగా కొద్దిరోజులుగా బండ్ల గణేష్ పవన్‌తో మరో సినిమా చేయాలని ప్రయత్నిస్తున్నాడు. బాస్ ఒప్పుకున్నాడని ఆయనతో మరో సినిమా చేస్తున్నానని కొన్ని నెలల కిందట బండ్ల గణేష్ వెల్లడించాడు. అయితే వారిద్దరి కాంబినేషన్ మాత్రం తెరపైకి రాలేదు.

ఇదిలా ఉండగా కొద్దిరోజుల కిందట బండ్ల గణేష్ మాట్లాడిన ఒక ఆడియో లీక్ బయటపడింది. అందులో దర్శకుడు త్రివిక్రమ్‌ని బండ్ల గణేష్ విమర్శించాడు. ఆయన వల్లే పవన్‌తో తనకు దూరం పెరిగిందని కామెంట్స్ చేశాడు. ముందుగా ఆ ఆడియోలో ఉన్న వాయిస్ త‌న‌ది కాదని చెప్పిన బండ్ల గణేష్.. ఆ తర్వాత తనదేనని ఒప్పుకున్నాడు. ఆ తర్వాత జనసేనలో చేరేందుకు బండ్ల గణేష్ ప్రయత్నించగా అందుకు అవకాశం లభించ లేదని ప్రచారం జరిగింది.

ఈ నేపథ్యంలో ఇటీవల ఇక తాను రాజకీయాలకు దూరం అవుతున్నానని.. రాజకీయాల వల్ల తాను ఎంతో నష్టపోయానని బండ్ల గణేష్ ఒక ప్రకటన చేశాడు. రెండు రోజుల కిందట పవన్ కళ్యాణ్, డీవీవీ దానయ్య నిర్మాణంలో సుజిత్ దర్శకుడిగా ఒక సినిమా ప్రకటించాడు. ఆ సినిమా గురించి అలా ప్రకటన వచ్చిన వెంటనే బండ్ల గణేష్ ఒక ట్వీట్ చేశాడు. వరాలు ఇచ్చే గుడికే వెళ్దాం. దాంతోపాటు ప్రసాదం కూడా తిందాం. లేకపోతే టైం వేస్ట్. టైం ఎక్కువ లేదు. మన ఫ్యామిలీకి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలి.' అని ట్వీట్ చేశాడు.

బండ్ల గణేష్ ఈ ట్వీట్ పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించే చేశాడని మీడియాలో వార్తలు వచ్చాయి. నిర్మాతగా బండ్ల గణేష్‌కు అవకాశం ఇవ్వకుండా వరుసగా ఇతరులకు ఇస్తుండడంతో పవన్‌పై గణేష్ అలిగాడని ప్రచారం జరిగింది. తాజాగా ఈ ప్రచారంపై బండ్ల గణేష్ స్పందించాడు. 'జీవితమంతా నేను నా బాస్ ని ప్రేమిస్తూనే ఉంటాను. గౌరవిస్తాను.' అని ట్వీట్ చేశాడు. పవన్‌పై ఏ అలకలేదని బండ్ల గణేష్ వెల్లడించాడు.

Tags:    
Advertisement

Similar News